టైటిల్: 35- చిన్న కథ కాదు
నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులు
నిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
దర్శకత్వం: నందకిషోర్ ఇమాని
సంగీతం: వివేక్ సాగర్
విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024
టాలీవుడ్‌లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.
కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది.
సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.
అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.
టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి.
స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం.
తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు.
అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment