
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం రామం రాఘవం ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది మమకారం. వారి మాట వినకూడదని పిల్లల మూర్ఖత్వం. జన్మనిచ్చిన తల్లి... జీవితాన్నిచ్చే తండ్రి తమ కన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కాస్తంత కటువుగా మారతారు. ఆ కటుత్వం మాటున ఆప్యాయత, అనురాగాలుంటాయి. అవి అర్థం చేసుకోని పిల్లలు ఎంతో నష్టపోతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘రామం రాఘవం’. తల్లి ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి.
తండ్రి ప్రేమను ఇంత లోతుగా చూపించిన సినిమా ఇదే. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు సముద్రఖని అందించిన ఈ కథకు నటుడు ధన్‌రాజ్ దర్శకత్వం వహించారు. ‘రామం రాఘవం’ అనేది పిల్లలకు పెద్దలు చెప్పిన పాఠం అయితే, పిల్లలకు ఇదో గుణపాఠం. అంతలా ఏముందీ సినిమాలో ఓ సారి చూద్దాం. దశరథ రామం కోనసీమ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఓ నిజాయితీ గల అధికారి. తనలాగే తన కొడుకు రాఘవను నీతీ నిజాయితీతో నిండిన మంచి వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకుంటాడు. కానీ రాఘవ చదువు కూడా కనీసం సరిగ్గా చదువుకోకుండా ఇంటా బయటా తండ్రికి తలవంపులు తెస్తుంటాడు.
అంతేకాదు తనను మందలించిన తండ్రి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఆఖరికి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. రాఘవ చేసిన ప్రతి తప్పును క్షమించి కాస్తంత మందలిస్తూ అంతులేని బాధను అనుభవిస్తుంటాడు రామం. ఆఖరికి రాఘవ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నమేంటి? దాని వల్ల రాఘవ పొందిన లాభం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీ వేదికైన సన్ నెక్ట్స్‌లో చూడాల్సిందే. నటుడిగా ధన్‌రాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.
మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. నటుడిగా ధన్‌రాజ్ నాణేనికి ఓ వైపు మాత్రమే, ఈ సినిమాతో ధన్‌రాజ్ తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటారనే చెప్పుకోవాలి. ఓ పక్క కథను అందించి, కథలోని తండ్రి పాత్రకు ఊపిరి పోసింది సముద్రఖని అయితే మరో పక్క అదే కథకు దర్శకత్వం వహించి, కొడుకు పాత్రలో ఒదిగిపోయి ఆ కథకు జీవితాన్నిచ్చింది ధన్‌రాజ్.
కొన్ని సినిమాలు ఆనందం కోసం చూస్తాం. ఇలాంటి సినిమాలు మాత్రం మన జీవితం కోసం చూడాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చూడాలి. వీలైతే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ ‘రామం రాఘవం’ చూడండి. – హరికృష్ణ ఇంటూరు
Comments
Please login to add a commentAdd a comment