విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో కాస్త జాప్యం ఎదురైంది. సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిని ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. అయితే, తంగలాన్ ఓటీటీ అంశంపై మద్రాస్ ప్రధాన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలు తేదీలలో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్‌లో తెలిపారు.
తంగలాన్ ఓటీటీ వివాదం పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్‌మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. 'తంగళన్ సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. తంగలాన్ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 110 కోట్లు రాబట్టింది. కోర్టు తీర్పుతో దీపావళి కానుకగ తంగలాన్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment