Union Minister Hardeep Singh Puri Praises On AP Government - Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్ల కల్పనలో ఏపీ టాప్‌.. కేంద్రమంత్రి ప్రశంస

Published Mon, Jun 13 2022 8:48 AM | Last Updated on Mon, Jun 13 2022 10:06 AM

Union Minister Hardeep Singh Puri Praises On AP Government - Sakshi

లబ్ధిదారులకు ఇంటి తాళం అందిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్, మంత్రి జోగి రమేష్‌

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. ఆదివారం విశాఖలో పీఎంఏవై, ఉజ్వల పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు.  హర్దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించగా.. అంచనాలకు మించి ఇప్పటివరకు కోటి 22 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
చదవండి: ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! 

ఇందులో ఏపీకి 20 లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకి మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరముందని మంత్రి జోగి రమేష్‌ తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలో వాటిని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా.. అంచనాకు మించి ఇప్పటివరకు 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చామన్నారు.

ముఖాముఖిలో లబ్ధిదారుల మనోభావాలు తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు కేంద్రమంత్రి అందజేశారు. అలాగే రూ.203.56 కోట్లను 42,343 మంది పీఎంఏవై లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని వివరించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్‌ మల్లికార్జున పాల్గొన్నారు.

ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌
గతంలో ప్రభుత్వమిచ్చిన ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రూ.లక్షలు చెల్లించేవారని.. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ కేవలం ఒక్క రూపాయికే నా పేరున ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. మా కుటుంబం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతింట్లో ఉంటున్నాం.
– తులసి త్రివేణి, లబ్ధిదారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement