
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.
జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి.
ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.
పెరుగుతున్న భక్తి
మతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి.
వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం.
గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు).
ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది.
లాభదాయక వ్యాపారం
గుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను.
కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది.
సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్‌లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?
బహిరంగ సమర్థనా?
మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్‌లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు.
అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు.
అంతకు ముందు ఏడాది మోదీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్‌నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.
- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత
- mohanguru@gmail.com