![Laila Movie Review And Rating In Telugu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Laila-Movie-Review-Telugu.jpg.webp?itok=jygNsHP7)
టైటిల్: లైలా
నటీనటుటు: విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
సంగీతం: జేమ్స్ లియోన్
సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ప్రసాద్
విడుదల తేది: ఫిబ్రవరి 14
యంగ్ హీరో విశ్వక్ సేన్ జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే..ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యే మెకానిక్ రాకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌ని తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ‘లైలా’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లైలా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Laila Movie Review)
కథేంటంటే..
సోను మోడల్(విశ్వక్ సేన్)(Vishwak Sen) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. ఆ చుట్టు పక్కల మహిళలకు సోను మోడల్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమేకాదు..కష్టం వచ్చినప్పడు ఆదుకుంటాడు కూడా. అలా ఓ కస్టమర్‌కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. స్థానిక మహిళల భర్తలతో పాటు అక్కడి ఎస్సై శంకర్(పృథ్వీ)కి సోను అంటే నచ్చదు. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. ఓ సారి సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులతో పాటు రుస్తుం మనుషులు కూడా అతని కోసం గాలిస్తారు. దీంతో సోను గెటప్ మార్చి లైలా(Laila Movie Review)గా మారుతాడు. అసలు సోనుపై వచ్చిన ఆరోపణలు ఏంటి? చేయని నేరంలో సోనును ఇరికించిందెవ్వరు? రుస్తుం సోను కోసం ఎందుకు గాలిస్తున్నాడు? లైలాగా మారిన తర్వాత సోనుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు తనను తప్పుడు కేసులో ఇరికించిన వారిని లైలా ఎలా పట్టుకుంది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
‘కర్మలో కారం పొడి ఉంటే పళ్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది’ అన్నట్లుగా.. కథలోనే కొత్తదనం లేనప్పుడు ఎన్ని ‘గెటప్’లు వేసినా డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ ఎలా వస్తుంది? లైలా సినిమా పరిస్థితి అలానే ఉంది. హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లేడీ గెటప్ అనగానే..ఇదేదో డిఫరెంట్ చిత్రంలా ఉందే అనుకున్నారంతా. తీరా సినిమా చూశాక..‘గెటప్’లోనే కొత్తదనం.. అంతకు మించి ఏమి లేదు.
లుక్ పరంగా లైలా కొంతవరకు బాగానే ఉంది కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అందించకుండా రొట్ట రొటీన్ సీన్లతో చాలా ‘జాగ్రత్త’గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఆయన రాసుకున్న కామెడీ సీన్లను చూసి నిజంగానే ‘నవ్వుకుంటారు’. డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని ‘జబర్దస్త్’లాంటి షోలను గుర్తు చేసుకుంటారు. అడల్ట్ కామెడీ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందనుకున్నాడేమో.. ఫోకస్ అంతా దానిపైనే పెట్టాడు. కథలో సీరియస్ నెస్ లేదు..కామెడీలో కొత్తదనం లేదు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.
వాస్తవానికి ఈ సినిమాలో పేరుకే విశ్వక్ సేన్ హీరో. కానీ కీలక సన్నివేశాలన్నీ అభిమన్య సింగ్, సునిశిత్ పాత్రలతోనే ఉంటాయి. అభిమన్యు పాత్రకు విశ్వక్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. సునిశిత్ తెరపై కనిపించేది తక్కువే కానీ... కీలక సన్నివేశాల్లో ఆయనే కనిపిస్తాడు. ఇక హీరోయిన్‌ని అందాలను ప్రదర్శించడానికి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న ఒక్క సీన్ రాసుకోలేదు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగుతుంది. సోను మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టడానికి గల కారణాన్ని బలంగా చూపించలేకపోయారు.
హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ బిజినెస్, ఎస్సై శంకర్ ఎపిసోడ్ అనీ.. బోరింగ్‌గా సాగుతాయి. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కథ మళ్లీ రోటీన్‌గానే అనిపిస్తుంది. ఒకనొక దశలో లైలా పాత్రలో విశ్వక్‌ని చూడలేకపోతాం. ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ ఉంటుంది. పోని అది యూత్‌కైనా నచ్చేలా ఉంటుందా అంటే అదీ లేదు.మదర్ సెంటిమెంట్ రొటీన్‌గానే ఉన్నా .. కొంతవరకు ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
విశ్వక్ ఎప్పటిలాగే తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించి..తనదైన నటనతో వేరియేషన్ చూపించాడు. లైలా లుక్‌లో బాగున్నా.. నటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ జెన్నీ పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. అయితే ఆమెను నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా వాడేసుకున్నారు.
రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ చక్కగా నటించాడు. అతని కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ పాత్ర. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన సునిశిత్.. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ని చేశాడు.కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు.జేమ్స్ లియోన్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment