చరిత్ర కుహరాల నుంచి... | Challapalli Swarooparani's Comments In Tamil Thangalan Movie | Sakshi
Sakshi News home page

చరిత్ర కుహరాల నుంచి...

Published Sun, Aug 25 2024 9:00 AM | Last Updated on Sun, Aug 25 2024 9:00 AM

Challapalli Swarooparani's Comments In Tamil Thangalan Movie

‘తంగలాన్‌’ చిత్రీకరణ సమయంలో నటుడు విక్రమ్ – దర్శకుడు పా. రంజిత్‌

అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.

అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్‌. అవును పా. రంజిత్‌ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్‌ స్క్రీన్‌ మీద పరుస్తున్నాడు. తంగలాన్‌ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్‌ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్‌ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.

ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్‌లో పా. రంజిత్‌ కళ్ళకు కట్టించాడు.

బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్‌ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి  కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్‌ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్‌ ఒక లిబరేటెడ్‌ లాండ్‌ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్‌ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్‌ నుంచే ప్రారంభించడం విశేషం.

కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్‌. తంగలాన్‌ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్‌.

అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్‌ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్‌తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్‌’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్‌ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.

తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్‌ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్‌ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్‌ పా. రంజిత్, తంగలాన్‌ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్‌... అందరికీ జై భీమ్‌!

'తమిళనాడు నుంచి కోలార్‌ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి  కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్‌ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్‌ ఒక లిబరేటెడ్‌ లాండ్‌ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్‌ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్‌ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్‌'.


– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement