
పాలకుల అకృత్యాలను ఎదిరించడంలో మొదటి నుంచీ గిరిజనులు ముందే ఉన్నారు. భారత దేశాన్ని మొదటగా ఏకం చేసిన మొఘల్ కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్‌వాళ్లపైనా ఆదివాసీలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అయితే వీళ్ల తిరుగుబాటుల గురించి అంతగా ప్రచారం జరగకపోవడం శోచనీయం. ముఖ్యంగా మన తెలంగాణలో రాంజీ గోండ్ చేసిన తిరుగుబాటు నిజాం నవాబుకు, ఆయన పాలనకు రక్షణగా నిలిచిన బ్రిటిష్ వాళ్లకూ పెద్ద గుణపాఠాన్ని నేర్పింది.
గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన గోండు రాజులను మరాఠాలు జయించిన తర్వాత... ఆ ప్రాంతం నిజాంకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు వశమయ్యింది. వారి నిరంకుశత్వం గోండులను తిరుగుబాటుకు పురిగొల్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్లరాంజీగోండ్ 1838–1880 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. తెలంగాణలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న రోహిల్లాల పోరాటం రాంజీ గోండ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులుండే ప్రాంతం.
1880 మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా తుదిపోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్‌కు అప్పజెప్పింది. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. వారిపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు దాడులు చేశాయి.

అడవంతా తుపాకుల మోతతో మారుమోగింది. సాంప్రదాయిక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేక పోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీ గోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రి’ చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు ‘వెయ్యి ఉరిల మర్రిచెట్టు’గా ప్రసిద్ధి!
– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక
(నేడు రాంజీ గోండ్ వర్ధంతి)