మెకాలే భారతదేశంలో ఇంగ్లిష్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు దేశంలో అక్షరాస్యత రెండు, మూడు శాతాన్ని మించి లేదు. 1901 నాటికి ఈ అక్షరాస్యత ఐదుశాతం. బ్రాహ్మణ, హిందూరాజులు శూద్రులకు, అతి శూద్రులకు చదువులు లేకుండా చూడాలన్న నియమాన్ని తు.చ.తప్పకుండా పాటించారు. ఇలా ఈ దేశ బహుజనులకు చదువులు అందని మానిపండ్లే అయ్యాయి. భారతీయ బహుజనులు గులాంగిరి నుంచి విముక్తం కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవాలని, విద్యావంతులు కావాలని పూర్తిస్థాయిలో పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేసిన మొట్టమొదటి బహుజన తాత్వికుడు మహాత్మ జ్యోతిబాపూలే.
బ్రిటిష్ వారి ప్రోత్సాహంతో కులాలకతీతంగా అందరికీ విద్యనందించాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫూలే స్ఫూర్తితో చదువుల్లో సారమెల్ల చదివాడు. ఆయన భారత రాజ్యాం గంలో పొందుపరిచిన రిజర్వేషన్లు, విద్యా హక్కుల వల్లనే ఈ దేశ బహుజనులు ఈ మాత్రంగానైనా చదువుకోగలిగారు. గత శతాబ్ది ‘80’ల వరకూ ప్రైవేట్ పాఠశాలలుండేవి కావు. ఒకటి, అరా క్రైస్తవ మిషనరీలో నడిపే ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలుండేవి. ఈ పాఠశాలల్లో ధనవంతులు, అగ్రవర్ణాల వారే ఎక్కువ మంది చదువుకునేవారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని బహుజనులు స్వల్పంగానైనా చైతన్యవంతులు కావడం అగ్రవర్ణాలకు నచ్చలేదు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు.
అందులో ఇంగ్లిష్ మీడియం చదువులు మాత్రమే ఉంటాయి. బహుజనులకు తరతరాలుగా చదువును నిరాకరించిన ఉన్నత కులాలవారే ఈ పాఠశాలలు, కళాశాలల్లో వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు అనే మాటే వినబడకున్నా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం వద్దనే వాళ్ళు, తెలుగు భాషోద్ధారకులమని చెప్పుకునే వాళ్ళు పెదవి కూడా కదపలేదు. ఇప్పుడేమో గ్రామీణ పేదలకు ఇంగ్లిష్ మాధ్యమమంటే నానాయాగీ చేస్తున్నారు? ఇదేం న్యాయం? క్రమక్రమంగా బహుజన పేదలకూ ఇంగ్లిష్ చదువులపై ఆసక్తి పెరిగింది.
ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం. ప్రైవేట్ ఉద్యోగాలు.. ఐటీ ప్రాధాన్యత పెరగడం. విదేశీ వలసలు పెరగడం అన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఇంగ్లిష్‌కి ప్రాధాన్యతనివ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ పేద బహుజనులు కూడా మాకు ఇంగ్లిష్ మీడియమే కావాలంటున్నారు. గత ముప్పై నలభై ఏళ్లుగా తెలుగు జాతి బహుజనులు, అసలైన తెలుగు భాషా పరిరక్షకులు ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఆ చదువులు కావాలని కలగంటున్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేస్తున్న ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.
ఈ విధానం బహుజనులకు ఆత్మస్థైర్యాన్నిస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి మీరెవరు? విద్యాహక్కులో భాగంగా ఇంగ్లిష్ మాధ్యమ చదువులు కావాలని కోరుకుంటున్న బహుజనుల పిల్లలను ఫీజుల భారం మోయలేక నిరక్షరాస్యులుగా మిగలమంటారా? ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలను, కళాశాలను నడుపుతున్నది మీరే. మీ పిల్లలను, మనుమలను, మనుమరాండ్లను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తున్నది మీరే. ఇండ్లల్లోంచి తెలుగును తరిమివేసింది మీరే. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేసింది మీరే. మాతృభాషలను వేన వేల ఏళ్ళుగా కాపాడుతున్నది బహుజనులు, వాళ్ళే తమకిప్పుడీ ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు.
తమ విద్యాహక్కుగా కోరుతున్నారు. అడ్డుకుంటానికి మీరెవరు?బహుజనుల అంతరంగాన్ని అర్థం చేసుకొని, ఆధునిక పోకడలను అవగాహన చేసుకొని ఇంగ్లిష్ అవసరాన్ని గుర్తించి ‘బహుజనుల చిరకాల స్వప్నం ఆంగ్లమాధ్యమం’ను సాకారం చేస్తున్న యువనాయకుడు వై,ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని అభినందిద్దాం. ఈ చర్యను విజయవంతం చేస్తే బహుజనులంతా ఆయనకు రుణపడి ఉంటారు.
డా. కాలువమల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత, మొబైల్ : 91829 18567
Comments
Please login to add a commentAdd a comment