అభిప్రాయం
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.
ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు.
అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.
కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.
వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.
చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!
ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?
దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.
- డాక్టర్ కాలువ మల్లయ్య
ప్రముఖ కథా రచయిత
Comments
Please login to add a commentAdd a comment