ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం ‘సత్యం సుందరం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మనల్ని కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఆవేశాన్నిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆనందాన్నిస్తాయి. చాలా కొన్ని సినిమాలు మన మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అవి మన గడిచిన జీవితపు గతాల తెరలను తొలగిస్తాయి కాబట్టి. అటువంటి వాటి కోవలో ముందుండే సినిమా ‘మెయ్యళగన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా లభ్యమవుతోంది.
దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాని సినిమాలా తీయలేదు, మన గత జీవితాలను మళ్లీ మనకు పరిచయం చేశారంతే. ఒకరిద్దరు భారీ తారాగణం తప్ప పెద్ద కథ, పెద్ద సెట్లు, పెద్ద లొకేషన్లు ఇలాంటి ఆకర్షణలేవీ లేవు ఈ సినిమాలో. కానీ మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుందనడంలో సందేహమే లేదు. ప్రతి ఇంట్లో జరిగే ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకుని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు దర్శకుడు. కథాపరంగా సత్యం ఉంటున్న ఇల్లు దాయాదుల గొడవల్లో పోతుంది. ఆ బాధతోనే సత్యం కుటుంబం ఉన్న ఊరిని ఉన్న పళంగా విడిచి వెళ్లిపోతుంది. ఇక్కడ నుండే సినిమా ్రపారంభమవుతుంది.
పద్దెనిమిదేళ్ల తర్వాత సత్యం తన బాబాయి కూతురు పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరులోకి బాధతోనే అడుగుపెట్టవలసివస్తుంది. పెళ్లిలో సత్యాన్ని అతని చుట్టం సుందరం కలుస్తాడు. కానీ సుందరాన్ని సత్యం గుర్తు పట్టడు. సుందరం మాత్రం సత్యం మీద వల్లమాలిన అభిమానాన్ని, ప్రేమను చూపిస్తాడు. అసలే ఆ ఊరితో ఉన్న చికాకుతో పాటు సుందరం ఎవరో గుర్తు రాకపోయినా అతను చూపించే ప్రేమ సత్యాన్ని మరింత మధనపెడుతుంది.
మరి... ఆఖరికి సుందరం ఎవరో సత్యం గుర్తుపట్టాడా లేదా? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. సత్యం పాత్రలో అరవిందస్వామి, సుందరం పాత్రలో కార్తీ తమ పాత్రలలో జీవించేశారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇది సినిమా కాదు... మన గతం. నాటి తీపి గుర్తుల నేటి సినిమా ఈ ‘సత్యం సుందరం’. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment