
విశ్లేషణ
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం.
కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ.
హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.
పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే!
ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!
శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.
అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం.
నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.
శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.
తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్‌మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు.
రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.
పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.
ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.
నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్‌మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.
శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.
అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!
ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం.
నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్