
‘హ్యాపీ మదర్స్ డే అమ్మా!’ అంటూ.. మే 11న కొంత సమయం అయినా సరే అమ్మతో సంతోషంగా గడుపుతారు. ఆమ్మ ప్రేమ గురించి వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి కూడా.. అయితే, ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి '35–చిన్న కథ కాదు' సినిమాను చూసేయండి. ఉచితంగానే ఈ చిత్రాన్ని చూడొచ్చని ఆహా తెలుగు ప్రకటించింది. మే 10, 11 తేదీలలో మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాదిలో తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. మదర్స్‌డే (మే 11) కానుకగా ఉచితంగా చూసేందుకు ఆహా సంస్థ అవకాశం కల్పించింది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

కథేంటంటే..
తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.
కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.