
టైటిల్: మజాకా
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్
నిర్మాత: రాజేశ్ దండ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
విడుదల తేది: ఫిబ్రవరి 26, 2025
యంగ్ హీరో సందీప్ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్ హిట్ ట్రాక్ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.
మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్ కాంబినేషన్ దీన్నే నమ్ముకుంది. రొటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్ సన్నివేశం..ఇలా సెట్ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.
వాస్తవానికి ఈ కథ లైన్ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్ ఉన్న పాయింట్ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.

తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్ రిపీట్.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
తండ్రికొడుకులుగా రావు రమేశ్, సందీప్ కిషన్ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్ ఇరగదీశాడు. యంగ్ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్ ఆది కామెడీ జస్ట్ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Rating : 2.75/5
Comments
Please login to add a commentAdd a comment