అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ వెనుక మోదీ, షా : రాహుల్ గాంధీ | Rahul Gandhi demands JPC probe into Biggest stock market scam | Sakshi
Sakshi News home page

అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ వెనుక మోదీ, షా : రాహుల్ గాంధీ

Published Thu, Jun 6 2024 8:32 PM | Last Updated on Thu, Jun 6 2024 9:23 PM

Rahul Gandhi demands JPC probe into Biggest stock market scam

న్యూఢిల్లీ: ‘అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం’లో భాగమైన  ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ  డిమాండ్ చేశారు. మార్కెట్‌లో ఒడిదుడుకులకు, ఇటీవల  పోల్స్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ ఎన్నికల ప్రచార సమయంలో ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు.

మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌తో జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని, ఎన్నికల ఫలితాల రోజు (జూన్‌ 4న) భారీగా నష్టపోయాయని రాహుల్‌గాంధీ అన్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారన్నారు. ఇదొక పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణమని రాహుల్ ఆరోపించారు. మోదీ, అమిత్‌షాతోపాటు  దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టాక్‌ మార్కెట్ల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోదీ, అమిత్ షా దేశంలోని ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని బీజేపీ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ సంబంధం ఏంటని నిలదీశారు.

 ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మరునాడు  జూన్‌ 3న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయని, ఆ తర్వాత జూన్ 4వ తేదీన కుప్పకూలాయని అన్నారు.  సెబీ విచారణలో ఉన్న ఒక బిజినెస్ గ్రూపునకు చెందిన ఒకే మీడియా గ్రూపుకు మోదీ, అమిత్‌ షా ఇద్దరూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికా అంటూ ప్రశ్నలు సంధించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ముందురోజు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ లావాదేవీల పట్టికను విలేకరుల సమావేశంలో రాహుల్‌ ప్రదర్శించారు. ఆ రోజు లావాదేవీల్లో పాల్గొన్నదెవరు? అంతిమంగా లబ్ధి పొందిందెవరు? అంటూ ప్రశ్నించారు. దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారన్నారని అన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు.

కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకుతాయని మే 23న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని, స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement