
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కారణాలతో ప్రయాణికుల టికెట్ చిరిగిపోతూ ఉంటుంది. లేదా ఇంకొన్ని సందర్భాల్లో టికెట్ ఎక్కడో పడిపోతుంది. అలాంటప్పుడు వేరే టికెట్ తీసుకోవాలా? లేదా అప్పటికే ప్రయాణంలో ఉంటే రైలు నుంచి దింపేస్తారా? అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. అయితే రైల్వే నిబంధనల ప్రకారం అలాంటి సందర్భంలో టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో.. ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఎలా స్పందించాలో కింద తెలుసుకుందాం.
టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అసలు టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేసీ టీటీఈకి పట్టుబడితే పూర్తి టికెట్ ఛార్జీతో పాటు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనీసం రూ.250 లేదా టికెట్ మొత్తానికి రెట్టింపు ఉంటుంది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించలేకపోతే టీటీఈ తదుపరి స్టేషన్‌లో దింపి రైల్వే పోలీసులకు అప్పగించే అధికారం ఉంది. కొన్నిసార్లు ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత టికెట్ కొనాలనుకుంటారు. ఇది సాధ్యమే, కానీ ఖాళీ సీటు అందుబాటులో ఉండాలి. అందుకోసం సాధారణ ఛార్జీల కంటే అదనంగా రుసుము వసూలు చేస్తారు.
పోయిన లేదా చిరిగిన టిక్కెట్లు
ప్రయాణంలో మీ టికెట్ పోయినట్లయితే లేదా చిరిగిపోతే మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించరు. మీరు టీటీఈ నుంచి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. కానీ అప్పటికే మీరు పోయిన టికెట్‌కు డబ్బు చెల్లించినప్పటికీ కొత్తగా తీసుకునే టికెట్‌ను ఉచితంగా అందించరు. అందుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. వెరిఫికేషన్ కోసం మీ ఐడీని చూపించాల్సి ఉంటుంది. మొబైల్‌లో ఆన్‌లైన్ టికెట్ అందుబాటులో ఉంటే డూప్లికేట్ టికెట్ అవసరం లేదు. మొబైల్‌లో మీ ఈ-టికెట్‌ను టీటీఈకి చూపించవచ్చు. అది చెల్లుబాటు అవుతుంది.
ఇదీ చదవండి: పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
రైలు ఆలస్యమైతే రీఫండ్
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ప్రయాణించాలనుకున్న రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే టికెట్ ఛార్జీలు రీఫండ్ పొందవచ్చు. ఇందుకోసం టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాలి. రైలు ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి (దొంగతనం లేదా దాడి వంటివి) జరిగితే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేయవచ్చు లేదా టీటీఈ లేదా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.