Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్‌) మూవీ రివ్యూ | Chhaava Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Chhaava Review: తెలుగులో ‘ఛావా’.. సినిమా ఎలా ఉందంటే?

Mar 7 2025 3:20 PM | Updated on Mar 8 2025 10:51 AM

Chhaava Movie Review And Rating In Telugu

టైటిల్‌: ఛావా
నటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్ తదితరులు
నిర్మాత: దినేష్ విజన్
దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి (ISc)
ఎడిటర్: మనీష్ ప్రధాన్
తెలుగు రిలీజ్: గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్
విడుదల తేది: మార్చి 7, 2025(తెలుగులో)

ఛావా.. ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో రిలీజై.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్‌ చేస్తే బాగుండేదని చాలా మంది అనుకున్నారు. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేసింది. నేడు(మార్చి 7) తెలుగు భాషలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఛావా కథేంటంటే..
ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్‌ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్‌ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు  శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌). మొగల్‌ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్‌ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
‘ఛావా’ అనేది మారాఠా రాజు శంభాజీకి సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్‌ చేస్తూ  దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావాని తెరకెక్కించాడు. శంభాజీ గురించి పూర్తిగా చెప్పకుండా.. స్వాతంత్రం కోసం, మారాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. శంభాజీ చరిత్ర తెలిసివాళ్లు కూడా తెరపై ‘ఛావా’ చూస్తే ఎంటర్‌టైన్‌తో పాటు ఎమోషనల్‌ అవుతారు.

రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? అనేది బాహుబలితో పాటు పలు చారిత్రాత్మక సినిమాల్లో చూశాం. ‘ఛావా’ కథ కూడా అదే. అందుకే ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా భారీ ఎలివేషన్స్‌, ఎమోషన్స్‌, యాక్షన్‌ సీన్లతో కథనాన్ని నడిపించాడు. శంభాజీ చరిత్ర తెలియని వాళ్లకు కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను తీర్చిదిద్దాడు. 

ఓ భారీ యుద్దపు సన్నివేశంతో హీరో ఎంట్రీని ప్లాన్‌ చేసి.. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచేలా చేశాడు.  ఫస్టాఫ్‌ మొత్తం రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు ఇలానే సాగుతుంది. కథ ఊహకందేలా సాగడం.. శంభాజీని అంతం చేసేందుకు ఔరంగాజేబు చేసే కుట్రలు రొటీన్‌గా ఉండడంతో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లను మరింత ఎమోషనల్‌గా చూపించే ఆస్కారం ఉన్నా..దర్శకుడు ఆ సీన్లను సింపుల్‌గా కట్‌ చేశాడు. 

 ఇక సెకండాఫ్‌ మాత్రం చాలా పకడ్భంధీగా ప్లాన్‌ చేసుకున్నాడు డైరెక్టర్‌. ఔరంగాజేబు సైన్యాన్ని ఎదుర్కొనుందుకు శంభాజీ చేసే ప్రయత్నం..ఈ క్రమంలో వచ్చే యుద్దపు సన్నివేశాలు అదిరిపోతాయి.  

సంగమేశ్వరలో ఉన్న శంభాజీపై మొగల్‌ సైన్యం దాడి చేసే సీన్లు.. వారిని ఎదుర్కొనేందుకు శంభాజీ చేసే పోరాట ఘట్టాలు ప్రేక్షకుడికి గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ‘జై భవానీ’, ‘హర హర మహదేవ్‌’ అంటూ ఢిల్లీ సైన్యంపై మారాఠ సైన్యం విరుచుకుపడుతుంటే.. థియేటర్స్‌లో విజిల్స్‌ పడతాయి. ఇక శంభాజీ బంధీగా మారడం.. మొగల్‌ సైన్యం అతన్ని చిత్రహింసలు పెడుతుంటే.. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి.  బరువెక్కిన గుండెతో థియేటర్‌ బయటకు వచ్చేస్తాం. 

ఎవరెలా చేశారంటే.. 
శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించలేదు.. జీవించేశాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించలేదు.. జీవించేశాడు. వార్‌, యాక్షన్‌ సీన్స్‌లో  అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో నట విశ్వరూపం చూపించాడు. ఔరంగజేబుగా అక్షయ్‌ ఖన్నా అద్భుతంగా నటించాడు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశాడు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. సౌరభ్‌ గోస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement