'అపరిచితుడు', 'ఐ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్.. సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అలానే 'తంగలాన్' అనే మూవీలో ఓ ఆటవిక తెగ మనిషిగా నటించాడు. టీజర్, ట్రైలర్‌తోనే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందివ్వబోతున్నామని ఫీల్ కలిగించారు. ఇప్పుడీ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
అది 1850. బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తుంటారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
'దురాశ దుఃఖానికి చేటు'.. ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్‌తో తీసిన సినిమా 'తంగలాన్'. కేజీఎఫ్ సినిమా మీరు చూసే ఉంటారు. కోలార్ జిల్లాలోని ఓ చోట టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది. అయితే అదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు. 'తంగలాన్' మాత్రం ఏకంగా వందల ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీశారు.
'తంగలాన్', అతడి కుటుంబం, చుట్టూ ఉన్న పరిస్థితులని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టడం వరకు బాగానే ఉంది. కొంతసేపటి తర్వాత తంగలాన్.. తన కూతురికి ఓ కథ చెప్పడం.. బంగారం కోసం తన తాత, నాగిని జాతి స్త్రీతో పోరాడటం లాంటివి చెబుతాడు. అయితే సినిమాలో వైవిధ్యముంది కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేకపోతాం. మొదటిది సుధీర్ఘంగా సాగే సన్నివేశాలైతే, రెండోది దర్శకుడు అసలేం చెప్పాలనుకున్నాడో ఎంతకీ అర్థం కాకపోవడం.
ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండ్. అంత మాత్రాన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి. ఈ విషయంలో 'తంగలాన్' ఆమాద దూరంలో ఆగిపోయింది. దాదాపు రెండున్నర గంటల నిడివి.. కానీ నాలుగు గంటల చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో 18వ శతాబ్దంలో మొదలైన స్టోరీ కాస్త 5 శతాబ్దం దగ్గరకు వెళ్లి ఆగుతుంది. హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కనిపిస్తుంటారు. ఇందుకు కారణాన్ని క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. కానీ అప్పటికే ఎగ్జైట్‌మెంట్ చచ్చిపోయింటుంది.
ఇందులో హీరోని పల్లెటూరిలో పనిచేసే వాడిగా తొలుత చూపిస్తారు. కొన్నిసీన్ల తర్వాత ఇతడికి బ్రిటీషర్ల మాట్లాడిన ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ లాజిక్ మిస్సయిపోయారు. అలానే వర్ణ, కుల వివక్ష గురించి సినిమాలో అక్కడక్కడ చూపించిన సీన్లు బాగున్నాయి.
ఎవరెలా చేశారు?
తంగలాన్‌గా విక్రమ్ తప్ప ఎవరూ ఊహించలేం! ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశాడు. మధ్యలో కొన్ని సీన్లలో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు. మేకప్ కూడా ఏం ఉండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్‌లో కొందరు హీరోలు.. జీవితంలో చేయలేరేమో! తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు.. ఉన్నంతలో ఓకే. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ వేరే లెవల్. స్క్రీన్‌పై ఆమె కనిపిస్తుంటే భయమేస్తుంది. మిగిలిన పాత్రధారులు కష్టాన్ని కూడా మర్చిపోలేం.
టెక్నికల్‌గా చూసుకుంటే 'తంగలాన్' బ్రిలియంట్ మూవీ. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగిలిన విభాగాలతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా కష్టపడింది. కాకపోతే ఈ తరహా మూవీస్ అందరికీ నచ్చవు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు 'తంగలాన్' మంచి ఆప్షన్. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది!
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment