టైటిల్: పరేషాన్
నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్ తదితరులు
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్
సంగీతం: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్
ఎడిటర్ : హరిశంకర్
విడుదల తేది : జూన్ 2, 2023
‘పరేషాన్’ కథేంటంటే..
క్రైస్తవ మతానికి చెందిన సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) తిరుగుబోతు. ఐటీఐ కూడా పాసవ్వక ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు. దాని కోసం పై అధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతిపై ఉన్న బంగారు గాజులు అమ్మి రెండు లక్షలను జమ చేస్తాడు.
ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్‌ని పంపిస్తే.. అందులో కొత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా(బన్నీ అభిరామ్)కు ఇస్తాడు. మిగిలిన డబ్బు మరో స్నేహితుడు ఆగమ్ సత్తి(అర్జున్ కృష్ణ)కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్ ప్రేయసి శిరీష(పావని కరణం)తో శారీరకంగా దగ్గర అవుతాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలకుంటాడు.
డబ్బులు జమ చేస్కోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే.. డబ్బులు కొట్టేస్తారు. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లంచం కోసం ఇచ్చిన డబ్బుని కొడుకు తన స్నేహితులకు ఇచ్చాడని తెలిశాక సమర్పణ్ రియాక్షన్ ఏంటి? స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్.. వీటిని ఐజాక్ ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ యాస, కల్చర్‌ని ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పరేషాన్ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథ ఇది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్. సినిమా టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది తెలంగాణ యాస, భాషని బేస్ చేసుకొని చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. అయితే కథలో మాత్రం కొత్తదనం లేదు.
పనీపాట లేకుండా ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, ఓ లవ్‌స్టోరి, చివర్లో హ్యాపీ ఎండింగ్.. ఈ తరహా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పరేషాన్ కూడా అలాంటి కథే.కానీ తెలంగాణ నేటివిటీని జోడించి చాలా వినోదాత్మకంగా చూపించారు.
క్రైస్తవ మత ప్రార్థనలతో వినోదాత్మకంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఐజాక్ స్నేహితుల నేపథ్యం, పాషా చేసే ఓ పనికి పోలీసు స్టేషన్‌దాకా అందరు వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక స్నేహితులకు డబ్బులు ఇచ్చాక ఐజాక్ పడే పరేషాన్.. శిరీషతో ప్రేమాయణంతో ఫస్టాఫ్ కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు.
ఇక సెకండాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. సత్తి కోసం వెతికే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తాగుడుకు సంబంధించిన సీన్స్ ప్రతిసారి చూపించడం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సత్తి వేలు తెగిన సీన్, ఐజాక్ బ్యాండ్ డ్రెస్ సీన్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్యూర్ తెలంగాణ నెటివిటీ, యాస కారణంగా తెలంగాణేతర ప్రేక్షకులను ఈ సినిమా అంతగా అలరించకపోవచ్చు. కానీ ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్స్‌కు వస్తే మాత్రం ‘పరేషాన్’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
తిరువీర్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటాడు. పరేషాన్‌లో కూడా అంతే. ఐజాక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్ సత్తిగా అర్జున్ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్‌గా, పాషాగా బన్ని అభిరామ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. యశ్వంత్ నాగ్ సంగీతం బాగుంది. సౌ సారా, ముసి ముసి నవ్వుల మంజుల పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణ పల్లె అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment