
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ టికెట్ల (Train ticket) కోసం ప్రవేశపెట్టిన అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ (Cashback) రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. 2016లో హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం మొదటిసారి యూటీఎస్‌ను ప్రవేశపెట్టారు.
ఆ తరువాత 2018 జూలై నుంచి అన్ని రైళ్లలో సాధారణ టికెట్ కొనుగోళ్లకు దీన్ని విస్తరించారు. ప్లాట్‌ఫామ్ టికెట్‌లు, సీజన్ టికెట్లు కూడా యూటీఎస్ ఆర్–వాలెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఆర్–వాలెట్‌తోపాటు, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.
ఆర్–వాలెట్‌లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది. యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ కొనుగోళ్లను ప్రోత్సహించడానికే ఈ క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సగటున ప్రతిరోజు సుమారు 83,510 మంది యూటీఎస్‌ను వినియోగించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య రోజుకు 93,487కు పెరిగింది.
ఏడాది కాలంలో 12 శాతం పెరిగినట్లు సీపీఆర్వో తెలిపారు. టికెట్ కౌంటర్‌ల వద్ద పడిగాపులు కాయవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు యాప్ ద్వారా కొనుగోలు చేసుకొని బయలుదేరవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడమే కాకుండా క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందే ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment