
'ఆరోగ్యమే మహాభాగ్యం'.. ఈ మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ కొంత పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మిద్దెలు, మెడలు అనుకున్నాం. నిజానికి మనిషి ఆరోగ్యంగా లేకపోతే.. ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కాలం మారిపోయింది.. ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం.
చరిత్ర చదువుకేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు.. ఆరోగ్యం అంటే కరోనా ముందు, కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా తలకిందులు చేసింది. చేతిలో డబ్బులు లేక.. ఆసుపత్రులలో ఖర్చులు పెట్టుకోలేక పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. ఆ తరువాత చాలామంది కళ్ళు తెరిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం బహుశా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ.. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం..
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే కాకుండా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవానుకుంటున్నావు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న అనేక మధ్యతరగతి కుటుంబాలకు..హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 5 లక్షలు సరిపోదని స్పష్టమైపోయింది. చాలా మంది ఆర్థిక సలహాదారులు, ఆరోగ్య బీమా నిపుణులు సైతే కనీసం రూ. 10 లక్షల కవరేజ్ సిఫార్సు చేస్తున్నారు.
నాణ్యమైన ఆరోగ్య సేవల కోసం
తగినంత పెద్ద కవరేజ్ ఉండటం వల్ల.. మీరు మీకు నచ్చిన ఆసుపత్రులు చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందటానికి ఉత్తమమైన మార్గం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ. వయసులో ఉన్నప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే అయినప్పటికీ.. వయసు మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.
35 ఏళ్ల వ్యక్తి కనీసం రూ. 10 లక్షల కవర్‌తో ఇన్సూరెన్స్ ప్రారంభించడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరం అయినప్పుడు లేదా తరచూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళకు ఇంకా పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పాలసీ ఎంచుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. మరింత తగ్గిన రేటు
మెట్రో నగరాల్లో నివసించేవారికి
చిన్న పట్టణాలలో నివసిస్తున్న వారితో పోలిస్తే.. మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారికి పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. ముంబై వంటి మహానగరాల్లో, ఇండోర్ వంటి టైర్-II నగర్లో నివసిస్తున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే.. కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ నగరంలోని ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
కుటుంబంలో ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం రూ. 20 లక్షల కవర్‌తో ప్రారంభించడం ఉత్తమం. ఆర్థిక స్థోమత అడ్డంకి కాకుండా ఉండాలంటే.. ఆరోగ్య సమస్యలను నుంచి బయట పడాలంటే.. బీమా తీసుకోవాల్సిందే.