రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.
భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment