న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు.
‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment