Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ | Ramam Raghavam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ

Published Thu, Feb 20 2025 6:26 PM | Last Updated on Fri, Feb 21 2025 2:40 PM

Ramam Raghavam Movie Review And Rating In Telugu

టైటిల్‌: రామం రాఘవం
నటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్‌, సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు
నిర్మాత: పృథ్వీ పోలవరపు
కథ: శివప్రసాద్‌ యానాల
దర్శకత్వం: ధన్‌రాజ్‌
సంగీతం: అరుణ్‌ చిల్లివేరు
సినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్‌
ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేశ్‌
విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025

కమెడియన్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్‌. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్‌) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ని చేయాలని కలలు  కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్‌ దేవ(హరీస్‌ ఉత్తమన్‌)తో హత్యకు డీల్‌ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి?  హత్య కోసం దేవతో సెట్‌ చేసుకున్న డీల్‌ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్‌లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్‌ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్‌. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్‌ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ బాగా వర్కౌట్‌ అయింది. 

 అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్‌ సంభాషణలు.. ఫస్టాఫ్‌ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్‌ లవ్‌ట్రాక్‌ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.

తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్‌ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్‌ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్‌ సీన్‌ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్‌ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్‌ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. 

ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్‌ ఉత్తమ్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్‌ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్‌ ఓకే.దుర్గా ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement