
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).
ఎలా ఉందంటే..
'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.
అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది.
ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్‌టైనింగ్ చెప్పాడు.
ఎవరెలా చేశారంటే..
రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment