
టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా! టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే అవి జీవితాలనే తలకిందులు చేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. తాజాగా అలాంటి జానర్‌లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రిజేష్ టాంగి దర్శకత్వం వహించగా అకిల తంగి నిర్మించారు. మార్చి 7న ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైంది. మరి ‘వైరల్ ప్రపంచం’ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
కథ
అమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ).. రవి (సాయి రోనక్)తో ప్రేమలో ఉంటుంది. తన 4 సంవత్సరాల సంబంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్యశెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తాను కలిసే ప్రవీణ్ (సన్నీ నవీన్)తో ఎమోషనల్ బాండింగ్‌ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను తర్వాత ఇంటర్నెట్‌ను మాత్రమే నమ్ముతారు. మరి వారి నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఎవరు? ప్రాణాలను బలిగొన్న ఘటన ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా చూస్తాం. నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుంచి దూకడంతో కథ ఆసక్తిగా మారుతుంది. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్‌లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జరుగుతుంది. వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయన్నది చూపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది కథలో చక్కగా చూపించారు. ఇంటర్నెట్‌లో మహిళల గోప్యతను మంటగలుపుతున్న సైబర్ నేరాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఎవరెలా చేశారంటే?
రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్.. ఈ తరం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతారు. సహజంగా నటించారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర యాక్ట్ చేశారు.
సాంకేతిక విభాగం
మ్యూజిక్ ఎంతో ఎమోషనల్ ఫీల్ కలిగిస్తుంది. కానీ కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోదు. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది. కెమెరా పనితనం పర్వాలేదు.
విశ్లేషణ
‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాలనుకున్న సబ్జెక్టును తెరకెక్కించడంలో దర్శకుడు బ్రిజేష్ టాంగి దాదాపు సఫలమైనట్లే! కానీ కొన్నిసీన్లు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల యువతీయువకుల జీవితాలు ఎలా మారిపోయాయనేది నేటి యువతకు అర్థమయ్యేలా చూపించారు. ఆన్‌లైన్ మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. యువతకు విలువైన సందేశం ఇస్తుంది.
చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన
Comments
Please login to add a commentAdd a comment