విశ్లేషణ
వికేంద్రీకరణ అనేది ఆధునిక ప్రజాస్వామిక సూత్రం. అభివృద్ధి అనేది ఒక్కచోటు గంపగుత్తగా పోగుపడటం అనేది ప్రాంతాల మధ్య అసమానతలను పెంచుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టును రద్దు చేయాలని వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భావించడం సముచితమైన నిర్ణయం. అయితే, చాలామంది గుర్తించాల్సినది... ప్రజలతో కూడిన అమరావతి వేరు, నూతన నగర నిర్మాణం కోసం తలపెట్టిన అమరావతి ప్రాజెక్టు వేరు. చండీగఢ్, నయా రాయ్‌పుర్, లవాసా, నోయిడాల అనుభవంతో చూస్తే కొత్త నగర నిర్మాణాలకు ఉన్న పరిమితులు అర్థం అవుతాయి. పది లక్షల జనాభా దాటిన గుంటూరు, విజయవాడలకు సంబంధం లేకుండా, రెండు నగరాలకు 30– 40 కిలోమీటర్ల దూరంలోనే మరో కొత్త నగరం అనేది ఊహకందదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల ప్రయోజనాలను పణంగా పెట్టి... పరి మిత ప్రయోజనాల కోసం దీన్ని చేపట్టడం అర్థరహితం. అందుకే అమరావతి ప్రాజెక్టును రద్దు చేయడం రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించాల్సిన నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి... విశాఖ పట్నం కేంద్రంగా రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశంపై మరో మారు కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకట నపై సమగ్ర చర్చ చేయాల్సి ఉంది.
అమరావతి వేరు, అమరావతి ప్రాజెక్టు వేరు...
అమరావతి ప్రాంతాన్నీ, అమరావతి ప్రాజెక్టునూ వేరువేరుగా చూడాలి. అమరావతి ప్రాంతం అంటే అక్కడి ప్రజలు. అమరావతి ప్రాజెక్టు అనేది కొత్త నగర నిర్మాణం పేరుతో రూపొందించినది. అమరావతి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని గుండు గుత్తగా వ్యతిరేకించడం నేడు జరుగుతున్న తప్పుడు ప్రచారం. చెప్పాలంటే నిజానికి ప్రస్తుత రాజధాని నిర్మాణం జరుగుతున్నది అమరావతిలో కాదు, వెలగపూడిలో.
అమరావతి ప్రాజెక్టు అందరిదా?
అమరావతి ప్రాజెక్టు రూపాన్ని పరిశీలిస్తే... ఎంపిక చేసుకున్న ప్రాంతంలో స్థూలంగా 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అద నంగా రైతుల నుంచి మరో 33 వేల ఎకరాల భూమి తీసుకున్నారు. అందుకు ప్రతిగా అక్కడి రైతులకు ఒకేసారి 1.50 లక్షల రుణమాఫీ చేశారు. కాగా, రాష్ట్రం మొత్తం రైతులకు 5 దఫాలుగా 50 వేల రూపాయలు మాత్రమే మాఫీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక, ప్రతి ఏటా ఎకరాకు 50 వేలు కౌలుగా అమరావతి ప్రాజెక్టు రైతులకు చెల్లించాలి. ప్రతి ఏటా మొత్తంలో 10 శాతం పెంచుకుంటూ, 10 సంవత్సరాల పాటు ఇవ్వాలి.
కేవలం ప్రతి ఏటా చెల్లించే కౌలు మాత్రమే 165 కోట్ల రూపాయలు. దీనికి ప్రతి ఏటా 10 శాతం అదనంగా పెంచి ఇవ్వాలి. అభివృద్ధి చెందిన రాజధానిలో మూడవ వంతు తిరిగి ఇవ్వాలి. అంటే ఒక లక్ష ప్లాట్‌లు అన్నమాట! స్థూలంగా అక్కడి రైతులకు 11 వేల ఎకరాల భూమి అభివృద్ధి చెందిన రాజధానిలో ఉంటుంది. అంటే మొత్తం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రాజధానిలో ప్రభుత్వ భూమి పోను, మిగిలిన భూమి అంతా ఆ 19 గ్రామాలకు చెందిన ప్రజలకు మాత్రమే చెందినదిగా ఉంటుంది. అలాంటి రాజధాని 5 కోట్ల మంది ప్రజలది ఎలా అవుతుంది?
ఇది ఆచరణలో సాధ్యమా?
గత తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన రాజధాని ప్రాజెక్టు ఆచరణలో సాధ్యమా? ఎందుకు ఈ అనుమానం వస్తున్నదీ అంటే... రాజధాని కార్యాలయాలు ఉండటం వేరు, కొత్త నగర నిర్మాణం చేపట్టడం వేరు. దేశంలో కొత్త నగర నిర్మాణాల రూపు రేఖలు పరి శీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. చండీగఢ్, నయా రాయ్‌పుర్ (చత్తీస్‌గఢ్), లవాసా (మహారాష్ట్ర), నోయిడా (ఉత్తరప్రదేశ్)ల అనుభవంతో చూస్తే కొత్త నగర నిర్మాణాలకు ఉన్న పరిమితులు అర్థం అవుతాయి.
10 లక్షల జనాభా దాటిన గుంటూరు, విజయవాడలకు సంబంధం లేకుండా, రెండు నగరాలకు 30–40 కిలోమీటర్ల దూరంలోనే మరో కొత్త నగరం, అందులోనూ హైదరాబాద్ స్థాయి నగరాన్ని నిర్మించడం అనేది ఊహకందదు. అందుకే నగర నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న శివరామకృష్ణన్... అమరావతి ప్రాజెక్టు కోసం రాష్ట వనరులను, శక్తి సామర్థ్యాలను వెచ్చించడం అంటే ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని హెచ్చరించారు.
నూతన నగరం అవసరమేనా?
5 కోట్ల పై చిలుకు జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నగరాలు ఉంటాయి? ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లాంటి ఎని మిది నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో నగరం నిర్మించడం సాధ్యమేనా?
కొత్త నగరాన్ని కోరుకుంటున్నవారు చెపుతున్నది పెట్టుబడులను ఆకర్షించాలని. రాష్ట్రంలో ఐటీ కంపెనీల కోసం తిరుపతి, హిందూ పురం అత్యంత అనువయిన ప్రాంతాలు. పారిశ్రామిక అవకాశాలకు విశాఖ, కాకినాడ, శ్రీసిటీ లాంటివి అందుబాటులో ఉన్నాయి. స్వల్ప ఖర్చుతో ఈ నగరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వీటిని పక్కనపెట్టి... ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదా వరి జిల్లాల ప్రయో జనాలను పణంగా పెట్టి... అత్యంత వ్యయ ప్రయాసలతో, పరిమిత ప్రయోజనాల కోసం, పాలకుల వ్యక్తిగత అవసరాల (పేరు ప్రతిష్ఠలు) కోసం చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం చేపట్టడం ప్రమాదకరం.
ఆధునిక నగరాలుగా విశాఖ, తిరుపతి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతాల స్వభా వాన్ని అర్థం చేసుకుంటే... విశాఖపట్నం, తిరు పతి మహా నగరాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలుస్తుంది. విశాఖ ఇప్పటికే మహానగర ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆ తర్వాత ఈ అవకాశం తిరుపతికి ఉన్నది. చెన్నై, బెంగుళూరు మహానగరాలకు అత్యంత సమీపంలో తిరుపతి ఉన్నది.
వాతావరణ సమతుల్యత ఉన్న తిరుపతి... ఐటీ కేంద్రంగా ఆధు నిక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. చెన్నై వరదలు వచ్చిన ప్పుడు తిరుపతికి ఉన్న సానుకూలాంశాలు ఏమిటో అర్థమయ్యాయి. శ్రీసిటీ విజయవంతం కావడాన్ని పరిగణన లోకి తీసుకొని విశాఖ, తిరుపతిలను ఆధునిక అవకాశాలను అంది పుచ్చుకునే విధంగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలి.
అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన అమరావతి ప్రాజెక్టును రద్దు చేయాలని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావించడం సముచితమైన నిర్ణయం. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా మహానగర నిర్మాణ ఆలోచనను పక్కన పెట్టాలి. రాజధానితో సహా అభివృద్ధి, నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలి.
వీటికి కేటాయింపులు జరిపి, సత్వర పూర్తికి చర్యలు తీసుకోవాలి. మొత్తం ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం లాంటి విషయాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం లాగా కాకుండా... ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలను, అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలి. హేతుబద్ధ నిర్ణయం తీసు కొని సమతుల్యతతో కూడిన సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త ‘రాయలసీమ మేధావుల ఫోరం’ సమన్వయకర్త, తిరుపతి ‘ మొబైల్: 94904 93436
Comments
Please login to add a commentAdd a comment