
వేసవిలో వెకేషన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భారతీయులు..
దేశీయ పర్యాటకులకు ఫేవరేట్ గమ్యస్థానాలు.. కశ్మీర్, హిమాచల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు
టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా ఐరోపా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలు
వీసా ఫ్రీ దేశాలైన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషన్‌లకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్‌లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.
కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్
దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్‌లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది.
టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే..
ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్‌లో యూఏఈ, యూఎస్‌ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది.
అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్ క్రూయిజ్‌లు, ఫిన్‌లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్‌లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.
తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ...
ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్‌ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ (కిక్‌బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్–స్టార్ అండర్‌వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది.