
సందర్భం
కశ్మీర్‌లో శాంతి ప్రక్రియ తన నాయకత్వంలో సాధారణ స్థితికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు శాంతిని తెస్తానన్నది జమ్ము–కశ్మీర్ విషయంలో మోదీ ఇచ్చిన ప్రధానమైన హామీ. కానీ ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ప్రధాని ఎంత పొరబడ్డారో చూపించింది. పౌరులపై ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. ఇందులో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ దాడి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీర్ఘకాల వేదనలను పరిష్కరించనప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటపడతాయి.
తగ్గని ఉగ్రచర్యలు
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మోదీ, అమిత్ షా ద్వయం పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారానే దాని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కానీ అది జరగలేదని తాజా ఉగ్రదాడి తేల్చి చెప్పింది.
పహల్‌గామ్ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఈ నేపథ్యంలో తన సౌదీ పర్యటన నుండి అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ యథాప్రకారం కశ్మీర్ లోయలో హింసను ఖండించారు. ఆ ఘటన వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని హెచ్చరించారు. మరో వైపున పహల్‌గామ్ దాడి ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు.
దీనికి ప్రతిస్పందన అన్నట్లుగా, ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్‌లోని పాఠశాలలు, దుకాణాలను మూసి వేశారు. పహల్ గామ్ దాడి చెదురుమదురు ఘటన కానే కాదు. లోయలో ఉగ్రవాద చర్యలు ఎన్నడూ తగ్గు ముఖం పట్టలేదని సూచిస్తూ ఇటీ వల పలు హింసా ఘటనలు జరుగుతూ వచ్చాయి. కానీ అవి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు.
2019లో కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కశ్మీర్‌లో హింసా కాండను అంతం చేయడమే ప్రత్యేక హోదా రద్దుకు కారణం అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. దాని కొనసాగింపుగానే గత ఫిబ్రవరి 24న అమిత్ షా ఒక ప్రకటన చేస్తూ జమ్మూ కశ్మీర్‌లో ఏర్పడిన శాంతిని శాశ్వత శాంతిగా మార్చాలి అన్నారు. అయితే కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు తూర్పున 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్‌గామ్ ఉగ్రదాడి ఆ రాష్ట్రంలో శాశ్వత శాంతి ఇంకా ఏర్పడలేదని స్పష్టంగా చూపించింది.
ఈ ఘటనకు తామే కారణమని లష్కర్–ఎ–తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ప్రకటనలోని నిజానిజాలు వెంటనే తేలకపోయినా, ఈ దాడి భారత, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. పర్యాటకుల ప్రాణనష్టం పట్ల పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పాక్ ప్రభుత్వానికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిగా పాకిస్తాన్‌తో దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించడానికి పూనుకుంది.
బలహీనమైన కశ్మీర్
కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసమే ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని రద్దుచేసినట్లు మోదీ తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. కానీ కశ్మీర్ భూభాగంలో పెట్టుబడులు నేటికీ పరిమితంగానే ఉన్నాయన్నది గ్రహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మోదీ పదవీకాలంలో కశ్మీరీలు మరింత బలహీనంగా మారారు. లక్షలాది మంది సైనికులు కాపలా కాస్తున్న ఈ ప్రాంతంలో హిందువులు స్థిర నివాసం ఏర్పర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
కశ్మీర్ లోయ జనాభా దామాషాను మార్చే ఈ లక్ష్యాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బయటి జనాభా లోయలోకి వస్తే తమ ఉద్యోగాలు, భూయాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు భీతిల్లుతున్నారు. అదే సమయంలో నిరంతర దర్యాప్తులు, అణచివేత విధానాల మధ్యనే వారు జీవిస్తున్నారు. విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉండటానికి, భారత ప్రభుత్వం కఠినమైన ప్రయాణ నిషేధాలను, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఏకపక్ష నిర్బంధాలను ఉపయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది కశ్మీర్ ఎన్నికల సందర్భంలో పేర్కొంది.
ఈ ఉగ్రదాడి, చాలా కాలంగా నలుగుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభు త్వానికి అవకాశాన్నిస్తోంది. నిజానికి మోదీ మొదటి ఉద్దేశ్యం ఈ ప్రాంతాన్ని మరింతగా దిగ్బంధించడమే. అలా చేస్తే అది పొరపాటవుతుంది. 2019లో భారత ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలూ...
ఇంటర్నెట్ సేవలను దీర్ఘకాలికంగా నిలిపివేయడం, రాజకీయ నేతలను నిర్బంధించడంతో పాటు లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయడం వంటివి ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపాయి. ఆ చర్యలను క్రమంగా ఎత్తివేశారు, అయినా నష్టం జరిగిపోయింది. మరోపక్క ప్రధాన స్రవంతిలో, సోషల్ మీడి యాలో అదుపు లేకుండా ముస్లిం వ్యతిరేక భావన కొనసాగుతోంది.
మోదీ దాన్ని చూసీచూడనట్టు వదిలే యాలని భావిస్తే కష్టమే. భారతీయులందరికీ నాయకుడిగా ఆయన వ్యవహరించాలి. సంయమనం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వాలి. ఇప్పటికే ప్రతీకారదాడి అంటూ భావోద్వేగాలతో జనం ఊగిపోతున్నారు. ఆచితూచి వ్యవహరించడమే అంతర్జాతీయంగా ముఖ్యమని గ్రహించాలి.
కరిష్మా వాస్వానీ
వ్యాసకర్త ఆసియా వ్యవహారాల నిపుణురాలు