ఆగస్టు 15న రిలీజైన డబ్బింగ్ సినిమా 'తంగలాన్'. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత మెల్లగా పికప్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలవడం కూడా దీనికి ప్లస్. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో కొందరు తెగ నచ్చేస్తే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అయితే 'తంగలాన్'ని మరో కోణంలో చూసిన కొందరు సోషల్ మీడియాలో తమదైన రివ్యూలు ఇచ్చారు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..
(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా)
'ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పేదే 'తంగలాన్' సినిమా. అలాగే మన సంస్కృతి, జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థం అయ్యేలా చాటి చెప్పిన దర్శకుడు పా.రంజిత్. మహిళలకు రవికలు పంచగానే అవి వేసుకుని ఊరంతా సంబరాలు జరుపుకొనేలా వచ్చే పాట 'మనకి మనకి'.. మన అమ్మలు, నాయనమ్మలు చిన్నతనంలో రోళ్లలో వడ్లు పోసి, దంచుతూ పాడుకునేలా సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తంగలాన్ బట్టలు వేసుకుంటే ఓర్వకుండా చింపిన మళ్ళీ సూది దారంతో కుట్టుకుని తిరిగి వేసుకోవడం ఇదే కదా ఆత్మ గౌరవంతో కూడిన చారిత్రక జీవన విధానం. -సతీశ్ పొనగంటి
'తంగలాన్' సినిమా ఆలోచన నాకు చాలా నచ్చింది. దక్షిణాది భారతీయుల చరిత్రని చూపించాడు. అప్పటి పరిస్థితులని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే కథలో వివరణ మొదలవగానే నాకెందుకో డిస్ కనెక్ట్ అయిపోయాను. తంగలాన్ చూస్తుంటే.. ఫిట్జ్ కరాల్డో సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతమున్న వాళ్లలో డేరింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్ పా.రంజిత్. 'తంగలాన్' అస్సలు మిస్సవ్వొద్దు. -వెంకట సిద్ధారెడ్డి
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
కటిక దరిద్రుల ఆకలి పోరాటం- తంగలాన్...
వాళ్లు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు.. భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు 'తంగలాన్'. కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.
సర్పట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్! వీటిని తీసిన పా.రంజిత్ అనే వాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. 'నేను అంబేద్కరిస్ట్‌ని' అని ప్రకటించుకున్న రంజిత్.. రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థముంది. అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదో తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఓ సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!
కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ, బంగారం ఒక తీరని దాహం, దురాశ. ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి! ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్‌తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌బస్టర్ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పా.రంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఓ చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు. -తాడి ప్రకాష్
(ఇదీ చదవండి: ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్)
Comments
Please login to add a commentAdd a comment