kaluva mallaiah
-
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
సాంఘిక విప్లవ నాయకుడు
ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డికి లభి స్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూస్తుంటే... తెలుగు రాష్ట్రాలను ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులెవరికీ ఇంతటి ప్రజాదరణ లేదని పిస్తోంది. దీనికంతటికీ ఆయన ప్రజల కోసం చేసిన పనులే కారణం అన్నది స్పష్టం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి వాటిని అవసరమున్న ప్రజలకు అందజేయడం మంచి పాలకుల లక్షణం. మధ్య దళారుల వ్యవస్థ లేకుండా వారికి అందజేయవలసిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్‌దే. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమైన ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు. ప్రజల చేత’ పాలన సాగించడం జగన్ సాధించిన అద్భుత విజయం. గ్రామ వలంటీర్ వ్యవ స్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిట్లోకి పాలనను, ప్రభుత్వ పథకాలను చేరేట్టు చేయడం మరో గొప్ప విజయం. కార్పొరేట్ శక్తులు, రాజకీయ అహంభావ నిరంకుశ శక్తులను మినహాయిస్తే... జగన్ వల్ల లాభపడని ఒక్క కుటుంబమూ ఆంధ్రప్రదేశ్‌లో కనబడదు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా... పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యను అందిస్తున్న ఘనత జగన్‌దే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించడం ఏపీలోనే కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వ విద్యా విధానానికీ గౌరవం కల్పించడంతోపాటూ బహుజన వర్గాలకు పట్టాభిషేకం చేయడం లాంటిదే. సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసే అందరికీ ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితౖ వెద్యం, పాలనా రంగంలో బహుజన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం లాంటివన్నీ ఈ ఐదేళ్ళ పాలనలో సాగాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి జగన్ ఎక్కడికి వెళ్ళినా అసంఖ్యాక జనం! మండుటెండ ల్లోనూ రోడ్లపై నిలబడి ఎదురుచూస్తూ నీరాజనాలు!!బసవేశ్వరుడు, నారాయణగురు, రవిదాస్ చమార్, పెరియార్ రామ స్వామి, ఫూలే, అంబేడ్కర్ లాంటి తత్త్వవేత్తలను చూశాము. జాషువా లాంటి సాంఘిక విప్లవ కవులను చూశాము. సాహు మహరాజ్ లాంటి సామాజిక విప్లవ పాలకులను చూశాము. నెహ్రూ లాంటి సెక్యులర్, సెమీ సోషలిస్ట్ నాయకులను చూశాము. జగన్ ఐదేళ్ల పాలన వీళ్లందరి సమాహారంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సామాజిక మార్పుల దిశగా బలమైన పునాదులు పడి గుణాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే టీడీపీ–జనసేన–బీజేపీల కూటమికి జగన్ పాలన నచ్చడంలేదు. ఆయనపై అసత్య ప్రచారంతో దాడి చేస్తోంది. తమ అసంబద్ధ మేనిఫెస్టోతో ప్రజ లను మభ్యపెడుతోంది. జగన్ మాత్రం ఐదేళ్ళలో తాను చేసిన పనులను నమ్ముకొనే ప్రజాస్వామిక పద్ధతిలో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు జగన్ మరోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్ననే అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్‌కు లభిస్తున్న జనాదరణను సహించలేక ఆయన్ని భౌతికంగా తొలగించాలనుకునే రాజకీయ దివాలాకోరుతనాన్ని ప్రతిపక్షాలు ప్రదర్శించడం శోచనీయం. ఎవరెన్ని దాడులు చేసినా, రాజనీతిని రాజభీతిగా మార్చినా జగన్ విజయాన్ని ఆపలేవు. ఎందుకంటే జగన్ ‘సెక్యులరిజం, సోషలిజం’ భావాలను హృదయానికి హత్తుకొని అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం ప్రజాస్వామిక పాలనను అందిస్తున్న సాంఘిక విప్లవ నాయకుడు!!డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథారచయిత ‘ 91829 18567 -
జగన్ వెంటే జనం!
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి 99 శాతానికి పైగా అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం జగన్ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందినదే అని చెప్పడంలో అతిశ యోక్తి లేదు. విలువలు గల కమిట్ మెంట్ రాజకీయాలు నడపడంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక మార్పులు తీసుకురావడంలోనూ జగన్ చేసిన ఈ ఐదేండ్ల కృషి అద్వితీయం, అనుపమానం. ఈ రోజు నిరుపేద కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లలు, ఈ దేశం లోని పేద బహుజనుల చిర కాల స్వప్నమైన ఇంగ్లీషు మీడి యం విద్యను అభ్యసిస్తు న్నారు. లక్షలాదిమంది విద్యా ర్థులకు విదేశీస్థాయి కార్పొరేట్ విద్య ఉచితంగా లభిస్తోంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం మరో అద్భు తమైన, విప్లవాత్మకమైన చర్య. దీంతో అధికార వికేంద్రీకరణ జరిగింది. చంద్రబాబు తన ఐదేండ్ల పాలనలో విభజన హామీల సాధన కోసం ఏ ప్రయత్నం చేయకపోగా, ఆంధ్రప్రదేశ్‌కు పెన్నిధి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయలేకపోయారు. అమరావతి పేరు చెప్పి పాలనను నిర్లక్ష్యం చేశారు. దాంతో పోలవరం ఒక్కడుగు కూడా ముందుకు నడు వలేదు. ఈ అవకతవకలన్నీ సరిచేసి కొత్త టెండర్లనాహ్వానించి వేలకోట్ల ప్రజాధనాన్ని కాపాడారు జగన్. వైద్యరంగంలోనూ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన మౌలిక మార్పులు దేశానికే ఆదర్శప్రాయం. అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దవాఖానాలు తెరిచి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని జబ్బులకు వర్తింపజేసి, ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయికి పెంచడం ముదావహం. ఇలా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికీ, అనేక మౌలిక మార్పులకూ.... ముఖ్యంగా దళిత, బహుజన, పేదవర్గాల్లో ఆత్మగౌరవం పెంచడానికీ, సామాజికన్యాయం చేయడానికీ తన ఐదేండ్ల కాలాన్ని పూర్తిగా వినియోగించారు జగన్. రాజ శేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చింతర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వతంగా తెరపడ్డట్టే... జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వత తెరపడుతుంది. ఈ భయంతోనే చంద్రబాబు జనసేన, బీజేపీలతో అనైతిక పొత్తు పెట్టుకొని ఎన్నికలల్లో గెలవాలని చూస్తున్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అను భవం ఉన్న సీని యర్ నాయకుడు తాను ప్రజలకేమైనా చేసి ఉంటే అవి చెప్పుకోవచ్చు కదా! అది మాని అనైతిక పొత్తులతో జగన్‌తో ఎన్నికల రణరంగంలో తలపడు తున్నారు చంద్ర బాబు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా జగన్ ఒంటరిపోరే చేస్తున్నారు. తానే ప్రజల కోసమైతే పని చేస్తున్నారో, అద్భుత పథకాల ద్వారా వాళ్ల మనసులు గెలుచుకున్నారో ఆ ప్రజలే తనను గెలిపి స్తారన్న దృఢ విశ్వాసముంది కాబట్టే ఒంటరిగా పోరాడు తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెబుతుంది ఒకే ఒక మాట ‘అన్నలారా! అక్కలారా! మీకు నా ఈ ఐదేళ్ల పాలన నచ్చితేనే మీ జగనన్నను గెలిపించండి’ అని. ఇంతకంటే వినయ సంపన్నత రాజకీయాల్లో మరేముంటుంది? జగన్ ఒంటరివాడు కాదు. ఏడున్నరకోట్ల ఆంధ్ర ప్రజలు ఆయన వెంటున్నారు. వాళ్లే ఆయనను కాపాడుకుంటారు. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత ‘ 91829 18567 -
ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!
‘‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా... దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.’’ గురజాడ దేశభక్తి గీతం ఒక్కటే చాలు ఆయనకు ప్రపంచ స్థాయి కవుల పక్కన చోటివ్వడానికి అని శ్రీశ్రీ అన్న మాటలు అక్షర సత్యాలు. దేశం, దేశంపై ప్రేమ, దేశభక్తి అంటే ఏంటో వంద సంవత్సరాల కిందటే మనిషి కోణంలోంచి ఆలోచించి చెప్పాడు గురజాడ. రెండువేల ఆరువందల సంవత్సరాల ముందే గౌతమ బుద్ధుడు అన్న ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ వాక్యంలోనూ, బౌద్ధ నైతిక ధర్మంలోనూ దుఃఖంలేని మానవ సమాజమే ముఖ్యం. బౌద్ధ ధర్మంలోని సారాన్ని హృదయానికి హత్తుకున్నవాడు కాబట్టే గురజాడ ‘దేశభక్తి’ లాంటి ప్రపంచస్థాయి గీతాన్ని రాయగలిగాడు. ఈ దేశంలోంచి బౌద్ధం తరిమి వేయబడినపుడే మతపరంగా భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అన్నాడు గురజాడ. మనిషిని పట్టించుకోని ఏ మతం అయినా, విషయమైనా మానవజాతి ప్రగతిని కోరే వారి దృష్టిలో అసమ్మతం అయిందేనన్నది వాస్తవం. దేశమంటే చెట్లు, గుట్టలు, నదీనదాలు కాదు. మట్టి మాత్రమే కాదు, దేశమంటే మను షులు. దేశభక్తంటే ఆ మనుషులపై భక్తి, ప్రేమ... ఆ మనుషుల బాగోగులను చూడటమే. మనిషి కేంద్రంగా, మనిషి బాగోగులు లక్ష్యంగా, మానవాభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించేవాడే మంచి పాలకుడు. దేశమును ప్రేమించడమంటే అదే. అలాంటి పాలన నందించే అతికొద్దిమంది నాయకులలో యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అతనికి కావాల్సింది తన ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడం. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాలకతీతంగా అందరికీ మేలు చేసే పనులు చేయడం. అందుకే దాదాపు 31 లక్షల మందికి మూడున్న రేళ్లయినా పూర్తికాక ముందే ఇండ్ల స్థలాలు ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి ఇప్పటికే ఇళ్లు కట్టించారు. లక్షలాది ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలను 95 శాతం పైగా నెరవేర్చారు. విద్య, వైద్యం, సేద్యం, తిండి, బట్ట, ఇల్లు... ఇలా మనిషి మనుగడకు సంబంధించిన అన్ని అవసరాలనూ రాజకీయ విలువలనూ కాపాడుతూ, కమిట్మెంట్ రాజకీయాలను నడుపుతూ తీర్చడం సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఇలాంటి మనిషి కేంద్రంగా సాగుతున్న పాలన తెలుగుదేశం లాంటి ప్రధాన ప్రతి పక్షానికీ, తెలుగు రాష్ట్రాల్లో తద్వారా దక్షిణాదిలో బలపడాలని అనుకుంటున్న బీజేపీకీ, ఏ రాజకీయ సిద్ధాంత అవగాహన లేక నోటి కొచ్చింది మాట్లాడుతూ ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవాలని చూసే పవన్ కల్యాణ్‌కూ నచ్చవు. ద్వేషపూరిత రాజకీయాలను రెచ్చ గొడుతూ అధికారంలోకి రావాలని చూడటమే వీరి ఉద్దేశ్యం. దేశభక్తంటే వీరికి మతభక్తి. కులాలను రెచ్చగొట్టడం. ప్రాంతీయ విభేధాలను రెచ్చ గొట్టడం. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఏవీ వీరికి పట్టవు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడం వీరి ఉద్దేశ్యం. ప్రజల కనీసావరాలను తీర్చే ఒక్క ప్రణాళిక కానీ, రాష్ట్ర ప్రగతి పథానికి ఉపయోగపడే ఒక్క పథకం కానీ లేకుండా ప్రజల సెంటిమెంట్లను రెచ్చ గొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న వీరికి 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లోనూ జరిగిన ఆశా భంగమే 2024 ఎన్నికల్లో జరుగుతుందన్నది వాస్తవం. గురజాడ చెప్పిన దేశమును ప్రేమించుమన్నా అన్న సూక్తినీ, దేశభక్తి నిర్వచనాన్నీ హృదయానికి హత్తుకొని పరిపాలన కొనసాగిస్తూ ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే! (క్లిక్ చేయండి: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
AP: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..
మహా నగరాలు ఒకే రోజులోనో, స్వల్ప సమయంలోనో నిర్మింప బడవు. కాలక్రమంలో చారిత్రక, సామాజిక, సాంఘిక, మానవ వన రుల అవసరాలను బట్టి గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ (రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితమవ్వలేదు) అనే నానుడి పుట్టింది. హైదరాబాద్, చెన్నయ్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ లాంటి మహానగరాలు కూడా ఒక సంవత్స రంలోనో, స్వల్పకాలంలోనో మహానగరాలుగా ఎదిగినవి కావు. ఇది చరిత్ర. చారిత్రక దృష్టిలేనివారు; చరిత్రనుండి పాఠాలు, గుణపాఠాలు నేర్వలేనివారు... వేల కొద్ది ఎకరాల పంట భూములను సేకరించి అక్కడ రాజధాని భవనాలు నిర్మించి అత్యల్ప కాలంలోనే సింగపూర్ లాంటి నగరాలను తీసుకు వస్తామని చెబుతారు. ‘చరిత్ర తెలి యనివారు చరిత్రను సృష్టించలేరు’. అక్కడేమీ లేకున్నా రాజధాని పేరు మీద కొన్ని భవనాలు నిర్మించినంత మాత్రాన అది సింగపూర్ అవుతుందని భావించడం సరైందికాదు. ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పట్టణాలను వదిలి... ఛండీగర్ను కొత్త రాజధానిగా నిర్మించి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేయడం వల్ల జరిగిందేంటి? అది నాలుగు దశాబ్దాలు గడిచినా మహానగరం కాలేదు. పట్టణంగా మాత్రమే ఉండి పోయిందన్న సంగతి మరువరాదు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంతరాలతో మూడు ప్రాంతాల సమాహారంగా ఉంది. ఇది సహజం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లోని అసమానతలను, అంతరాలను వీలైనంతవరకు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ‘మూడు రాజధాను’లను ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్ అమరావతికే ఉపయోగిస్తే రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ పథకాల మాటేంటి? మంచి పాలకునికి చరిత్ర తెలిసిన పాలకునికి ప్రజలు ముఖ్యం కదా! అమరావతిలో అసెంబ్లీ ఉంచి, విశాఖపట్టణంలో సచివాలయం నిర్మించి పరిపాలనా రాజధానిని చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న విశాఖ పట్ట ణాన్ని రాజధాని చేస్తే అత్యంత తక్కువ సమయంలో మరింత గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలా ఇక్కడ వేలకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని రూపు మాపి సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అమరావతిలో అసెంబ్లీ భవనాలు, శాసన రాజధాని ఉంటుంది. కాబట్టి ఇది కూడా నగరంగా అభివృద్ధి చెందుతుంది. మరో దిక్కున కర్నూలులో హైకోర్టు వల్ల అదో మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఐటీ విస్తరణ, ఉద్యోగ కల్పన, సేద్యం వంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక న్యాయం బాగా జరిగేలా చూస్తే అంతకంటే మించిన సుపరిపాలనేముంది? ఆ దిశగా శర వేగంతో అడుగులేస్తున్నాడు జగన్. దీంతో భవిష్యత్తులో వేర్పాటు వాదాలు వచ్చే అవకాశం ఉండదు. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా సోదర భావం నెలకొంటుంది. అప్పుడే శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి. ఫలితంగా పెట్టుబడులు దేశ, విదేశాల నుంచి ఏపీకి ప్రవహిస్తాయి. అందువల్ల రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులను వ్యతిరేకించడం ఆపి రాజ ధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకరిస్తే శూన్యంగా మిగిలిన తెలుగు దేశానికి ఇసుమంతైనా ప్రజామోదం లభిస్తుంది. అలా కాదంటారా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సకల జనుల వృద్ధిని ఆశించే ప్రస్తుత సీఎం జనం హృదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. (క్లిక్ చేయండి: రాజధాని పట్ల మరింత స్పష్టత) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీ వేత్త -
ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్మెంట్లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది. ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట. సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్‌కంటాక్స్ పేయర్స్ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట. ఈ కార్పొరేట్ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఇన్‌కంటాక్స్ పేయర్స్‌కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు) ఇంతకీ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్‌మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ కథారచయిత, విమర్శకులు -
అనవసర ఉద్యమాలు ఎందుకు?
సాధారణంగా పాదయాత్రలు, ఉద్యమాలు ఓ పవిత్రమైన, ప్రజోపయోగకరమైన పనులు కోసం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా నిరసన యాత్రలు, ఉపవాస యాత్రల పేరు మీద జరుగుతున్న ఉద్యమాలు అర్థం లేనివి. ఆ మధ్య అమరావతి రాజధానిగా ఉండాలని 900 రోజుల ‘దండుగ పండుగ’ను చూస్తే అభివృద్ధి నిరోధక ఉద్యమాలు కూడా ఉంటాయన్న విషయం అతి సామాన్యడికి కూడా అర్థమైంది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, మరి కొందరు ఇతరులూ హాజరయ్యారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలతో పాటు సీపీఎం నాయకులు, చుక్కా రామయ్య, నాగేశ్వర్, కోదండరాం లాంటి వాళ్ళంతా హాజరై అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనడం హాస్యాస్పదంగా ఉంది. ఇంతకీ అమరావతిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకుండాలి? రాష్ట్ర సమతుల్య అభివృద్ధి కోసం, మూడు ప్రాంతాల మధ్య సహోదర భావం నెలకొల్పడానికి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండటానికి మూడు రాజధానులు ఏర్పరిస్తే నష్టమేంటి? దీన్నెందుకు వ్యతిరేకించాలి? ఏదో మునిగిపోతున్నట్టు ఏండ్ల తరబడి నిరసనలు, అభివృద్ధి నిరోధక ఉద్యమాలు ఎందుకు? ఇలాంటి ప్రతీఘాత ఉద్యమాల నెన్నింటినో ఎదుర్కొని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నారు. ఈ ఉద్యమం వల్ల రాజధానుల నిర్మాణం మరింత ఆలస్యమవ్వడం తప్ప వేరే ప్రయోజనం లేదు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రజలు రాజధాని లేనివారిగా మిగిలారు. వారు తమకు రాజధాని నిర్మాణం త్వరగా కావాలని కోరుకోవాలి కానీ నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్యమాలు చేయడం సరైనదేనా? ఇంతకీ అమరావతితో పాటు మరో రెండు చోట్ల రాష్ట్ర రాజధాని ఉండటం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? అమరావతి ప్రాంతం చుట్టూ ఉన్న పాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఓ బలమైన సామాజిక వర్గం రాజకీయంగానూ, ఆర్థికంగానూ మొదటి నుంచి ఈ పెత్తనం సాగిస్తోంది. ఆ పెత్తనానికి భంగం కలుగుతుందన్న అపోహ ఈ ఉద్యమానికి ఒక కారణం. అలాగే అక్కడి భూములతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే అవకాశం పోతుందన్న కొందరి అక్కసూ దీని వెనుక ఉంది. నిజానికి ఆ ప్రాంత సామాన్య రైతుకు ఏ నష్టమూ లేదు. రాజధాని కొరకు సేకరించిన భూములను అవసరం ఉన్న మేరకు ఉంచుకొని మిగతావి వారికి అప్పజెప్పవచ్చు. లేదా ఆ భూములకు ఒప్పందం ప్రకారం తగిన ధర కట్టి ఇవ్వవచ్చు కదా! ఇక అభ్యంతరమేంటి? ఈ ఉద్యమాన్ని విరమించుకొని మూడు రాజధానుల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివాటిల్లో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఇలా చేస్తే ఆ సామాజిక వర్గంతో పాటు ఆ యాపార్టీలకు కొంతైనా పరువు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బలంగానూ, తెలంగాణలో నామ మాత్రంగానూ జరుగుతున్న మరో అభివృద్ధి నిరోధక ఉద్యమం తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే తెలుగు మృత భాష అవుతుందట! ఇదేం వాదమో అర్థం కాదు. ఇంగ్లీషు మీడియం అయినా... ఒక సబ్జెక్టుగా తెలుగు ఉంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా ఆ మాటను పట్టించుకోవడం లేదు వీరు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలంతా గ్రామీణ పేద బహుజన కులాలవారు. వాళ్లు కార్పొరేట్ ఫీజులను భరించలేక ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మాధ్యమం కోరుకుంటున్నారు. (క్లిక్: పవన్ కల్యాణ్.. ఉండాలంటాడా? పోవాలంటాడా?) 70 శాతం విద్యార్థులు తెలుగసలే లేకుండా కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుతుంటే తెలుగు మృతభాష కాదా! కనీసం ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుందనీ, మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేసి అక్కడికి ప్రతి గ్రామం నుంచి పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామనీ ఏపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. నిజంగా తెలుగు మీడియం మాత్రమే చదవాలనుకునేవారు ఆ పాఠశాలల్లో చదువుకోవచ్చు. అయినా ఈ విషయాలనేమీ పట్టించుకోకుండా గుడ్డిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను వ్యతిరేకించడం సరి కాదు. (చదవండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
కువిమర్శే ప్రతిపక్షం పనా?
స్వాతంత్య్రానంతర కాలంలో రాజకీయాల్లో ఉన్న విలువలు క్రమక్రమంగా మృగ్యం అవుతున్నాయి. రాజనీతి శాస్త్రంలోని నీతి, శాస్త్రీయత మాయమై రాజకీయాలు మాత్రమే మిగులుతున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే జగన్ రాజకీయ విలువల పునరుద్ధరణ దిశలో పయనిస్తుంటే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ విలువలను మరింత దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవు తుంది. ముఖ్యమంత్రిగా విలువల వలువలొలిచే రాజకీయాలను నడిపి, ప్రతిపక్ష నాయకుడుగా మరింత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు బాబు. జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను, ప్రజారంజక పాలనను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసంగా గమనించకుండా ఏది చేసినా కువిమర్శలతో, ప్రతీఘాత ఉద్యమాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల పైనా, జగన్ పైనా కక్ష తీర్చుకున్నట్లూ, పార్టీ మార్పిడు ల్లాంటివి ప్రోత్సహించినట్లూ... వైఎస్ జగన్ కూడా చేసి ఉంటే... ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 సీట్లలో మూడు సీట్లు కూడా మిగులకుండా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయేది. పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం, సామాజికంగా వెనుకబడిన కులాలవారికి ప్రాధాన్యత నివ్వడం, మత సామరస్యాన్ని కాపాడటం, విద్య, వైద్యం, సేద్యాలకు ప్రాముఖ్యతనిస్తూ మెజారిటీ ప్రజల నాదుకోవడం లాంటి ఎన్నో చర్యల్లో జగన్ విలువలు ప్రతిబింబిస్తున్నాయి. ఇవేవీ చంద్రబాబుకు నచ్చవు. ఇంతకీ ప్రతిపక్ష నాయకుడంటే ఎవరు? ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించి తీరాలనీ, ప్రభుత్వాన్ని నిరం తరం తిడుతూ, పాలన స్తంభింపచేసేవాడే ప్రతిపక్ష నాయకుడనీ చంద్రబాబు అభిప్రాయంలా ఉంది. రచయితల విషయంలో... రచయిత అనేవాడు ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండాలనే అభిప్రాయం ఒకటుంది. రచయితలంతా ఎందుకు ప్రతిపక్షంలో ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాల్లా ప్రభుత్వం ఏంచేసినా తిడుతూనే ఉండాలా? నేటి పాలకపక్షం రేపటి ప్రతిపక్షం కావచ్చు. అందువల్ల రచయిత, జర్నలిస్టు ప్రతిసారీ ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన పనులు చేసినప్పుడు, ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాపాడినప్పుడు మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు కూడా సపోర్టు చేయాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ కరెక్టేననీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేవన్నీ తప్పులేననీ చంద్రబాబునాయుడి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్నో ఆదర్శాలను జీర్ణించుకొని, ఎంతో రీసెర్చ్ చేసి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ ప్రతి నిర్ణయాన్నీ తప్పుపడుతున్నారు చంద్రబాబు. ఆడ బిడ్డల రక్షణకు తెచ్చిన ‘దిశ’ చట్టాన్నీ చంద్ర బాబు విమర్శించారు. బహుజనుల, పేదల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానిపైనా విమర్శే! అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ‘మూడు రాజధాను’ల అవసరాన్ని ముందుకు తెచ్చిన జగన్ పనిని ఇప్పటికే విమర్శిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతున్నందుకు కూడా వీరావేశంతో విమర్శలు చేయడం బాబుకే చెల్లింది. మనిషి కేంద్రంగా... దేశమంటే మనుషులేనన్న దృక్పథంతో రాజకీయాలను మలుచుకున్న నాయకులే నిజమైన ప్రజానాయకులు. అలాంటి ప్రజా నాయకుడే జగన్ అని గత మూడేళ్ల పాలన రుజువు చేస్తోంది. వయస్సులో చిన్న వాడైనా జగన్ నుంచి చంద్రబాబు లాంటివాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంది. (క్లిక్: విద్యావ్యవస్థకు ఒక షాక్ ట్రీట్మెంట్) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
మౌలిక మార్పులే లక్ష్యంగా...
ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్ జగన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత -
సరిగ్గా అమలు చేసివుంటే...
భారత ఉపఖండంలో పుట్టి ప్రపంచ మానవాళి కంతటికీ దుఃఖనివారణోషధి నందించిన మొట్ట మొదటి తాత్వికుడు బోధిసత్వుడు. ఆయనను గురువుగా భావించి తన జీవితాన్ని అణగారిన జాతుల అభ్యున్నతికి అంకితం చేసిన వారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అంబేడ్కర్ పేరును తమతమ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ఆయన ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇటువంటి సమయంలో ఐక్యరాజ్యసమితి మాత్రం ఆయన జన్మదినాన్ని ‘విశ్వశ్రేయస్సు’ దినంగా ప్రపంచమంతా జరుపుకోవాలని పిలుపు నివ్వడం మనందరికీ గర్వకారణం. వందలాది దేశాల రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొని, దేశ దేశాల చరిత్రలను అవగాహన చేసుకొని, భారతీయాత్మను ఆవహింప జేసుకొని అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశారు అంబేడ్కర్. ఈ రాజ్యాంగం భిన్న మతాలూ, భాషలూ, సంస్కృతులూ కలిగిన భారతదేశాన్ని ఐక్యం చేసింది. నోరులేని వారు కూడా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించడానికి భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చింది. ప్రతి మనిషీ తనకు ఇష్టమున్న రీతిలో జీవించడానికి మతస్వేచ్ఛ నిచ్చింది. వివిధ మత విశ్వాసాలను గౌరవిస్తూనే లౌకికత్వాన్ని అనుసరించాలని నిర్దేశించింది. నిరక్షరాస్యులై విద్యా గంధానికి దూరంగా ఉన్న భారతీయులందరికీ విద్యాహక్కునిచ్చింది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉండేలా సమాఖ్య రాజ్యంగా భారత్‌ను ప్రకటించింది. ప్రతి రాష్ట్రం కేంద్ర సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే... తమతమ రాష్ట్రాలను తమదైన పద్ధతిలో అభివృద్ధి చేసుకునే స్వేచ్ఛ దీని వల్ల లభించింది. యుగాలుగా అణచివేతకు గురైన భారతీయ మహిళకు అన్ని విధాలా అభివృద్ధి చెందే హక్కులు ప్రసాదించింది రాజ్యాంగం. వర్ణవ్యవస్థ వల్ల దేశ ప్రజల్లో ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి స్టేట్ సోషలిజం కావాలని చెప్పింది. ప్రభుత్వరంగం బలోపేతం కావాలని పేర్కొంది. అసమానతలను, అంతరాలను తగ్గించడానికి బలహీన కులాల వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పొందుపరిచింది. ప్రభుత్వరంగ ప్రాజెక్టులను, కర్మాగారాలను, విశ్వ విద్యాలయాలను ప్రోత్సహించింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం సమగ్రమైనది. అవసరమైన సవరణలు చేయడానికి వీలుకలిగింది కూడా. ఇటు వంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సరికాదు. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారమయ్యుండేవి. సామాజిక, ఆర్థిక అంతరాలు, కుల మత భావనలు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఫెడరల్ స్ఫూర్తి, లౌకిక భావన, స్టేట్ సోషలిజం భావనలు పేరుకు మాత్రమే మిగిలిపోయేవి కాదు. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త సాహితీవేత్త -
ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు
పాలకులను నిర్ణయించడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అనేది జగమెరిగిన సత్యం. తమ అభ్యున్నతికి కృషి చేసినపుడే ఏ నాయకుణ్ణయినా ప్రజలు ఆదరిస్తారు. ప్రజల కంచాల్లోకి పట్టెడన్నం, ఒంటిమీదికి గుడ్డ, ఉండటానికి నీడ, కుటుంబం గడిచేందుకు పని, చదువు, వైద్యం లాంటివి అందించిన వాడే ఊత్తమ పాలకుడు. అలాంటి పాలననందిస్తున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సామాన్య ప్రజల సంక్షేమం, కనీసావసరాలు తీర్చడం కేంద్రబిందువుగా పాలన చేస్తున్నారు. కాబట్టే 2019 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఆయన అఖండ విజయాలను సాధిస్తున్నారు. నూటికి నూరుశాతం విజయాలను సాధించడం ప్రజాభిమానం అపూర్వంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ ప్రజలను హృదయానికి హత్తుకొని వారికోసం అంకితమైన నాయకునికి మాత్రమే అది సాధ్యం. ఇలాంటి ప్రజాదరణ చంద్రబాబుకి నచ్చదు. ప్రజలంటే చులకన. తనను ఎన్నుకోకుంటే వాళ్ళంతా పనికిరాని వాళ్ళ న్నట్టే. తాను మాత్రమే రాష్టాన్నీ... ఇంకా ఎక్కువగా మాట్లాడితే దేశాన్నీ ఏలగల సామర్థ్యమున్నవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయినప్పుడు, తనను ఓడించి ప్రజలు తప్పు చేశారని తమకు తాము క్షమాపణలు చెప్పుకుంటారని అన్నారు. ప్రజలను కించపరిచారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజూ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. కోల్పోయిన ప్రజాభి మానాన్ని చూరగొనడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. కుట్రలూ, కుతంత్రాలూ చేసైనా గెలవడమే ధ్యేయంగా పన్నాగాలతో పదేళ్లు గడిపారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విషయంలో, అనైతిక పొత్తులతో ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ రెండునాల్కల ధోరణిని ప్రదర్శించి 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బొటాబొటి మెజారిటీతో గెలిచినా, తెలంగాణలో టీడీపీ మటుమాయమయ్యే స్థితికి వచ్చింది. మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం, బలహీన సామాజిక వర్గాలను అణచివేయడంలో మునిగిపోయారు. పోలవరం సమస్య, రాజధాని సమస్య, నిరుద్యోగ సమస్య, ప్రజల చిరకాల సమస్యలు, చదువుల సమస్య ఏదీ తీర్చకుండా తెలంగాణపై అక్కసుతో విషం చిమ్మడంతో కాలయాపన చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు అనేక కర్మాగారాలను మూసివేసి, వ్యవసాయం దండగని ప్రజల ఉసురు పోసుకున్నాడు తప్ప ప్రజలను ఆదరించలేదు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల్లో గెలువడం, ఓడిపోవడం సాధారణ విషయమే. కానీ చంద్రబాబుకు తనను ఓడించడమంటే ప్రజలు తప్పు చేసినట్టే. తానేమీ చేయకున్నా తనను గెలిపించి తీరాలి, తనలాంటి నాయకుడు మరొక్కడు లేరన్నది ఆయన అభిప్రాయం. నాడు వైఎస్సార్ ప్రభుత్వం, నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన మరునాటి నుండే అర్థం లేని విమర్శలు చేస్తూ చులకనైపోయారు. ఓ స్పష్టమైన రాజకీయ ప్రజామోద దృక్పథంతో పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం మొదలెట్టారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంటే ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు, చేస్తూనే ఉన్నారు. నాడు చంద్రబాబు విమర్శలను వైఎస్సార్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని బాబు నవ్వుల పాలయేట్టు చేశారో, రెండున్నరేళ్లుగా వైఎస్ జగన్ కూడా బాబు విమర్శలను, కుట్రలను అంతకంటే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అతిస్వల్పకాలంలోనే టీడీపీ తెలంగాణలో అంతమయేస్థితికి వచ్చింది. ఇప్పుడు రెండున్నరేళ్ల కాలంలో ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి అంతమయే స్థితికి వచ్చింది. అందుకు కారణం బాబులో ఏ మార్పు రాకపోగా మరింత విలువలేని రాజకీయాల్లోకి కూరుకుపోవడమే. మరోవైపున జగన్ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తూ, దశాబ్దాలుగా ఏపీ కోల్పోయిన ప్రాభవాన్ని చంద్రబాబు కాలంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రతి గడపకూ ఏదో విధంగా ప్రభుత్వ పథకాలు చేరేట్టు చేస్తున్నారు. వైఎస్ జగన్ తనదైన పాలనతో ఆంధ్రప్రజల హృదయాలను గెలుచుకుంటూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నారు. చంద్రబాబు అబద్ధాల వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఆయనను ప్రతిపక్షంలోనూ ఉండని రీతిలో తమ తీర్పునిస్తున్నారు. అమరావతి చుట్టు వేలాది ఎకరాల భూములు తన వాళ్ళతో కొనిపించి అక్కడ రాజధాని చేయాలని సంకల్పించిన చంద్రబాబు ఐదేళ్ళలో ఆ పనిని కూడా చేయ లేకపోయాడు. అనేక గాయాలతో సలుపరింతలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌లోనూ ఆ గాయాల బారిన పడకుండా ఉండాలని భావించారు జగన్. అందుకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెనుకబడి వున్న ఉత్తరాంధ్ర, రాయలసీమలు కూడా కోస్తాంధ్రతో సమానంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అందుకే మూడురాజధానులు. ఇది చంద్రబాబుకు, ఓ సామాజిక వర్గానికి నచ్చలేదు. అమరావతిలో రాజధాని పేరిట ప్రతిఘాత అభివృద్ధి నిరోధక ఉద్యమాలు చేయిస్తున్నారు. మూడు ప్రదేశాల్లో రాజధాని నేటి సామాజికావసరం. ప్రజల సానుభూతి పొందడానికి ఏడుపులు, తూడ్పులు పనికిరావని పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన నాయకుడికి తెలీకపోవడం శోచనీయం. శుష్కవాగ్దానాలు, శూన్యహస్తాలు, ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, నేలవిడిచి సాముచేయడం వల్ల ఏ నాయకుడూ తనకంటూ శాశ్వత ఓటు బ్యాంకును ఏర్పరచుకోలేడు. ప్రజలు మెచ్చే పాలన, ప్రజల కనీసావసరాలు తీర్చే పాలన, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే పాలన మాత్రమే శాశ్వత ఓటు బ్యాంకును తయారు చేసింది. మంచి సేద్యం, మంచి వైద్యసేవలు, నాణ్యమైన విద్య నందిస్తూ అనేక పథకాలతో ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న జగన్ పోలవరం, బహుళ రాజధానులు, కె.జి. టు పి.జి. ఒక్క సబ్జెక్టుగా మాతృభాషతో ఆంగ్లమాధ్యమ విద్యను పూర్తిచేసి ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేస్తారనడంలో సందేహంలేదు. తెలంగాణలో అంతర్థానమైన టీడీపీ ఏపీలో ప్రతిపక్ష హోదానైనా పొందే విధంగా బతకాలంటే చంద్రబాబు ఆలోచనాధోరణి ప్రతికూలత నుంచి సానుకూలత వైపు మారాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలని నమ్మలేకుంటే ఆ స్థానాన్ని బీజేపీ లేక కాంగ్రెస్ తన్నుకు పోయే ప్రమాదముంది. - డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త కవి, రచయిత -
అభివృద్ధి పథంలో... తెలుగు నేల
తెలుగు ప్రజలకు రెండురాష్ట్రాలు ఏర్పడి ఏడేళ్లు దాటింది. ఏడేళ్లకు ముందు ఒకే రాష్ట్రంగా ఉన్న తెలుగు నేలపై 58 ఏళ్లుగా ప్రత్యక్ష, పరోక్ష దాయాదుల పోరే. హైదరాబాద్ దక్కన్, ఆంధ్ర రాష్ట్రంగా స్వాతంత్య్రానంతరం రెండు రాష్ట్రాలుగా ఉన్నది అతి స్వల్పకాలమే. ఇంకా ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్రప్రాంతం, నైజాం పాలనలో తెలంగాణ ప్రాంతం ఉండేవి. అటు ఆంగ్లేయులు, తమిళుల ఆధిపత్యం కింద ఆంధ్ర ప్రజలు, ఇటు ముస్లిం ప్రభువులు, ఉర్దూ ఆధిపత్యం కింద తెలంగాణ ప్రజలుండేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కొన్ని తెలుగు జిల్లాలను కోల్పోయి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినా అది బలవంతపు కలయికే అయింది. రోజూ పోట్లాడుతూ కలిసుండటం కంటే, విడిపోయి కలిసుండటమే మంచిదన్న భావంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగు సమాజంలో తమ భాష, ప్రాంత, సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక, అభిరుచుల కనుగుణంగా పాలనా రంగంలో, అభివృద్ధి నమూనాలో గుణాత్మక మార్పులు తీసుకు రావడానికి రెండు రాష్ట్రాల ఏర్పాటు దోహదం చేసింది. తెలంగాణలో ఈ గుణాత్మక మార్పులకు ఏడేళ్ళ క్రితమే పునాది రాళ్ళు పడి శరవేగంతో పరుగులు తీస్తుంది. కె.సి.ఆర్. లాంటి తెలంగాణ ఆత్మ నెరిగిన పాలకుని చేతుల్లోకి రాష్ట్రపాలనా పగ్గాలు పోవడం వల్ల ఇది నిరంతరం సాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్పులు వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మొదలై రాకెట్ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనా సమయాన్ని తెలంగాణలో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ప్రతిపక్షాన్ని అణగదొక్కడం, హైదరాబాద్‌పై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం, ఆత్మస్తుతి పరనిందలతోనే గడిపేశాడు. కేసీఆర్, వైఎస్ జగన్ ఇరువురూ తమ తమ రాష్ట్రాలను గుణాత్మక మార్పుల దిశగా పయనింప జేస్తున్నారు. ఏడేళ్లుగా తెలంగాణలో, రెండేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో తమదైన అభివృద్ధి నమూనాను నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అంతవరకున్న నేల విడిచి సాము చేయడం, ప్రాధాన్యతా క్రమాలను నిర్ణయించుకోవడంలో సరైన పద్ధతి లేనితనం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించారు. వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు సీఎంలు ఇద్దరూ గుర్తించారు. వ్యవసాయ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి, అన్నదాత నాదుకోవడానికి, రైతును రాజు చేయడానికి కేసీఆర్, జగన్ తీసుకున్న చర్యల వల్ల ఎన్నో మేళ్లు జరిగాయి. రైతుల గురించి తీసుకున్న పథకాలు, నీటిపారుదల సౌకర్యాలు, రుణమాఫీ, విత్తనాల సరఫరా, ఆర్థిక సాయం లాంటి అనేక చర్యల వల్ల ఇద్దరూ రైతుబంధులయ్యారు. వ్యవసాయం దండుగ అనే స్థితి నుండి వ్యవసాయం పండుగ అనే స్థితి వచ్చింది. భూమిపై ప్రేమ పెరిగింది. వ్యవసాయం దండుగ అనే స్థితి పోయి పండుగ కావడమే అతిపెద్ద మార్పు. ఇటీవలి కాలంలో అన్ని వార్తాపత్రికల్లో ఓ వార్త వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి సీట్లు లేవని, హౌస్‌ఫుల్‌గా సీట్లు భర్తీ అయ్యాయని! అలాగే తెలంగాణలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల్లోనూ సీట్లు లభించడం కష్టమవుతోంది. ఇది చాలా గొప్ప పరిణామం. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి మరలడం గణనీయమైన మార్పే. ఇందుకు కారణం గ్రామీణ పేదలు, బహుజనులు చిరకాలంగా కోరుకుంటున్న ఇంగ్లిష్ మాధ్యమ చదువులు ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టడం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెరిగింది. వేలు, లక్షలు పెట్టి ఆంగ్లమాధ్యమం చదివేవారికి ఆ భారం తప్పింది. ప్రజలు కోరుకుంటున్న నాణ్యమైన చదువు ఇంగ్లిష్ మాధ్యమమేననే విషయాన్ని ప్రభుత్వం మన్నించి నట్టయింది. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ చదువుల వ్యాపారధోరణికి ఈ విధానం తప్పకుండా అడ్డుకట్ట వేస్తుంది. బహుజన కులాల వారికి మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలివ్వడం రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. తెలంగాణలో రైతుబంధు, దళితబంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ ప«థకాల వల్ల బహుజన కులాలు లబ్ధి పొందుతున్నారు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బహుజన కులాల సమస్యలను గణనలోకి తీసుకొని అమ్మ ఒడి, గ్రామవలంటీర్ల పథకాలు ఏర్పరచడం చెప్పుకోదగిందే. అలాగే తెలంగాణ సంక్షేమ ప«థకాలు ప్రతి గడపనూ తాకుతున్నాయి. వృత్తి పనులు చేసుకునే బహుజన కులాలవారికి వృత్తి సంబంధ ఆర్థిక వనరులిచ్చి ప్రోత్సహించడం తెలంగాణలో విస్తృతంగా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పర్యావరణం, ప్రకృతి రక్షణకు ప్రాధాన్యమిస్తూ పట్టణాల నుండి గ్రామాల వైపు దృష్టి మరలేట్టు చేయడం గొప్ప పరిణామం. హ్యుమానిటీస్ చదవడం దండగ అనే స్థాయి నుండి ఇంగ్లిష్ మీడియంలో హాయిగా చదువుకొనే స్థితి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాలు కేసీఆర్, జగన్ పాలనలో గుణాత్మక మార్పుల దిశగా పయనించడం మంచి పరిణామం. -డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా, నవలా రచయిత. మొబైల్: 91829 18567 -
ప్రజాహిత పాలనదే గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించింది. జిల్లా పరిషత్ స్థానాల్లో 99%, మండల పరిషత్ స్థానా ల్లో 90% సీట్లు సంపాదించి తనకు తిరుగులేదని రుజువు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ ఓట్లు వేసింది ఈ ఓటర్లే. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తు ప్రాధాన్యం వహించినా, పార్టీలకు అతీతంగా అభ్యర్థి మంచితనం, బలం, పనివిధానం కూడా లెక్కలోకి వస్తాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా నూటికి తొంభై శాతంపైగా వైసీపీ మీద నమ్మకంతోనే ఓటు వేసినట్టు స్పష్టం. ఇది జగన్ రెండు సంవత్సరాల పైచిలుకు పాలనకు మెజారిటీ ప్రజలు తెలిపిన ఆమోద ముద్ర. దశాబ్దాలుగా తమ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్న సామాన్య ప్రజలకు జగన్ పాలన అభయహస్తం ఇచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వంపై సానుకూలత, ప్రతిపక్షంపై వ్యతిరేకత పెరుగుతోంది. బహుళ ప్రజల అనుకూల వైఖరి వల్ల జగన్ ప్రజల హృదయాలను గెలువగలిగారు. ప్రతిపక్షం పేరుతో చంద్రబాబునాయుడు చేయిస్తున్న అభివృద్ధి నిరోధక ఉద్యమాలు, ఉత్తుత్తి పోరాటాలను ప్రజలు నమ్మడం లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పాలనలో ఐదేండ్లూ ఆంధ్రప్రజలు ఏ మార్పునూ చూడకుండా శుష్క వాగ్దానాలను మాత్రమే అనుభవించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకుండా ప్రజల చిరకాల వాంఛయైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకించడం, అభివృద్ధి వికేంద్రీకరణకు తావిచ్చే బహుళ రాజధానులను వ్యతిరేకించే పేరుతో ప్రతీఘాత ఉద్యమాలను చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి గెలిచినప్పుడూ, రెండేళ్ళ క్రితం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పడూ ఒకే తీరు మాటలన్నారు చంద్రబాబు. తనను ఓడించిన తెలుగు ప్రజలు పశ్చాత్తాప పడాలి అన్నారు. అలా తన వైఫల్యాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పు పడుతున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీని అవసాన దశకు తీసుకొచ్చారు. వైసీపీకి పడుతున్న ఓట్లు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వల్ల వస్తున్నవి కాదు. జగన్ గత రెండేళ్లుగా చేస్తున్న పనుల వల్ల అనుకూలంగా పడుతున్న ఓట్లు. ఏ ప్రాపంచిక దృక్పథమూ, అభివృద్ధి నమూనా లేకుండా అధికార పార్టీ వైఫల్యాలతో మాత్రమే గెలవాలనుకునే పార్టీలకు జగన్ గెలుపు చక్కని గుణపాఠం. పాజిటివ్, పర్మనెంట్ ఓటుబ్యాంకును పెంచుకోవడానికి జగన్ అవలంభిస్తున్న విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయిక విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నవరత్నాలు, అమ్మఒడి, జగనన్న దీవెన, ఆరోగ్యశ్రీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం లాంటి అనేక అంశాలతో విలువలతో కూడిన రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఆధునిక వసతులు సమకూర్చడం, పూర్తి స్టాఫ్‌ను ఇవ్వడం, దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్–19ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల పాలిట పెన్నిధి పాలకుడిగా జగన్ వార్తల్లోకి ఎక్కారు. రెండేళ్ల స్వల్ప కాలంలోనే గణనీయమైన మార్పులు తెచ్చి ప్రజల హృదయాల్లో స్థానాన్ని స్థిరం చేసుకుంటున్నారు. తనది వాగ్దాన, వాగాడంబర ప్రభుత్వం కాదు; ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు కాబట్టే ప్రజల మెప్పు పొందుతున్నారు. బద్వేల్ ఉపఎన్నికలోనూ జగన్ పాలన వైసీపీకి ఘన విజయాన్ని చేకూర్చుతుందన్నది వాస్తవం. డా.కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా, నవలా రచయిత. మొబైల్: 91829 18567 -
బడుగుల ఆత్మగౌరవ మార్గం ఇదేనా?
మొన్న వివేక్, నిన్న స్వామిదాసు, నేడు ఈటల రాజేందర్ పదమూడేళ్లు నిరంతర పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుండి ఉంటే బీజేపీ తెలంగాణను ఇచ్చిఉండేది కాదన్నది వాస్తవం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై బీజేపీ చూపుతున్న సవతితల్లి ప్రేమ లేదా ప్రేమరాహిత్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విభజన హామీలను కూడా ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన నిధులనివ్వడంలోనూ వేధిస్తూ బీజేపీ ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ లోలా సబ్బండ వర్ణాలను పట్టించుకొని పాలన సాగిస్తున్న వైనముందేమో ఈ నాయకులే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్యం ఈ ఏడేళ్ళలో చేపట్టిన పథకాలు, సంక్షేమ చర్యలు తెలంగాణలోని ప్రతి గడపనూ ఏదో విధంగా తాకుతున్న నగ్నసత్యం వీరికి తెలియంది కాదు. అయినా సరే టీఆర్ఎస్ పార్టీలో తమ ఆత్మగౌరవం పోయిందని, తమకు ప్రాముఖ్యత లేదని చిలకపలుకులు పలికే వీరు బీజేపీలో పొందుతున్న ఆత్మగౌరవం ప్రాముఖ్యత ఏంటో చెబితే బాగుం టుంది. మార్గనిర్దేశకులైన మేధావులు తమ మాటలకు, రాతలకు జవాబుదారీ కలిగివుండాలి. రాజకీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు, స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు, చర్యలు చేసినప్పుడు తమ రాష్ట్రానికి లేదా దేశానికి ఏ పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తోందో, ఏం చేయగలదో అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, మానవ కేంద్రక పాలననిచ్చే పార్టీ విషయంలో క్లారిటీ లేని మేధావులే ఎక్కువ ఉన్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో గందరగోళ పరి స్థితులేర్పడి ఈ నేలను రాజకీయ ప్రయోగశాలగా మార్చుతున్నారు. ఐఏఎస్ పదవి వదిలిపెట్టి పార్టీ స్థాపించి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా గెలిచాడు అరవింద్ కేజ్రీవాల్. ఇతనికి ఏ రాజకీయ దృక్పథమూ లేదు. అవినీతి రహితపాలనే ఎజెండా. ప్రజల కనీసావసరాలైన విద్యుత్తు, నీరు, ప్రభుత్వ పాఠశాలలు, ఉత్తమ వైద్యం, మంచి రోడ్లు, మురికివాడలు లేకుండా చూడటం, అధికార్లంతా ప్రజలకు అవసరాల్లో అందుబాటులో ఉండటం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తానే రాజు, తానే మంత్రిగా, అన్నీ నిర్వహిస్తూ వస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ అనే మరో ఐఏఎస్ అధికారి పదవి వదలి రాజకీయ పార్టీ స్థాపించాడు. నీతి గల రాజకీయాలు నడపడం ఆశయంగా పెట్టుకున్నారు. అతికష్టంగా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా ఏ దృక్పథంలేని పార్టీగా మిగిలిపోయి పార్టీ దాదాపు అంతర్ధానమైంది. మరో ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చెయ్యబోయి విఫలమయ్యాడు. ఆకునూరి మురళి ఐఏఎస్ అధికారి. రాజకీయాభిప్రాయమున్నా, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఉత్తమ సలహాలిచ్చి మెప్పుపొందాడు. కాన్షీరాంగారు ఐఏఎస్ ఆఫీసర్ కాదు గాని విద్యాధికుడైన సైంటిస్ట్. నిరుపేద కుటుంబంనుంచి వచ్చిన దళితుడు. దళిత బహుజన రాజకీయాల కోసం ఉద్యోగం వదిలి, బ్రహ్మచారిగానే ఉండి తనను తాను ప్రజల కోసం అంకితం చేసుకున్నవాడు. కాలినడకన, సైకిల్‌పై దేశమంతా తిరిగి బహుజన రాజకీయాలను వ్యాప్తి చేసినవాడు. బీఎస్పీ పార్టీ స్థాపించి దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీని మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన సిద్ధాంతకర్త. ఒంటిచేత్తో పార్టీని దేశ వ్యాప్తం చేసి, బహుజన రాజకీయాలను దేశవ్యాప్తం చేసి అందుకోసమే జీవించి, మరణించినవాడు. కాన్షీరాం తర్వాత మాయావతి బీఎస్పీ అధినేత్రి అయినా కాన్షీరాం స్థాయిలో పార్టీని విస్తృతం చెయ్యలేకపోవడం వల్ల ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత మేధావి, దళిత ఆర్తి ఉన్నవాడు. చాలామంది దళితులు, బీసీలు, పేదవారి లాగే ఆతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నోకష్టనష్టాలకోర్చి, చదువునే ప్రేమించి, కఠోర పరిశ్రమచేసి తన జీవిత లక్షమైన ఐపీఎస్ సాధించాడు. పోలీసాఫీసరుగా ఉన్నతోన్నత స్థానాలకెదిగాడు. పదహారు సంవత్సరాలు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశాడు. ప్రభుత్వ ఉత్తర్వులను సవినయంగా పాటించి, వీలైనంత వరకు ప్రజలతో సఖ్యంగా ఉండి అటు ప్రభుత్వ మన్ననలు, ఇటు ప్రజలమెప్పు పొందాడు. దళితులకు, పేదలకు మంచి చదువును ఇవ్వడం ఆయన తాత్విక స్వప్నం. పోలీసు అధికారిగా ఉంటే తన పేదల చదువుకల నెరవేరదని గురుకుల సంక్షేమ పాఠశాలల సెక్రటరీగా చేరాడు. రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు రెన్యువల్ పొంది మొత్తం తొమ్మిదేళ్ళు ఆ పదవిలో పనిచేశాడు. గురుకుల సంక్షేమ విద్యాలయాల కార్యదర్శిగా ఆయనచేసిన అమూల్యమైన సేవలకు తృప్తిపడేకావచ్చు లేదా ప్రవీణ్ కుమార్ కోర్కె పైనే కావచ్చు కేసీఆర్ అతన్ని తొమ్మిదేండ్లు ఆ పదవిలో ఉంచాడు. సమర్థుడైన అధికారి అయితే ప్రభుత్వనిబంధనలను అతిక్రమించకుండానే ప్రజలకుపయోగపడే అద్భుతమైన పనులు చేయవచ్చని ఈ 9 సంవత్సరాల కాలం నిరూపించింది. ఈ కాలంలో 900 పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ, సైనిక్ స్కూల్, లా కాలేజ్, కోడింగ్ స్కూల్ తెలంగాణలో నాణ్యమైన విద్యనందించాయి. పేద దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యా స్వప్నం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాశాలలో చదువుకునే అవకాశం, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యే అవకాశం ఈ విద్యాలయాలవల్ల లభించింది. ప్రభుత్వం మంచి విద్యాలయాలు స్థాపించి వేల కోట్ల డబ్బులివ్వడం, పేద అణగారిన జాతుల విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రవీణ్‌కుమార్ ఆశయ సిద్ధివల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ఈ విజయంలో ప్రభుత్వంగా కేసీఆర్, అధికారిగా ప్రవీణ్‌కుమార్ భాగస్వాములే. ఈ స్వల్పకాలంలో ఇన్ని విద్యాలయాలు, రెండున్నర లక్షలమందికి పైగా నాణ్యమైన విద్య, ఆత్మగౌరవం, బడుగుల్లో ఆత్మగౌరవం కలిగిస్తే.. ఇంకో ఆరేళ్ల పూర్తి కాలంలో మరెన్ని విజయాలు లభించేవో ప్రవీణ్ కుమార్ ఆలోచించాలి. ప్రవీణ్‌కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంవల్ల, అదీ జాతీయపార్టీలో చేరడంవల్ల పరమపద సోపాన రాజకీయ చదరంగంలో ఈ తొమ్మిదేళ్లలో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు, లభించిన రాజకీయ సహకారం భవిష్యత్తులో లభిస్తాయా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా రచయిత మొబైల్ : 91829 18567 -
2 Years Of YS Jagan Rule In AP: ఇరవై ఏళ్ల భరోసా
ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజలే పాలకులను ఎన్నుకొనే కాలం. రాజులు పోయి, మంత్రులొచ్చిన సమయం. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఎంతమంది ప్రజల నాల్క లపై ఉంటున్నారు? ప్రజల హృదయాలను జయిస్తున్నారు? ప్రజోపయోగకర పనులు చేస్తూ, తన పాలనలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చిన పాలకుడే ఉత్తమ నాయకుడు. రాజకీయాలు మరింత ఘోరంగా మారుతూ, మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారుతూ విలువలు మృగ్యమవుతున్న సమయంలో మానవీయ పనులకు, మనిషికి ప్రాధాన్యతనిచ్చి పాలన అందిస్తున్న యువనాయకుడు జగన్. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయినా ఆంధ్రప్రదేశ్ నేలిన ఏ పాలకుడూ తేని మౌలిక మార్పులను తీసుకు రాగలిగారు. ఎన్నికల వాగ్దానాలను 90 శాతానికి పైగా నెరవేర్చగలిగారు. ప్రతిపక్షాలు అదేపనిగా ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా, కువిమర్శలు చేస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలకు మౌలికావసరాలైన విద్య, వైద్యం, సేద్యంలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఏ పాలకుడి విజయమైనా పెట్టుబడిదారులను, బిలియనీర్లను సంతృప్తిపరచి వారిని మరింత ధనవంతులుగా మార్చడంలో ఉండదు. కోట్లాది సామాన్య ప్రజల కంచాల్లోకి పట్టెడన్నం, ఇళ్లల్లోకి జ్ఞానాన్నిచ్చే చదువు, రోగాలొస్తే ఉచిత వైద్యం అందించగలిగేవాడే ఉత్తమ పాలకుడవుతాడు. విద్యారంగం విషయంలో జగన్ చేసిన పనులు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేవిగా, పేదల పాలిటి శాపంలాంటి కార్పొరేట్ విద్యను నిరుత్సాహ పరిచేవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇంగ్లిష్ మాధ్యమ విద్యను అందుకోడానికి లక్షలాది రూపాయల ఖర్చును భరించలేని బహుజనులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఓ వరం. ఇది బహుజనుల చిరకాల స్వప్నం కూడా. దీనివల్ల అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య అందరికీ లభిస్తుంది. ఈ విధానం విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, నాడు నేడు లాంటి అనేక పథకాలు, ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులు గలవిగా తీర్చిదిద్దుతాయి. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది. విద్య విషయంలో ఇలావుంటే రాజ కీయపదవుల విషయంలోనూ బహుజన కులాలవారికి సముచిత స్థానం లభిస్తుంది. ఇటీవల జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎనభైశాతం పదవులు, నామినేటెడ్ పదవులు బహుజనుల కివ్వడం బహుజనుల విషయంలో మౌలిక మార్పునకు చక్కని ఉదాహరణ. ఇక సామాన్య మానవుల జీవి తాల్లో అతిముఖ్యమైన అవసరాల్లో వైద్యసౌకర్యం ఒకటి. శవాలపై పైసలేరుకునే దుర్మార్గపు వ్యవస్థలో మనిషి ప్రాణాలతో చెలగాటాలాడటం వైద్యరంగంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అన్ని రోగాలకు వర్తింపజేయడం మానవీయ చర్య. కరోనాను ఎదుర్కోవడానికి ఇంటిం టికి వాలంటీర్లను పంపడం, పరీక్ష చేయడం, ఉచి తంగా కిట్లు ఇవ్వడం, ఇసోలేషన్ సెంటర్లను విరి విగా ఏర్పాటు చేయడంలాంటి అనేక చర్యలు జగన్ చేపట్టారు. ప్రభుత్వం చేస్తున్న పనులు మనిషితనాన్ని చాటే చర్యలనడంలో సందేహం లేదు. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు భరోసానిస్తున్నారు జగన్. రైతు భరోసా, ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, పంటనష్టం చెల్లింపు, డ్వాక్రా రుణాల వడ్డీ చెల్లింపు, ఇంటింటికి ఒక్కో వ్యక్తికి రేషన్ కార్డు బియ్యం పదికిలోల చొప్పున ఇవ్వడంలాంటి అనేక చర్యలతో సామాన్య ప్రజ లకు ఆహార కొరత లేకుండా చేస్తున్నారు. ప్రతి ఆటోవాలాకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వడం, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేయడం, మత్స్యకారులకు చేపలవేటలో భరోసా ఇవ్వడం, వృద్ధులకు, వికలాంగులకు ఇంటికే పెన్షన్ పంపడం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్ణాలనాదుకుంటున్నారు. ఏ ఒక్క మత విశ్వాసం కలవారికో కాకుండా గుడి పూజారులకు, మజీద్ మౌల్విలకు, చర్చ్ ఫాదర్లకు గౌరవ వేతనం ఇస్తూ లౌకిక భావనను, సర్వమత సమాన భావనను పెంపొందిస్తున్నారు. ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు, రాష్ట్ర అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టతతో ఉండటం, ఆర్టీసీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం, పదహారు వైద్యకళాశాలల నిర్మాణానికి పూనుకోవడం ఆంధ్ర ప్రజలకు పాలనాపరమైన భరోసానివ్వడమే. సచివాలయం, పోలవరం ప్రాజెక్టు లాంటివన్నీ సకాలంలో పూర్తి చేసే చిత్తశుద్ధి, సేవాభావం జగన్‌కున్నాయి. విమానాశ్రయాల నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి కోసం కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అందుకే అన్ని ఎన్నికల్లోనూ విజయాల పరంపర. రెండేళ్ల క్రితం రాష్ట్రపాలనా పగ్గాలు చేపట్టి విరామమెరుగక శ్రమిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలనే కాకుండా అదనంగా అనేక పనులు చేస్తూ సామాన్యుడు కేంద్రబిందువుగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ రెండేళ్ల పాలన ఆంధ్ర ప్రజలకు 20 ఏళ్ల భరోసానిస్తోంది. -డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత మొబైల్ : 91829 18567 -
ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ
ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్ విజయం, కేరళలో విజయన్ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అపూర్వమైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్లో మోహరించినా బెంగాల్ టైగర్ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపర నిరూపిస్తుంది. రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది. కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది. అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అలానే వైఎస్సార్సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్ గత రెండేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 91829 18567 -
ఇప్పుడు వ్యవసాయం దండగ కాదు పండగ
తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేక బాలారిష్టాలను దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అభివృద్ధి పధం వైపు నడిపించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో, ప్రజాసంక్షేమ పథకాలు అమలు విషయంలో జాతీయ పార్టీల కంటే మెరుగైన పాలననందిస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడటంలోను, సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథ కాల ఫలితాలనందించంలోనూ, దండగన్న వ్యవసాయాన్ని పండుగగా చేయడంలోను, మతం కంటే మనిషి సంక్షేమం ముఖ్యమని భావించడంలోనూ అందరికంటే ముందున్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడినందుకు కలగాల్సిన ఫలాలు ఈ ఇద్దరు పాలకుల వల్ల ప్రజల కందుతున్నాయి. ముఖ్యంగా బహుజన కులాలందరూ వీరి వల్ల లబ్ధి పొందుతున్నారు. బహుజనుల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్ చదువులు రెండురాష్ట్రాల్లోనూ సాకారమౌతున్నాయి. ప్రభుత్వ రంగంలో తెలుగు మాధ్యమం, ప్రైవేటు రంగంలో ఇంగ్లిష్ మాధ్యమం వల్ల జరుగుతున్న వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణాలో వందలాది రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యాలయాలను స్థాపించి తెలంగాణా బహుజనులకు నాణ్యమైన విద్యా కోర్కెను సఫలం చేశారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ పిల్లల చదువులకోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుంటే, తెలంగాణలో రెసిడెన్షియల్ విద్యాలయాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యాదానం చేస్తున్నారు. వ్యవసాయమే ఓ దండుగ అంటూ టీడీపీ, గిట్టుబాటు ధర కావాలన్న రైతును కొడుతూ, నిర్బంధిస్తూ బాధించే చీకటి చట్టాలను తెచ్చిన బీజేపీ రెండూ రైతు నడ్డి విరిచాయి. వ్యవసాయాన్ని, రైతు బతుకును సంక్షోభంలోకి నెట్టాయి. పాలకుల రైతు వ్యతిరేక విధానాలు రైతు బతుకును అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు సీఎంలు వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెట్టుబడి సాయం చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు నిర్మించి నీటివసతి కలిపించడం, వివిధ పథకాలతో రైతును హృదయానికి హత్తుకొని ప్రోత్సహించడం, ఆర్గానిక్ వ్యవసాయం, మంచి విత్తనాల సరఫరా, రైతు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లాంటి పనులతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతుల ఆదాయం పెరుగుతోంది. త్వరలో వ్యవసాయం పండుగే అవుతుంది. తెలం గాణాలో కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. రెండు రాష్ట్రాలు వృత్తి పని వారలకు ఆయావృత్తులకు సంబంధించిన ఆదాయ వనరులు కల్పించి లక్షలాది కుటుంబాల ఆదాయాలు పెంచడంతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్‌ను, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, లాంటి నగరాలను ఐటీ హబ్బులుగా మార్చుతూ, అంతర్జాతీయ స్థాయి సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల ఫార్మా హబ్బులను స్టాపిస్తోంది. దేశ విదేశీయులు ఇక్కడ స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో ముందువరసలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు సబ్బండ వర్ణాలకు ఉపయోగకారులుగా ఉంటూ దేశానికే ఉదాహరణ ప్రాయాలుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను తమవైన శైలిలో అభివృద్ధి ప«థంలో నడిపిస్తున్న పార్టీలపై ఏదో విధంగా బురదజల్లి, సెంటిమెం ట్లను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అయితే ద్రవిడ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో ద్వేషం ఎజండా పని చేయదు, మనుషులను ప్రేమించే ఎజండా తప్ప. జగన్, కేసీఆర్ లాంటి బాహుబలులు తెలుగు రాష్ట్రాల్లోకి మత తత్వం ప్రవేశించకుండా నిరోధించగలుగుతారు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రచయిత, విమర్శకుడు మొబైల్ : 91829 18567 -
అన్నదాతల ధర్మాగ్రహం
అన్నదాత సుఖీభవ అని ఒక రంటారు. రైతేరాజని మరొ కరంటారు. జై జవాన్ జై కిసాన్ అని స్వయానా మాజీ ప్రధానే అన్నారు. ఎవరేమన్నా ఈ దేశంలో ‘రైతు’ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఇంతకీ రైతంటే ఎవరు? వందలు, వేల ఎకరాల భూము లున్నవాడు రైతెలా అవుతాడు? అయితే గీయితే భూస్వామి అవుతాడు గానీ. భూమి దున్నే వాడు రైతు. చెమట చుక్కలతో మట్టిని తడిపేవాడు రైతు. రైతు అనేది ఓ కులం గాదు. పారిశ్రామిక విప్లవం కావచ్చు, కమ్యూనిస్ట్ తిరుగుబాటు కావచ్చు, ప్రపంచీకరణ భూత కార్పొరేటీకరణ కావచ్చు... రైతుకు ఒరగబెట్టిందేమీ లేదు. భూమితో విడదీయలేని బంధమున్న రైతన్న భూమి లేనివాడుగా మారుతున్నాడు. ఇంతకీ నోట్లో నాలుక లేని అమాయకజీవి ఎందుకు ఢిల్లీ బాట పట్టాడు? ఎందుకోసం ధర్మాగ్రహంతో కళ్లెర్ర జేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని, వ్యవసాయ మార్కెట్లను కూడా కార్పొరేట్లకు అప్పగించి కోట్లాదిమంది రైతుల నోళ్లలో మట్టికొడుతోంది. ఏ పారిశ్రామికవేత్తయినా వస్తువుకు తానే ధర నిర్ణయిస్తాడు. కానీ రైతు పరిస్థితి కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్టుగా ఉంది. రైతు పండించిన పంటను కొనడం ప్రభుత్వాల బాధ్యత. అవసరా నికో విధిలేకో ప్రైవేట్ వ్యాపారికి అమ్మితే రైతుకు ఇప్పుడు అందుతున్న ధర కూడా లభించదు. భారతీయ రైతు నడ్డి విరిచి, ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రైతుల భూములను చేరవేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ చట్టాల వల్ల భూమంతా కార్పొరేట్ శక్తుల అధీనంలోకి పోయి రైతులు తమ భూముల్లో తామే కూలీలు అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. పైగా వినియోగదారుడు ఇప్పుడు లభిస్తున్న రేటుకంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలోని ప్రభుత్వాలంటే మునుపటి రాజులవి కావు. ప్రజలతో ఎన్నుకోబడ్డవి. ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకోవాల్సినవి. అలాంటి ప్రభుత్వాలే అన్నదాత సంక్షేమాన్ని పట్టించుకోకపోతే కార్పొరేట్ శక్తులు ఎలా పట్టించుకుంటాయి? రైతులను ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం సరైంది కాదు. డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత. మొబైల్: 91829 18567 -
సామరస్యతే మన సంస్కృతి కావాలి...
ఐదువందల ఏళ్ల మహోజ్వల చరిత్ర కలిగివున్న హైదరా బాద్ భారత స్వాతంత్య్ర కాలం నాటికే దేశంలోని ఐదు మహా నగరాల్లో ఒకటి. వివిధ భాషలకు, మతాలకు, సంస్కృతులకు కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. హైద రాబాదు కేంద్రంగా తెలం గాణ నేలిన నైజాం నవాబులు కాకతీయ రాజుల వ్యవసాయ నమూనాకు పొడిగింపుగా చెరువులు, కుంటలు, గొలుసు చెరువులతో వ్యవసాయం సాగిం చారు. నైజాం పాలన చివరి రోజుల్లో సంభవించిన రజాకారు దురంతాలను వదిలిపెడితే వారి పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు. ముస్లిం రాజుల పాలనలో కట్టబడిన గోల్కొండ ఖిల్లా, చార్మి నార్, మక్కామసీదు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సాలా ర్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్ బండ్, ఇంకా అనేక చెరువులు, కుంటలు తెలంగాణ చారిత్రక వైభవానికి చిహ్నాలు. వందలేండ్లుగా హైదరా బాద్ ప్రజలు హిందూ ముస్లిం భాయీ భాయీ అన్న ట్టుగా సహజీవనం సాగిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం వలస పాలకుల చేతుల్లోకి పాలన పోయిన తర్వాత హైదరాబాధలు మొదల య్యాయి. కుంటలు, చెరువులు ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలతో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. వాతా వరణ కాలుష్యం పెరిగింది. జనాభా పెరుగుదలకు తగినట్టుగా నీటి వనరులు కల్పించకపోవడంవల్ల తాగునీటి కొరత ఏర్పడింది. ఈ అన్ని కారణాలవల్ల సమతుల వాతావరణంలో ఉండే నగర ఉష్ణోగ్రత పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వలసలు పెరిగాయి. వలస పాలకుల పాలనలో ముఖ్యమంత్రిని మార్చాల నుకున్నప్పుడల్లా హైదరాబాద్ మత కలహాలకు వేది కగా మారింది. కర్ఫ్యూలు, 144 సెక్షన్లతో ప్రజలు నానా ఇబ్బందుల్లో పడేవారు. అభివృద్ధి కుంటుపడి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు కూడా రాని పరి స్థితి. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నీ దోపిడీకి గురై తెలంగాణ ప్రజలు పరాయీకరణ మాయలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో టీఆర్ఎస్ ఏర్ప డింది. తెలంగాణను సాధించడానికి 13 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేసింది. 2014లో అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ హైద రాబాధను, తెలంగాణ బాధను అర్థం చేసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సమస్యలతో పాటు హైదరాబాద్ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చుగానీ వాటి పరిష్కా రానికి పథకాలు రచింపబడుతున్నాయి. రాష్ట్రాన్ని వేధి స్తున్న తాగునీటి సమస్య, సాగునీటి సమస్య తీర్చ డానికి, సగం జనాభాకుపైగా బతికే వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక పథకాల వల్ల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా పయనం కొన సాగుతోంది. హైదరా బాద్ ఐటీ, ఫార్మా హబ్‌గానే కాకుండా, విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టడా నికి అనువైన స్థలంగా భావింపబడుతోంది. ఏ పరిశ్రమలైనా సక్రమంగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. స్వాతంత్య్రానంతరం తెలంగాణలో పెద్ద సమస్యగా ఉన్న విద్యుత్ కొరతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీర్చడం జరిగింది. ఒకప్పుడు దక్షిణాది వాళ్లందరూ మదరాసీలుగానే పిలవబడితే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంతో, రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రపంచ పటంలో స్థానం సంపాదిం చుకుంది. తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. లౌకికవాదిగా అన్ని మతాలకు సమాన గౌరవమిస్తూ, మత సామరస్యాన్ని కాపాడటంలో కేసీఆర్ దేశంలోనే ముందు వరుసలో ఉన్నాడు. సంక్రాంతి, దసరా, బతుకమ్మ లాంటి హిందువుల పండుగలకెంత ప్రాధా న్యమిస్తాడో రంజాన్, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలకు అంతే ప్రాధాన్యతనిస్తాడు. ఇవేవీ ప్రస్తావించకుండా బీజేపీ నాయకులు వర్షాలొస్తే హైదరాబాద్ చెరువవుతుందనీ, కరోనాను ఎదుర్కోలేదనీ, కుటుంబ పాలననీ, వరదసాయం రైతులకు అందలేదనీ అరిగిపోయిన రికార్డులతో ప్రచారం చేస్తునారు. వర్షాలను కానీ, వరదలను కానీ, కరోనాను కానీ ఎవరూ ఆపలేరు. ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొన్నాయన్నదే ప్రశ్న. ఈ అన్ని విషయాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. తెలంగాణ అభివృద్ధి ఇలాగే జరగాలన్నా, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నా, మత సామరస్యాన్ని కాపాడుకోవాలన్నా టీఆర్ఎస్ పాలన ఒక అనివార్యం. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ రచయిత మొబైల్ : 91829 18567 -
నాణ్యమైన విద్యాబోధనకు భరోసా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణ అన్ని రంగాలలో వివక్షకు గురయినట్టే విద్యారంగం కూడా వివక్షకు గురయింది. ప్రజలు కోరుకున్న ఆంగ్లమాధ్యమ విద్య అందకపోగా దాన్ని ప్రైవేట్ రంగంలో పెట్టి విద్యను ఖరీదైనదిగా మార్చారు. కోస్తా ప్రాంతానికి చెందిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యనందించే పెట్టుబడిదారులే విద్యాలయాలు నడిపించి పేదలకు విద్యను గగనకుసుమం చేశారు. వ్యాపారంగా మార్చి చదువుకోవడాన్ని చదువు‘కొనడం’గా మార్చారు. ప్రభుత్వ విద్యను అటకెక్కించారు. కోస్తా ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు, రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలు తెరుచుకొని తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. పేదవారు నాణ్యమైన విద్యకోసం, పోటీని తట్టుకోవడం కోసం అంగలారుస్తున్నారు. బహుజన వర్గాల్లోనూ ఇంగ్లిష్ మాధ్యమం, నాణ్యమైన విద్యకావాలన్న డిమాండ్ బలంగా పెరిగింది. నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ రంగంలో లభించినప్పుడు మాత్రమే అది పేద బహుజన కులాల పిల్లల కందుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వేల, లక్షల ఫీజు భారాన్ని గ్రామీణపేద బహుజనులు భరించే స్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం, ప్రైవేట్‌లో ఇంగ్లిష్ మాధ్యమం వుంది. ఉన్నత విద్యలోనూ ఇదే పరిస్థితి. ప్రజలు ముఖ్యంగా గ్రామీణ పేద బహుజనులు కోరుకుంటున్న ఇంగ్లిష్ మాధ్యమం. నాణ్యమైన విద్యను అందించడం ఎలా అనే విషయంలో ప్రభుత్వ పరంగా చర్చోపచర్చలు జరిగాయి. నాణ్యమైన విద్యంటే రాచిరంపాన పెట్టి ఎంసెట్ ధ్యేయంగా మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యనందించడం కాదు. విద్యార్థి అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించడం, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలనూ ఎదుర్కోవడం. చదువును జీవితానికి అన్వయించుకోవడం... ఇవి సాధ్యపడేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలు నాలుగైదేళ్ళలో రెండింతలకంటే ఎక్కువై 900కు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి పెరిగి ప్రతి మండలంలో నాణ్యమైన విద్య గ్రామీణుల కందుతోంది. సగర్వంగా, సమున్నతంగా ఇవీ మా నాణ్యమైన విద్యాలయాలకు నమూనా అని చెప్పుకోదగ్గవి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య 267 ఉన్నా క్రమక్రమంగా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రీడలకు ప్రైవేటు విద్యాసంస్థలు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కనీసం విద్యార్థులు కూర్చోడానికి సరిపడా స్థలం కూడా లేనిచోట ఆ సంస్థలు నడుస్తుండగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు మాత్రం విశాలమైన బయటి ప్రదేశాల్లో ప్రకృతి మధ్య ఉన్నాయి. చదువుతో పాటు ఇతరేతర వ్యాపకాలు, ఉపన్యాస పోటీలు, క్విజ్లు, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు... నిర్వహిస్తూ విద్యార్థి మనో వికాసానికి తోడ్పడుతున్నాయి. చదువులు ముగిశాక అందరికీ ఉద్యోగాలు రావడం ఏ సమాజంలోనూ సాధ్యంకాదు. కానీ, ఆ జ్ఞానంతో సొంతంగా బతకగలిగే స్థితి పొందాలి. చిన్న ఉద్యోగం నుండి ఉన్నతోద్యోగాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలతో పాటు స్వయం ఉపాధితో బతకగలిగే స్థితి రావాలి. తెలంగాణ గురుకుల విద్యాలయాలు ఆ పని చేస్తున్నాయి. కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా సినిమా, పెయింటింగ్, డ్రైనేజ్, సేంద్రియ వ్యవసాయం, వంటలు, రోజువారీ జీవితంలోని అవసరాలు, కరాటే, కుంగ్‌ఫూ... లాంటి అనేక విషయాలపై అవగాహన కల్పించడం ఈ విద్యాలయాల ప్రత్యేకత. సమ్మర్ క్యాంపుల్లో భారతదేశంలో ప్రధాన వృత్తి అయిన వ్యవసాయం, కంప్యూటర్, కౌన్‌బనేగా కరోడ్ పతి లాంటి విజ్ఞాన సముపార్జనకు సంబంధించిన విషయాలన్నింటిపై అవగాహన కల్గిస్తున్నారు. ఇక్కడ చదివిన అమ్మాయిలు ఎవరెస్ట్ విజేతలు కావడం తెలంగాణకే గర్వకారణం. అంతేకాదు... ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో డాక్టర్లు, డెంటల్ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీయన్లు కావడం, సీఏ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనిర్సిటీల్లో ఈ విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. తెలంగాణ బహుజన సమాజం చిరకాల స్వప్నమైన నాణ్యమైన, ఇంగ్లిష్ విద్య అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఆ విద్యాలయాల రధసారథి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ బహుజన సమాజం రుణపడి ఉంటుంది. డా.కాలువ మల్లయ్య వ్యాసకర్త రచయిత, కవి మొబైల్: 9182918567 -
బహుజనుల బాగుకే మూడు రాజధానులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 9 నెలలుగా రాష్ట్రాభివృద్ధి కోసం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, శాసన మండలి రద్దు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, బహుళ రాజధానుల ఏర్పాటు లాంటివన్నీ దమ్మున్న చర్యలు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవే. అధికారంలో ఉన్న పార్టీ ఏది చేసినా దాన్ని వ్యతిరేకించి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ, ఏపీ శాసన మండలి రద్దుతోపాటు బహుళ రాజధానులనూ వ్యతిరేకిస్తోంది. అందరి ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను వ్యతిరేకిస్తూ తమ బాధను అందరి బాధగా చిత్రిస్తూ నానా యాగీ చేస్తున్నారు. ప్రధానమైన అసెంబ్లీ భవనాలు ఇతరాలు అన్నీ అమరావతిలో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకే చోట ఉండాలనడం స్వార్థం కదా? ఓ బలమైన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఆ సమస్యతో సంబంధం లేని చిన్న రైతులను, బహుజనులనూ వాడుకోవడం సరైందేనా? ఇప్పటికే చాలా రంగాల్లో అభివృద్ధి చెందిన వర్గం ప్రబలంగా ఉన్న ఈ ప్రాంతంలోనే రాజధాని మొత్తంగా ఉండాలనడం ఏం న్యాయం? రాజధాని వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాల బహుజన వర్గాలు బాగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో విశాఖపట్నం, కర్నూలు నగరాలు కూడా మహానగరాలుగా అభివృద్ధి చెంది ఏపీ మూడు మహానగరాలున్న రాష్ట్రంగా అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతులను సాధిస్తుంది. ఉత్తరాంధ్రలో ఆదివాసీల జనాభా ఎక్కువ. బహుజన కులాల వెనుకబాటు తనమూ ఉంది. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ రాజధానులను ఏర్పరచడం ద్వారా కచ్చితంగా వీటికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినిమా పరిశ్రమకు అనువైన స్థలం వైజాగ్. రాజధాని ఇక్కడుంటే భవిష్యత్తులో ఇక్కడికి సినిమా పరిశ్రమ రావడం వల్ల వేలాది మంది లబ్ధి పొందుతారు. క్రమక్రమంగా ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశముంది. అలాగే ప్రకృతి శాపంతో నీట కరువు, అనేక చారిత్రక కారణాల వల్ల ఫ్యాక్షనిజం లాంటి వాటితో వెనుకబడున్న రాయలసీమ కూడా న్యాయ రాజధాని కర్నూలుకు రావడంవల్ల అభివృద్ధి చెందుతుంది. న్యాయంగా తనకు రావాల్సిన నిధులు, నీళ్ళు, విద్యాలయాలు, పరిశ్రమలు పొంది ఉపాధి అవకాశాలు మెరుగవడం వల్ల.. రాళ్ళ సీమగా మారిన ‘రాయల సీమ’ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఇక్కడి బహుజనులు వివిధ అవకాశాలు పొంది అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తారు. తెలుగు రాష్ట్రాలనేలిన పాలకులందరికంటే కూడా మేలయిన రీతిలో బహుజనుల కోసం అనేక పనులు చేస్తున్న జగన్మోహన్రెడ్డి బహుళ రాజధానులను ఏర్పర్చడం ఆంధ్రప్రదేశ్ సమతుల, సర్వతోముఖాభివృద్ధి కోసమే. ఏపీ ప్రజలకు ఒక్క మహానగరమే కావాలో, మూడు మహానగరాలు కావాలో, 29 గ్రామాల బాగోగులే కావాలో, 5 కోట్ల మంది అభివృద్ధి కావాలో, పిడికెడు మంది బిలియనీర్లు కావాలో, కోట్లమంది బహుజనులు మధ్య తరగతికైనా ఎదగాలో ఆలోచించండి. జగత్ ప్రసిద్ధ రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కానట్లే.. విశాఖపట్టణమైనా, అమరావతైనా, కర్నూలైనా మహానగరాలుగా అభివృద్ధి చెందడానికి ఒకటి, రెండు దశాబ్దాల కాలమైనా పడుతుంది. సత్సంకల్పంతో, బహుజనాభివృద్ధి ధ్యేయంగా ఈ పనిని ఆరంభిం చిన వైఎస్ జగన్‌కు చేయూతనివ్వండి. కాలుపట్టి వెనుకకు లాగితే అది అతిపెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 91829 18567 -
తండ్రి బాటలో తనయుడు
తెలుగు రాష్ట్రాలను స్వాతంత్య్రానంతరం 14 మంది సీఎంలుగా పాలించారు. వీరిలో అత్యుత్తమ పాలన అందించిన సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డినే పేర్కొనక తప్పదు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, వాగ్దానాలను నెరవేర్చడంలో వైఎస్సార్‌దే ప్రథమస్థానం. తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో వైఎస్సార్‌దే అగ్రస్థానం. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన ప్రాంతీయతను, గ్రామీణతను, దేశీయతను వదిలి నేల విడిచి సాము చేస్తున్నవేళ.. సుదీర్ఘ పాదయాత్రను చేశారు వైఎస్సార్. అనంతరం 2004 ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టిన వైఎస్సార్ అంతవరకు విస్మరణకు గురైన అన్ని రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వ్యవసాయక్షేత్రాలుగా మార్చడానికి అనేక నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించారు. పనికి ఉపాధి పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి రెండువందల పై చిలుకు రోజులకు ఆదాయ గ్యారంటీనిచ్చారు. పావలా వడ్డీకి రుణాలిచ్చి రైతులను, వృద్ధాప్య పెన్షన్‌తో వృద్ధులను ఆదుకున్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఏటా డీఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ, 108 సౌకర్యం ద్వారా పేదల ముంగిట్లోకి కార్పొరేట్ వైద్యం అందేట్టు చేశారు. ఈ పథకం ద్వారా లక్షలాది ప్రాణాలు నిలబడ్డాయి.ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల, రైతుల ఆత్మహత్యలు, ఫ్యాక్షనిజం హత్యలు వైఎస్సార్ తీసుకున్న సాహసోపేత చర్యల వల్లనే తగ్గుముఖం పట్టాయి. విద్యా, వైద్య, వ్యవసాయరంగాలలో ఆయన చేసిన సంస్కరణలు, తీసుకున్న చర్యలు అగ్రశ్రేణి నాయకుడిగా నిలబెట్టాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జన హృదయాలను గెలుచుకున్న వైఎస్సార్ అకాల మరణం ప్రజల్ని దుఃఖసాగరంలో ముంచింది. తండ్రి బాటను మరింత విశాలం చేస్తూ వైఎస్ జగన్ తొమ్మిదేళ్లు మడమతిప్పని పోరాటం చేసి విజయుడయ్యారు. ఎన్ని కష్టాలొచ్చినా ఒంట రిగానే ఎదుర్కొని రాజకీయ పోరాటం చేశారు. వేల కిలోమీటర్ల పాదయాత్రనూ చేశారు. ఆచరణీయమైన మేనిఫెస్టోతో ఎన్నికల బరిలోకి దిగారు. తాను గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిం చారు. ఘనవిజయం సాధించాడు. ఈ ఐదారు నెలలుగా జగన్ ఏపీ సీఎంగా చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు తన తండ్రి వైఎస్సార్ ఆశయాలను మరింత విశాలం చేస్తున్నాయి. గ్రామ వాలంటీర్లను నియమించడం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగ కల్పనకు పాల్పడటం వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగ పనుల్లో ముఖ్యమైనవి. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య కోసం మెజారిటీ బహుజనులు కోరుకుంటున్న ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత చర్యల్లో ముఖ్యమైనవి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, ఆరోగ్యశ్రీలాంటి అద్భుత పథకాలను అందరికీ వర్తింపజేయడంలోనూ, నవరత్నాలను ప్రోత్సహించడంలోనూ జగన్ ప్రభుత్వం చూపుతున్న చొరవ అద్వితీయం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఒక సంవత్సరం, కనీసం ఆరు నెలల కాలమైనా ఇవ్వకుండా, వేచిచూడకుండా ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి నుంచే పసలేని విమర్శలు చేస్తూ తాము పలుచబడుతూ వైఎస్ జగన్ మరింత బలపడటానికి తోడ్పడుతున్నాయి ప్రతిపక్షాలు. ఏదేమైనా తండ్రి బాటను సువిశాలంచేస్తూ, బహుజనులకు అండదండగా ఉంటూ తెలుగుజాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలబెడుతున్న యువకిశోరం వైఎస్ జగన్మోహన్రెడ్డి. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ సామాజిక రచయిత మొబైల్ : 91829 18567 -
బహుజనుల చిరకాల స్వప్నం ఇంగ్లిష్
మెకాలే భారతదేశంలో ఇంగ్లిష్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు దేశంలో అక్షరాస్యత రెండు, మూడు శాతాన్ని మించి లేదు. 1901 నాటికి ఈ అక్షరాస్యత ఐదుశాతం. బ్రాహ్మణ, హిందూరాజులు శూద్రులకు, అతి శూద్రులకు చదువులు లేకుండా చూడాలన్న నియమాన్ని తు.చ.తప్పకుండా పాటించారు. ఇలా ఈ దేశ బహుజనులకు చదువులు అందని మానిపండ్లే అయ్యాయి. భారతీయ బహుజనులు గులాంగిరి నుంచి విముక్తం కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవాలని, విద్యావంతులు కావాలని పూర్తిస్థాయిలో పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేసిన మొట్టమొదటి బహుజన తాత్వికుడు మహాత్మ జ్యోతిబాపూలే. బ్రిటిష్ వారి ప్రోత్సాహంతో కులాలకతీతంగా అందరికీ విద్యనందించాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫూలే స్ఫూర్తితో చదువుల్లో సారమెల్ల చదివాడు. ఆయన భారత రాజ్యాం గంలో పొందుపరిచిన రిజర్వేషన్లు, విద్యా హక్కుల వల్లనే ఈ దేశ బహుజనులు ఈ మాత్రంగానైనా చదువుకోగలిగారు. గత శతాబ్ది ‘80’ల వరకూ ప్రైవేట్ పాఠశాలలుండేవి కావు. ఒకటి, అరా క్రైస్తవ మిషనరీలో నడిపే ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలుండేవి. ఈ పాఠశాలల్లో ధనవంతులు, అగ్రవర్ణాల వారే ఎక్కువ మంది చదువుకునేవారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని బహుజనులు స్వల్పంగానైనా చైతన్యవంతులు కావడం అగ్రవర్ణాలకు నచ్చలేదు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. అందులో ఇంగ్లిష్ మీడియం చదువులు మాత్రమే ఉంటాయి. బహుజనులకు తరతరాలుగా చదువును నిరాకరించిన ఉన్నత కులాలవారే ఈ పాఠశాలలు, కళాశాలల్లో వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు అనే మాటే వినబడకున్నా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం వద్దనే వాళ్ళు, తెలుగు భాషోద్ధారకులమని చెప్పుకునే వాళ్ళు పెదవి కూడా కదపలేదు. ఇప్పుడేమో గ్రామీణ పేదలకు ఇంగ్లిష్ మాధ్యమమంటే నానాయాగీ చేస్తున్నారు? ఇదేం న్యాయం? క్రమక్రమంగా బహుజన పేదలకూ ఇంగ్లిష్ చదువులపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం. ప్రైవేట్ ఉద్యోగాలు.. ఐటీ ప్రాధాన్యత పెరగడం. విదేశీ వలసలు పెరగడం అన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఇంగ్లిష్‌కి ప్రాధాన్యతనివ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ పేద బహుజనులు కూడా మాకు ఇంగ్లిష్ మీడియమే కావాలంటున్నారు. గత ముప్పై నలభై ఏళ్లుగా తెలుగు జాతి బహుజనులు, అసలైన తెలుగు భాషా పరిరక్షకులు ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఆ చదువులు కావాలని కలగంటున్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేస్తున్న ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధానం బహుజనులకు ఆత్మస్థైర్యాన్నిస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి మీరెవరు? విద్యాహక్కులో భాగంగా ఇంగ్లిష్ మాధ్యమ చదువులు కావాలని కోరుకుంటున్న బహుజనుల పిల్లలను ఫీజుల భారం మోయలేక నిరక్షరాస్యులుగా మిగలమంటారా? ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలను, కళాశాలను నడుపుతున్నది మీరే. మీ పిల్లలను, మనుమలను, మనుమరాండ్లను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తున్నది మీరే. ఇండ్లల్లోంచి తెలుగును తరిమివేసింది మీరే. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేసింది మీరే. మాతృభాషలను వేన వేల ఏళ్ళుగా కాపాడుతున్నది బహుజనులు, వాళ్ళే తమకిప్పుడీ ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. తమ విద్యాహక్కుగా కోరుతున్నారు. అడ్డుకుంటానికి మీరెవరు?బహుజనుల అంతరంగాన్ని అర్థం చేసుకొని, ఆధునిక పోకడలను అవగాహన చేసుకొని ఇంగ్లిష్ అవసరాన్ని గుర్తించి ‘బహుజనుల చిరకాల స్వప్నం ఆంగ్లమాధ్యమం’ను సాకారం చేస్తున్న యువనాయకుడు వై,ఎస్.జగన్మోహన్ రెడ్డిని అభినందిద్దాం. ఈ చర్యను విజయవంతం చేస్తే బహుజనులంతా ఆయనకు రుణపడి ఉంటారు. డా. కాలువమల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, మొబైల్ : 91829 18567 -
రాజనీతి శాస్త్రమా? రాజభీతి శస్త్రమా?
స్వాతంత్య్ర పోరాటంలో, ఉద్యమాల్లో, రాజకీయాలలో పాల్గొన్న చాలామంది ఆనాడు తమ ఆస్తులను హారతి కర్పూరం చేసుకున్నారు. రాజకీయాలు అంటే సేవే పరమావధిగా భావించిన కాలమది. కానీ క్రమంగా మన రాజకీయాలు సంపాదన మార్గాలుగా, అధికారాలు చలాయించే కేంద్రాలుగా మారాయి. చట్టం, న్యాయం, ధర్మం దేన్నీ లక్ష్యపెట్టకుండా, అధికారమే పరమావధిగా రాజకీయనేతలు ఏమి చేయడానికైనా, ఎంతగా దిగజారడానికైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజ్యాంగాన్ని కూడా లక్ష్యపెట్టని స్థితి వచ్చేసింది. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం, ఏ పార్టీ నుంచి గెలిచినా తమ పార్టీ లో కలుపుకోవడం, పార్టీ మార్పిడులతో అధికార పక్షాన్ని కూలగొట్టి ప్రభుత్వాలనేర్పాటు చేయడం రాజకీయ నీతి రాహిత్యానికి పరాకాష్ట. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, గరీబీ హటావో, బంగ్లాదేశ్ విముక్తి లాంటి చర్యలతో తిరుగులేని ‘రాజకీయశక్తి’గా మారిన ఇందిరా గాంధీ హయాంలోనే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడం, పార్టీమార్పిడులతో ప్రభుత్వాలనే మార్చివేయడం వంటి చర్యలకు నాంది పలికారు. ప్రభుత్వాలను కూలదోయడం, పార్టీ మార్పిడులతో ప్రభుత్వాలను ఏర్పరచడం, ప్రతిపక్షాలే లేకుండా చేయడం, మొత్తం పార్టీని మార్పు చెందించి తమ పార్టీ జెండా కప్పడం గత నాలుగైదేళ్లుగా బహిరంగంగా జరుగుతోంది. బి.జె.పి. ఆధ్వర్యంలో గోవా ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోనూ, టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ, టి.ఆర్.ఎస్. అధ్వర్యంలో తెలంగాణలోనూ ఈ రచ్చకీయం గత నాలుగైదేళ్ళుగా జరుగుతుంది. ఏ పార్టీ చేసినా ఇది అనైతిక, అరాచకీయ చర్యే. ఈ చర్యలను చట్టం ఒప్పుకుంటుందేమో కాని న్యాయం, ధర్మం, నైతికపరంగా తప్పుడు చర్యలే. ‘రాజ్యాంగ విరుద్ధ చర్యలే’. ఓ పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరి మంత్రి పదవులు కూడా పొందడం హేయాతిహేయమైందే. శరీరంపై చొక్కా మార్చినట్టు మాది ఫలానా పార్టీ అనడం ఎంత హేయం? ఏ పార్టీ ద్వారా గెలిచినా అధికార పార్టీకి రావడమే ధ్యేయమైతే కోట్ల ఖర్చుతో ఎన్నికలెందుకు? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రతిపక్షం లేకుండా చేయడమంటే ప్రశ్నను అడ్డుకోవడమే. ప్రజల తీర్పును అపహాస్యం పాలు చేయడమే. పార్టీ మార్పిడులతో ప్రభుత్వాలను కూలదోయడం కూడా అప్రజాస్వామికమే. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకే అప్పుడు ఇందిరాగాంధీ, నేడు చంద్రబాబు ప్రజాగ్రహానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ మార్పిడులను ఏస్థాయిలోనూ ప్రోత్సహించడం లేదు. వైఎస్సార్సీపీలో చేరాలంటే ఎవరైనా సరే తమ పదవికి రాజీనామా చేసి మరీ రావాలని చెప్పడం అద్భుతమైన నిర్ణయమే. యువనేత జగన్ చర్య అన్ని పార్టీలకు, ఫిరాయింపును ప్రోత్సహించే నేతలందరికీ కనువిప్పు కావాలి. రాజభీతి శాస్త్రంగా మారిన రాజకీయాలు రాజనీతిశాస్త్రంగా మారితేనే మన ప్రజాస్వామ్యం బతుకుతుంది. -డాక్టర్ కాలువ మల్లయ్య, ఫోన్ నెంబర్: 91829 18567 -
‘చినజీయర్‌స్వామిపై రాజద్రోహం కేసు పెట్టాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీయర్ స్వామిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీపీఎస్కే, కేవీపీఎస్ ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేయడం విచారకరమని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కులాలు ఉండాలి, వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయర్ స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆక్రమించుకున్న 500 ఎకరాల ఆశ్రమం వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన చినజీయర్ స్వామిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబాబు, ప్రముఖ కవి కాలువ మల్లయ్య, జేవీవీ జాతీయ నాయకులు టి.రమేశ్, పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.