
డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin).. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ మూవీతోనే ఆయన ప్రయాణం మొదలైంది. ఇందులో నాని, విజయ్ దేవరకొండ,మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో మెప్పించారు. డైరెక్టర్‌గా పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న నాగ్ అశ్విన్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఒక వీడియో విడుదల చేసింది. మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ఆయన కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
నాగ్ అశ్విన్ కుటుంబం
అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్‌లో టాప్ టెన్ ర్యాంక్‌లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే.. మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్‌ను సంపాదించుకున్నాడు.
సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?
సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్దకు నాగ్ అశ్విన్‌ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్‌లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

డైరెక్టర్‌గా ఛాన్స్ ఎవరిచ్చారు..?
శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment