రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.30 లక్షల కోట్ల నష్టం
ఎన్నికల సమయంలో పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారు?
బీజేపీకి మెజార్టీ రాదని తెలిసినా షేర్లు కొనాలని ఎందుకు సూచించారు?
200 నుంచి 220 సీట్లు వస్తాయని నిఘా సంస్థలు చెప్పడం నిజం కాదా?
తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెనుక గుట్టు ఏమిటి?
బీజేపీకీ, విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య సంబంధం ఏమిటి?
జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు.
రిటైల్ ఇన్వెస్టర్లను ముంచేశారు
షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటే
మే 13: జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్ షా సూచించారు.
మే 19: జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జూన్ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.
జూన్ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్‌టైమ్ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
జూన్ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.
పస లేని ఆరోపణలు
పీయూష్ గోయల్ మండిపాటు
స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్‌లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment