
టైటిల్: గార్డ్
విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి నిర్మించగా, జగ పెద్ది దర్శకత్వం వహించారు. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన గార్డ్ మూవీ నేడు (ఫిబ్రవరి 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గార్డ్ ప్రజల్ని ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూసేద్దాం..
కథ
ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్‌మెంట్‌లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనను కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని గదిలోకి సామ్ వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని కథేంటి? సుశాంత్‌కు, ఆ ఆత్మకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
చనిపోయిన అమ్మాయి ఆత్మ తిరిగొచ్చి పగ తీర్చుకోవడం చాలా సినిమాల్లో చూశాం. అదే పాయింట్‌తో గ్రప్పింగ్ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథనంలో కొత్తదనం చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ఇదంతా రొటీన్‌లా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్‌లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది.
సెకండ్ హాఫ్‌లో ఆత్మ ఏం చేసింది? తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేశాడు? అన్నది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. కానీ సినిమా మరీ అంతగా భయపెట్టేదిగా ఉండదు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. కథ అంతా ఆస్ట్రేలియాలో జరగడం వల్ల అక్కడ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?
విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేశాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దెయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది. శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో భయపెట్టారు. కొన్ని సీన్లు చూసినప్పుడు దర్శకుడు కాస్త తడబడినట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment