
అభిప్రాయం
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి 99 శాతానికి పైగా అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం జగన్ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందినదే అని చెప్పడంలో అతిశ యోక్తి లేదు. విలువలు గల కమిట్ మెంట్ రాజకీయాలు నడపడంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక మార్పులు తీసుకురావడంలోనూ జగన్ చేసిన ఈ ఐదేండ్ల కృషి అద్వితీయం, అనుపమానం.
ఈ రోజు నిరుపేద కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లలు, ఈ దేశం లోని పేద బహుజనుల చిర కాల స్వప్నమైన ఇంగ్లీషు మీడి యం విద్యను అభ్యసిస్తు న్నారు. లక్షలాదిమంది విద్యా ర్థులకు విదేశీస్థాయి కార్పొరేట్ విద్య ఉచితంగా లభిస్తోంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం మరో అద్భు తమైన, విప్లవాత్మకమైన చర్య. దీంతో అధికార వికేంద్రీకరణ జరిగింది.
చంద్రబాబు తన ఐదేండ్ల పాలనలో విభజన హామీల సాధన కోసం ఏ ప్రయత్నం చేయకపోగా, ఆంధ్రప్రదేశ్‌కు పెన్నిధి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయలేకపోయారు. అమరావతి పేరు చెప్పి పాలనను నిర్లక్ష్యం చేశారు. దాంతో పోలవరం ఒక్కడుగు కూడా ముందుకు నడు వలేదు. ఈ అవకతవకలన్నీ సరిచేసి కొత్త టెండర్లనాహ్వానించి వేలకోట్ల ప్రజాధనాన్ని కాపాడారు జగన్.
వైద్యరంగంలోనూ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన మౌలిక మార్పులు దేశానికే ఆదర్శప్రాయం. అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దవాఖానాలు తెరిచి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని జబ్బులకు వర్తింపజేసి, ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయికి పెంచడం ముదావహం.
ఇలా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికీ, అనేక మౌలిక మార్పులకూ.... ముఖ్యంగా దళిత, బహుజన, పేదవర్గాల్లో ఆత్మగౌరవం పెంచడానికీ, సామాజికన్యాయం చేయడానికీ తన ఐదేండ్ల కాలాన్ని పూర్తిగా వినియోగించారు జగన్. రాజ శేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చింతర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వతంగా తెరపడ్డట్టే... జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వత తెరపడుతుంది.
ఈ భయంతోనే చంద్రబాబు జనసేన, బీజేపీలతో అనైతిక పొత్తు పెట్టుకొని ఎన్నికలల్లో గెలవాలని చూస్తున్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అను భవం ఉన్న సీని యర్ నాయకుడు తాను ప్రజలకేమైనా చేసి ఉంటే అవి చెప్పుకోవచ్చు కదా! అది మాని అనైతిక పొత్తులతో జగన్‌తో ఎన్నికల రణరంగంలో తలపడు తున్నారు చంద్ర బాబు.
మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా జగన్ ఒంటరిపోరే చేస్తున్నారు. తానే ప్రజల కోసమైతే పని చేస్తున్నారో, అద్భుత పథకాల ద్వారా వాళ్ల మనసులు గెలుచుకున్నారో ఆ ప్రజలే తనను గెలిపి స్తారన్న దృఢ విశ్వాసముంది కాబట్టే ఒంటరిగా పోరాడు తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెబుతుంది ఒకే ఒక మాట ‘అన్నలారా! అక్కలారా! మీకు నా ఈ ఐదేళ్ల పాలన నచ్చితేనే మీ జగనన్నను గెలిపించండి’ అని.
ఇంతకంటే వినయ సంపన్నత రాజకీయాల్లో మరేముంటుంది? జగన్ ఒంటరివాడు కాదు. ఏడున్నరకోట్ల ఆంధ్ర ప్రజలు ఆయన వెంటున్నారు. వాళ్లే ఆయనను కాపాడుకుంటారు.
డా‘‘ కాలువ మల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత ‘ 91829 18567