
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
గృహ రుణంపై ఊరట ఎంతంటే..?
ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం
రెపో రేటు అంటే..
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.