నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం.. | Man Earning Rs 82000 Per Month He Is Struggling to Pay Home Loan Netizens Offer Career Advice | Sakshi
Sakshi News home page

నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..

Published Wed, Mar 5 2025 1:46 PM | Last Updated on Wed, Mar 5 2025 3:07 PM

Man Earning Rs 82000 Per Month He Is Struggling to Pay Home Loan Netizens Offer Career Advice

నెలవారీ ఎంత సంపాదిస్తున్నా జీవన వ్యయాలు భారమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇటీవల ఓ వ్యక్తి రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. నెలకు రూ.82,000 సంపాదించే ఆ వ్యక్తి తీసుకున్న గృహ రుణం భారంగా మారిందని తెలిపారు. దాంతోపాటు పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల ఇంటి ఖర్చుల నిర్వహణలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన ఆదాయం పెరిగేలా ఏదైనా సలహాలు ఇవ్వాలని కోరారు. తాను చేసిన పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌ ప్రకారం.. ‘నా నెలవారీ సంపాదన రూ.82,000. జీతంలో గణనీయమైన భాగం అంటే రూ.36,000 నేను గతంలో తీసుకున్న రూ.46 లక్షల గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తున్నాను. సౌకర్యవంతమైన ఆదాయం ఉన్నప్పటికీ ఇతర ఇంటి ఖర్చులను భరించడానికి ఇబ్బంది అవుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తాను. వచ్చాక డిన్నర్‌ ప్రిపేర్‌ చేసేందుకు నా భార్యకు సాయం చేస్తాను. ఇది నా షెడ్యుల్‌. గృహ రుణానికి అధిక మొత్తం కేటాయించడంతో ఇంటి ఖర్చులు భారమవుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు నెలకు అదనంగా రూ.15,000 నుంచి రూ.20,000 సంపాదించాలని అనుకుంటున్నాను. కాన్వా, పవర్‌పాయింట్‌ డిజైనింగ్‌లో నైపుణ్యాలు ఉన్నాయి. పబ్లిక్ స్పీకింగ్, కస్టమర్ సర్వీస్‌లో ఆసక్తి ఉంది. తీరిక సమయాల్లో చరిత్ర, సాహిత్యంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి నా షెడ్యూల్‌కు సరిపడే పార్ట్‌టైమ్‌వర్క్‌కు సంబంధించి సలహాలు ఇవ్వండి’ అంటూ పోస్ట్‌ చేశాడు.

నెటిజన్ల స్పందన ఇలా..

కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్‌కు విభిన్నంగా స్పందించారు. తన నైపుణ్యాన్ని పెంచుకుని అధిక వేతనంతో కూడిన మరో ఉద్యోగానికి మారాలని కొందరు సూచించారు. మరికొందరు ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని లేదా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలని సిఫార్సు చేశారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, హిస్టరీపై ఉన్న ఆసక్తి దృష్ట్యా కొందరు గెస్ట్ లెక్చరర్‌గా పని చేయాలని చెప్పారు.

చాలా మంది మధ్యతరగతి వృత్తి నిపుణులు, కొంత మెరుగైన ఆదాయం ఉన్నవారు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఈ వ్యక్తి చేసిన పోస్ట్‌ హైలైట్‌ చేస్తుంది. పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, అధికమవుతున్న జీవన వ్యయం చాలా మందికి భారంగా మారుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక, నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ పోస్ట్‌ గుర్తు చేస్తుంది.

ఇదీ చదవండి: రాబడులపై పన్ను తగ్గింపు..?

జాబ్ మార్కెట్‌లో కొన్ని నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. కింద తెలిపిన స్కిల్స్‌ నేర్చుకుంటే మంచి వేతనంతో మెరుగైన ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్: ఇవి హెల్త్ కేర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఆటోమేషన్, డెసిషన్ మేకింగ్‌కు సహకరిస్తాయి.

క్లౌడ్ కంప్యూటింగ్: ఏడబ్ల్యుఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్‌ వంటి టెక్నాలజీలపై అవగాహన.

సైబర్ సెక్యూరిటీ: సున్నితమైన డేటాను రక్షించడం మొదటి ప్రాధాన్యత. ఇది సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, ఎథికల్ హ్యాకర్లకు ఎంతో ముఖ్యం.

డేటా అనాలిసిస్, డేటా సైన్స్: కంపెనీలు డేటా ఆధారిత ఇన్‌పుట్స్‌పై ఆధారపడతాయి. కాబట్టి పైథాన్, ఎస్‌క్యూఎల్‌, టాబ్లో వంటి డేటా విజువలైజేషన్ సాధనాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉంది.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌: జావాస్క్రిప్ట్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రియాక్ట్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లో ప్రావీణ్యం కీలకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement