World Health Day
-
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
మనసులో అలజడి
మనసు దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కానీ అదే మనసు కల్లోలమైతే జీవితమే అంధకారమవుతుంది. కోవిడ్ రక్కసి మానసిక అలజడులకూ కారణమైంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది మనో వ్యాకులతకు గురయ్యారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జాగృతి కార్యక్రమాలు జరిగాయి. బనశంకరి: కోవిడ్ మహమ్మారి వేటుకు సమాజంలో ఎక్కువమంది బడుగులు, మధ్య తరగతి వారే కాదు సంపన్నులు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయారు. వైరస్ భయం, లాక్డౌన్, ఉద్యోగాలను, ఆప్తులను కోల్పోవడం వంటి ఎన్నో వ్యతిరేకాంశాలతో క్లేశం అనుభవించారు. కర్ణాటకలో కోవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఏడాదిలో 10 లక్షలు ఉంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ఇంకా ఎక్కువమందే మానసిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లి ఉంటారని ఎన్జీవోల అంచనా. కోవిడ్ సమస్యలతో కుంగుబాటు మానసిక సమస్యలకు కారణాలు అనేకం. కోవిడ్ వల్ల, ఆపై తలెత్తిన ఒంటరితనం ప్రధాన కారణం. ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడం, ప్రేమ వైఫల్యం, జీవితంపై అభద్రత తదితర కారణాలతో ప్రజలు తీవ్రంగా కలత చెందారు. బాధితుల్లో చిన్నపాటి మానసిక సమస్యలు 34 శాతం ఉండగా, మతి చలించడం వంటి తీవ్ర సమస్యకు లోనైనవారు 18.4 శాతం ఉన్నారు. మద్య వ్యసనం, ఓ మోస్తరు మానసిక సమస్యల కేసులు 11.2 శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కౌన్సెలింగ్ సెంటర్లకు వరదలా కాల్స్ కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సెలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో కాల్స్ వచ్చాయి. 27 లక్షల మందికి పైగా ప్రజలు ఫోన్ చేసి ధైర్యంగా ఉండడానికి సాయం కోరారు. 2020–21 లో 9 లక్షల మంది సంప్రదించగా, ఈ ఏడాది 10 నెలల్లోనే 8.65 లక్షల మంది ఫోన్ చేశారు. దీనిని బట్టి కోవిడ్ తరువాత మానసిక సంఘర్షణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. కోవిడ్ వేళ టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన మృతుల దృశ్యాలు మహిళలను ఎక్కువగా భయాందోళనకు గురిచేశాయి. బలవన్మరణాల బెడద బలవన్మరణాల బెడద 2021లో దేశవ్యాప్తంగా 1.64 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 18 ఏళ్లలోపు వారు 13,089 మంది ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు 37 వేలమంది ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలో 2021లో 13 వేలమంది ఆత్మహత్య చేసుకోగా, ఈ సమస్య ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు 3వ స్థానంలో ఉంది. నగరంలో 2,292 మంది ఆత్మహత్యకు ఒడిగట్టారు. మానసిక ఆరోగ్యంపై జాగృతి మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో జాగృతం చేయాలి. మానసిక రోగుల పట్ల చిన్నచూపు తగదు అని నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి అన్నారు. మంచి అలవాట్లు ముఖ్యం నిమ్హాన్స్ మానసిక విజ్ఞాన విభాగ అధ్యాపకుడు డాక్టర్ మనోజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ సోయల్ మీడియాను అతిగా వినియోగించిన వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీనికి బదులు బయట వాకింగ్, వ్యాయామం చేయడం, అందరితో కలవడం, ఖాళీగా లేకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. (చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నామనుకుంటే సరిపోదు!
World Health Day 2022: భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం భూమికి ఆరోగ్యకరమైన పనులు చేస్తే అది స్వస్థతతో ఉంటుంది. ఇరువురూ పరస్పరం సహకరించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని 2022 సంవత్సరానికిగాను ‘వరల్డ్ హెల్త్ డే’ తన థీమ్‌ను ‘మన భూమి మన ఆరోగ్యం’గా ఎంచుకుంది. సకల జీవరాశికి భూమి నివాస స్థలం అయితే కుటుంబానికి ఇల్లు నివాస స్థలం. ఏ కుటుంబానికి ఆ కుటుంబం తన ఇంటిని, కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచుకుంటే భూమి ఆరోగ్యంగా ఉన్నట్టే. లాక్డౌన్ ఒక రకంగా ఒక మెలకువ కలిగించింది. కుటుంబాలను ఆరోగ్యం గురించి గట్టిగా ఆలోచించేలా చేసింది. మహమ్మారులు వ్యాపించినప్పుడే కాదు... గట్టి ప్రతికూలతలు వచ్చినా ఎలా ఒకరికొకరు మద్దతుగా నిలవాలో చెప్పింది. మరొక మేలు అది ఏం చేసిందంటే లాక్డౌన్ కాలంలో పరిశుభ్రమైన ఆకాశాన్ని చూపించింది. వాహనాల రొద లేని పరిసరాలు ఇచ్చి దూరాన ఒక పక్షి కూసినా వినిపించేలా చేసింది. ఫ్యాక్టరీలు మూత పడి వ్యర్థాలు విడుదల కాకపోవడం వల్ల యమున వంటి కాలుష్య కాసార నది కూడా తేటబడింది. చెలమలు, కుంటలు, చెరువులు శుభ్రమయ్యాయి. ప్లాస్టిక్ వేస్ట్ దాదాపుగా లేదు. వాహన వ్యర్థాలు లేవు. అంటే మనిషి తన చర్యలను నిరోధించుకుంటే భూమికి ఎంత మేలో లాక్డౌన్ చెప్పింది. భూమి ఊపిరి పీల్చుకున్న సందర్భం అది. అంటే భూమికి చెడు చేయకూడదు. భూమికి చెడు జరిగితే ఆ చెడు మన ఇంటి దాకా వస్తుంది. కుటుంబంలోని వ్యక్తులను తాకుతుంది. భూమికి చెడు జరిగితే మనకెలా చెడు జరుగుతుంది? నేలను కలుషితం చేయకూడదు. దారుణమైన రసాయనాలతో పంటలు పండించకూడదు. కాలక్రమేణ ఆహార ఉత్పత్తికి దెబ్బ పడుతుంది. పంటలో కోత వస్తుంది. లేదా కలుషిత ఆహారం పండుతుంది. అది పిప్పి ఆహారంగా మారి మాల్ న్యూట్రిషన్‌కు దారి తీస్తుంది. పిల్లలు, పెద్దలు ఈసురో అని అనకతప్పదు. కనుక నేల కలుషితం కాకుండా చైతన్యాన్ని ఇంటి నుంచే కలిగి ఉండాలి. సమాజానికి అందివ్వాలి. భూమికి చేటు చేయడం అంటే పరిసరాలను చెత్తతో నింపడమే. ఇలా వ్యర్థాలతో భూమిని నింపడం వల్ల కుటుంబానికి ఎదురవుతున్న అతి పెద్ద ప్రమాదం మలేరియా. భూమిని మనిషి దోమల అభివృద్ధి కేంద్రంగా మురికిగా మారుస్తుంది. ఈ మురికి నీటిలోనూ తినే ఆహారంలోనూ చేరితే డయారియా వస్తుంది. ఇవాళ ప్రపంచాన్ని అంటే కుటుంబాలను బాధిస్తున్న మరో అతి పెద్ద సమస్య డయేరియా. కనుక ఇంటిలోని చెత్తను నేలకు చెడు చేయని విధంగా అనారోగ్యాలకు సాయం చేయని విధంగా పారేయాలి. మన రోజువారి రాకపోకలే గాలి కాలుష్యానికి అత్యంత ప్రధాన కారణం అని తేలింది. కారు, స్కూటరు ఇంటి సౌకర్యం కోసం వాడితే అవి వ్యర్థాలు వెదజల్లి తిరిగి మన ఇంటి సభ్యులకే అనారోగ్యాలు తెస్తాయి. ఆస్తమా, అలెర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు ఇవి వాయు కాలుష్యం వల్లే. దీని నుంచి ఇంటిని కాపాడి తద్వారా భూమిని కాపాడాలంటే ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు వాడాలి. సైకిల్, నడక, కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్... ఇలాంటి వాటితో గాలి కాలుష్యం తగ్గించాలి. ఇంట్లో మొక్కలు నాటాలి. చెట్లు వేయాలి. వీధిలో కొన్ని చెట్లనైనా పెంచే బాధ్యత తీసుకోవాలి. ఆ పచ్చదనం భూమినే కాదు ఇంటినీ కాపాడుతుంది. నీటిని కాపాడాలి. నీటిని వృధా చేయకుండా కాపాడాలి. నీటి కేంద్రాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. సముద్రాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తే ఆ నీరు అనారోగ్యాన్ని ఇస్తుంది. కలుషిత నీటి వల్లే ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అడవిని పెంచితే వాన... వాన కురిస్తే అడవి... ఈ రెండూ ఎంత సమస్థాయిలో ఉంటే అంత భూమికి తద్వారా కుటుంబానికి మంచిది. వ్యక్తిగతంగానే కాదు ప్రభుత్వాలను చైతన్యపరచడం ద్వారా కూడా జలచక్రాన్ని కాపాడుకోవాలి. గ్లాసు నీళ్లు ముంచుకుని సగం తాగి సగం పారేసే పిల్లలను బాల్యం నుంచి హెచ్చరించకపోతే వారు పెద్దయ్యే వేళకు ఆరోగ్యకరమైన నీటిని తాగలేని పరిస్థితిలో నీళ్లు అడుగంటుతాయి. భూమిని కండిషన్లో పెట్టకపోతే కుండపోతలు వరదల్ని, వ్యాధుల్ని తెస్తాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగి వడదెబ్బ సంగతి సరే, అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతాయి. ఘోరమైన చలిగాలులు చరుకుదనాన్ని హరిస్తాయి. భూమికి ఏది జరిగినా కుటుంబం నివసించేది ఆ భూమిపైని ఇంటిలోనే కనుక ఇంటిని బాధించక తప్పదు. కనుక మనం డ్రైఫ్రూట్స్ తిని, విటమిన్ టాబ్లెట్స్ వేసుకుని, నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నాం అని అనుకోకూడదు. భూమి ఎంత హెల్దీగా ఉంది చెక్ చేయాలి. అలెర్ట్ చేయాలి. మనతోపాటు భూమి, భూమితో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్తు అని హెచ్చరిస్తూ ఉంది ఈ సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చదవండి: అమ్మ స్వీపర్.. కొడుకు ఎంఎల్ఏ.. -
ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామా? మరి మన ప్లానెట్ పరిస్థితి ఏంటి?
ఏప్రిల్ 7..వరల్డ్ హెల్త్ డే ...‘‘అవర్ ప్లానెట్.. అవర్ హెల్త్’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే అనే విషయాన్ని గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. రోజు రోజుకి ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కాలుష్య భూతాన్ని అడ్డు కోవడం, పారిశుధ్య లేమి, క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ మన ఆరోగ్య రక్షణలో భాగమే. మెరుగైన ఆరోగ్య ప్రపంచం నిర్మాణ ధ్యేయంతో ప్రతీ ఏడాది స్పెషల్ థీమ్‌తో వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం. ఈ భూప్రపంచం, భూమ్మీద ఉన్న మనుషుల ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO తొలి సమావేశంలో నిర్ణయించారు. అలా 1950 నుండి ఏప్రిల్ 7న తొలి వరల్డ్ హెల్త్ డేని నిర్వహించారు. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచ నిర్మాణం అనే నినాదంతో మానవులను, భూమాతను ఆరోగ్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరించడం అన్నమాట. ఇక 2022 సంవత్సరానికి సంబంధించి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనే థీమ్‌తో వరల్డ్ హెల్త్ డేని పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజారోగ్య సమస్యలపై అవగాహనకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన నేపథ్యంలో 2021లో ‘మన ఆరోగ్యం మన బాధ్యత’ అనే స్లోగన్‌తో వరల్డ్ హెల్త్ డేని నిర్వహించుకున్నాం. అయితే కోవిడ్-19 కారణంగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, విటమిన్లు, పోషకాలపై శ్రద్ధ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాధులనుంచి తప్పించుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారంపై ప్రత్యేక దృష్టి మొదలైంది. కానీ దీనికి చాలా కాలం ముందునుంచే ఆహారం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వాటినెలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనాకి తోడు ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, న్యుమోనియా, ఆస్తమా, ముప్పు పెరిగింది.ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు నివారించ దగిన పర్యావరణ కారణాల వల్ల సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది. మానవాళి ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ఆరోగ్య ముప్పు వాతావరణ సంక్షోభం. ఇదే ఆరోగ్య సంక్షోభానికీ దారి తీస్తుందనేది అని మనం గమనించాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం, క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో, మనం నివసిస్తున్న భూగ్రహాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ కాలుష్య నివారణపై ప్రతీ పౌరుడు ఆలోచించడం చాలా అవసరం. ప్లాస్టిక్‌ని నిషేధం, సహజ అటవీ, నీటి వనరుల రక్షణ కీలకం. వాయు కాలుష్యం, కలుషిత నీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతోపాటు, పారిశుద్ధ్య లేమి, కొన్ని ప్రమాదకర రసాయనాలు, క్లైమేట్ చేంజ్ ప్రతికూల ప్రభావాలు అత్యంత ప్రమాదకర మైన ముప్పు అనేది గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణకోసం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మనమందరం పునరంకితం కావాలి. -
అదే ప్రశ్న నేను అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?
సోషల్ మీడియా వాడకం పెరిగాక ఈ మధ్య సినీతారలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పబ్లిక్‌గా చెత్త కామెంట్లు చేయడానికి సైతం కొందరు నెటిజన్లు వెనకడుగు వేయడం లేదు. కొందరు స్టార్స్ వీటిని చూసీ, చూడనట్లు వదిలేస్తుంటే..మరికొందరు మాత్రం తగిన సమాధానం చెప్పి వాళ్ల నోరు మూయిస్తారు. తాజాగా టీవీ నటి సయాంతనీ ఘోష్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం(నిన్న)ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యం, పాజిటివ్ ఆటిట్యూడ్ వంటి విషయాలపై నెటిజన్లతో చర్చిస్తుండగా, అందులో ఓ నెటిజన్ తన వంకర బుద్దిని బయటపెట్టాడు. నీ లోదుస్తుల సైజ్ ఎంత అడిగిన నెటిజన్‌కు సయాంతనీ దిమ్మతిరిగే జవాబిచ్చింది. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. నువ్వు మానసికంగా ఇంకా ఎదగాలి. నువ్వు నా లో దుస్తుల సైజు అడిగావు.. నేను కూడా నీ అంగం సైజు ఎంత అని అడిగి ఉంటే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? సైజుల గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయాలి. గతంలో నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మగవాళ్లు నా వక్షోజాలను తదేకంగా చూస్తున్నప్పుడు నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను. View this post on Instagram A post shared by Sayantani (@sayantanighosh0609) ఇక చాలు..మనల్ని మనం ప్రేమించాల్సిన అవసరం చాలా ఉంది. మన శరీరం ఎలాంటి సైజ్‌లో ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని అగౌరవించాలని చూసినా, బాడీ షేమింగ్ చేసినా వారికి గట్టి బదులివ్వండి' అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఇక సయాంతనీ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు ఇచ్చిన రిప్లై చాలా ఇంప్రెసివ్‌గా ఉందంటూ సయాంతనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఘర్ ఏక్ సప్నా, నాగిని వంటి సీరియల్స్‌తో సయాంతనీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్ -
ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ నటీమణుల డైట్ ఏంటో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ తరం.. దీనికి నిదర్శనం వారి ఆరోగ్యకర జీవన విధానం.. ప్రస్తుతం మనిషి జీవిత కాలం క్షీణిస్తూ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో పాతకాలపు ఆహార పద్ధతులను అన్వేస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఆ తరం నటీమణుల ఆహార అలవాట్లు, వారి జీవన విధానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.. – సాక్షి, సిటీబ్యూరో గంజినే సూప్‌గా తాగేవాళ్లం.. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంతో ఉన్నానంటే చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మాత్రమే. ఇంట్లో అమ్మ చేసిన ఆహారం తప్ప బయటి చిరుతిల్లు ఉండేవి కావు. మా తరంలో పుట్టుసారం బాగుండేది. మా అమ్మ 8 నెలల గర్భిణిగా ఉండే వరకు మొదటి పాపకు పాలను ఇచ్చేది. అప్పుడు బియ్యం, జొన్నల నుంచి తీసిని గంజిని సూప్‌గా ఇచ్చేవారు. చెట్టుపైనే మగ్గిన పండ్లను తినేవాళ్లం. నేను తులసి, కరివేపాకు, వాము, సొంటి, మిరియాలు, ధనియాలు, జిలకర్ర మిశ్రమాల పొడితో కాచిన డికాషన్ మాత్రమే తాగుతాను. – క్రిష్ణవేణి, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ బతకడానికి తినాలి.. నేను ఆరి్టస్ట్ని.. ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండాలి. దీనికి నా బాల్యంలోని ఆహార పద్ధతులే సహకరించాయి. ఇప్పటికీ నాకు బీపీ, షుగర్లాంటి సమస్యలు లేవు. పస్తుతం నీళ్లు, పాలు, నూనె, కూరగాయలు, బియ్యం ఏది చూసినా కల్తే.. ప్రస్తుతం పలువురు ఆరోగ్య నిపుణులు అధికంగా అన్నం తినకూడదని చెబుతుంటారు. మేమైతే అన్నీ తినేవాళ్లం. దానికి తగ్గ శారీరక శ్రమ చేసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నం తగ్గించి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. బతకడానికి తినాలి.. తినడానికి బతకకూడదు. – శివపార్వతి. ఇంటి గుట్టు సీరియల్ సౌత్ ఇండియన్ ఫుడ్.. నా ఫిట్నెస్కి ముఖ్య కారణం వర్క్‌హాలిక్‌గా, నాన్ఆల్కాహాలిక్గా ఉండటం. ముఖ్యంగా నాకు ఇష్టమైన దక్షినాదిలోని ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్నిచ్చాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లి ఇంటర్నేషనల్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ మారింది. మొదటి నుంచి శాఖాహారిని కావడం వలన మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్‌లో వాడుతుంటాను. ఇది ఆరోగ్యాన్నే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాలోని డాన్స్ స్కిల్స్ నేను ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండటానికి మరో కారణం. – సుధా చంద్రన్, నెంబర్ వన్ కోడలు సీరియల్ మానసిక ఆరోగ్యం అవసరమే.. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా చేస్తున్నానంటే అనవసర విషయాలను పట్టించుకోకపోవడమే. ఈ మానసిక ధృడత్వానికి కారణం నా ఆహార అలవాట్లే. విటమిన్లు, ప్రొటీన్స్ అధికంగా అందించే బొప్పాయి వంటి పండ్లను అధికంగా తింటాను. ఎలాంటి డైట్‌ను పాటించను. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫ్రూట్, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగుతూ వ్యాయామం చేస్తాను. – లక్ష్మీ ప్రియ, నాగభైరవి సీరియల్ -
‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం’
అమ్మ కంటి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమంది.టైమ్ దొరకట్లేదు.భార్య థైరాయిడ్ డౌట్ ఉందని తోడు రమ్మంది.టైమ్ ఉండట్లేదు. కూతురు కళ్ల కింద చారలు వచ్చాయని బెంగ పెట్టుకుంది. అదేమైనా సమస్య. తర్వాత చూద్దాం. సొంత అక్క... తమ్ముడూ కొంచెం గుండె పరీక్ష చేయించరా అనంటే ఎప్పుడు వీలు చిక్కింది కనుక. నాన్నకు, కొడుక్కు, భర్తకు ఆరోగ్య సమస్య వస్తే టైమ్ దొరికినంత సులువుగా ఇంట్లో స్త్రీలకు సమస్య వస్తే టైమ్ దొరకదు. ప్రపంచ ఆరోగ్య దినం నేడు. ఈ ప్రపంచం సగం స్త్రీలది. వారి ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నామా మనం? ‘టాబ్లెట్ వేసుకొని పడుకో’ అని ఇంట్లోని స్త్రీలకు చెప్పడం సులభం. ‘డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద’ అని అనడం కష్టం. డాక్టర్ దగ్గరకు అయితే వాళ్లే వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలి. పురుషులు మాత్రం తోడు వెళ్లరు. తోడు వారు స్వయంగా చూపించుకోలేక కాదు. ‘నా తోడు నా కుటుంబం ఉంది’ అని అనిపించడం ముఖ్యం. కుటుంబం మీద పురుషుడి నిర్ణయాధికారం ఉండటం వల్ల స్త్రీ ఆరోగ్యం మీద కూడా అతడిదే నిర్ణయాధికారం అవుతుంది. ‘సంప్రదాయ భావధార’ ప్రకారం కూడా ఇంట్లో పురుషుడి అనారోగ్యానికి ఎంతైన ఖర్చు చేయవచ్చు. స్త్రీ అనారోగ్యానికి ఖర్చయితే ‘అనవసర ఖర్చు వచ్చి పడింది’ అని చికాకు. ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మన ఇళ్లల్లో అది స్త్రీలకు ఎంత ఉంది? ‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం’ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2021 సంవత్సరానికి ‘ప్రపంచ ఆరోగ్య దినం’కు సంబంధించిన ‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం’ అనే నినాదాన్ని ఇచ్చింది. వివక్ష లేని అంటే? పేదవాళ్లు కావడం వల్ల, బాధిత కులాలు కావడం వల్ల, ఫలానా మతం వారు కావడం వల్ల, ఫలానా దేశంలో ప్రాంతంలో నివహించడం వల్ల వారు ఆరోగ్యానికి యోగ్యులు కారు అని అనుకోవడం. లేదా వారు ఈ రోగాలకు తగినవారే అని అనుకోవడం. వీళ్ల కంటే ముఖ్యం వివక్ష అంటే ‘స్త్రీలకు ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని భావించడం. స్త్రీల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం. ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడే వ్యవస్థను స్త్రీకి కల్పించి తన ఆరోగ్య ఖర్చుల కోసం కూడా అతడి మీద ఆధారపడేలా చేయడం వల్ల పురుషుడి (ఇంటి పెద్ద) అంగీకార అనంగీకారాలు స్త్రీ ఆరోగ్యానికి కీలకంగా మారాయి. ‘ఏమంటాడో’, ‘ఇప్పుడు చెప్పడం అవసరమా’, ‘తర్వాత చెబుదాంలే’, ‘చెప్పినా పట్టించుకోడు’ వంటి స్వీయ సంశయాల కొద్దీ స్త్రీల తమ అనారోగ్యాలను ముదరబెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సూపర్‌మామ్ సిండ్రోమ్ ప్రసిద్ధ రచయిత్రి పి.సత్యవతి ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ అనే కథ రాశారు. అందులో ఒక అరవై ఏళ్ల స్త్రీ మరణిస్తుంది. కాని మరణించిన మరుక్షణం ఆమె శరీరం అంతా మందు బిళ్లల మయంగా మారిపోతుంది. శరీరం ఉండదు... అన్నీ మందు బిళ్లలే. ఇన్ని మందుబిళ్లల మయం ఎందుకయ్యింది ఆమె? పిరియడ్స్ టయానికి రావాలని, పిరియడ్స్ టయానికి రాకూడదని, మొటిమలు నివారించాలని, జుట్టు పెరగాలని, పెళ్లయ్యాక సంతానం నిరోధించాలని, సంతానం కలగాలని, ఇంటి పనికి ఓపిక తెచ్చుకోవాలని, నిద్ర సరిగ్గా పట్టాలని, తెల్లారే లేవడానికి నిద్ర అసలు పట్టకూడదని, గర్భాశయంలో సమస్యలకు, ఒత్తిడి వల్ల వచ్చిన బి.పికి, సుగర్‌కు, ఇంటి పని ఆఫీస్ పని చేయలేక వచ్చిన డిప్రెషన్‌కు... ఇంకా అనంతానంత సమస్యలకు ఆమె బిళ్లలు మింగీ మింగీ ఈ పరిస్థితికి వచ్చిందని అబ్సర్డ్స్గా కథ చెప్పడం అది. తమ సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే సొంత వైద్యం చేసుకునే స్త్రీలు ఎక్కువ మన దేశంలో. వారు డాక్టర్ దగ్గరకు వెళ్లి తమ సమస్య నుంచి బయటపడే హక్కు ఉంది అని అనుకునే సహకరిస్తున్నాడా పురుషుడు? కాసింత ప్రేమ... ఎంతో ఆప్యాయత మందు కంటే ఒక మంచి మాట ఏ మనిషికైనా ఉపయోగపడుతుంది. ‘ఎలా ఉన్నావమ్మా’, ‘ఆరోగ్యం ఎలా ఉంది’, ‘ఏంటలా ఉన్నావు... ఏమైనా సాయం కావాలా’, ‘తలనొప్పిగా ఉందా టీ పెట్టనా’... లాంటి చిన్న చిన్న మాటలు కూడా భర్తలు, కుమారులు మాట్లాడని ఇళ్లు ఉన్నాయి. ఉండటం ‘నార్మల్’ అనుకునే వ్యవస్థా ఉంది. కాని ఒక్క మాట మాట్లాడితే అదే స్త్రీలకు సగం ఆరోగ్యం అని ఎవరూ అనుకోరు. ప్రతి సంవత్సరం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకునే భర్త భార్యను కూడా అందుకు ప్రోత్సహిస్తున్నాడా... చేయించుకోవాలని భార్య కూడా అనుకుంటూ ఉందా? చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిండి ఎవరిది? ‘తిండి కలిగితే కండ కలదోయ్’ అన్నాడు కవి. ఈ కండ పురుషుడికే. స్త్రీకి కాదు. ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళ్లడం, జిమ్‌లో చేరడం, బజారు లో నచ్చింది తినడం పురుషుడి వంతు. ఉదయాన్నే నాష్టా చేయడంలో బిజీ అయ్యి, ఇంటి పనుల్లో మునిగిపోయి, ప్రత్యేకంగా ఫలానాది నా కోసం ఏం ఒండుకుని తింటాంలే అని అందరికీ వొండింది, అందరూ వొదిలిపెట్టింది తినడం స్త్రీ వంతుగా ఉందంటే అది కాదనలేని సత్యం. స్త్రీల పుష్టికి ప్రత్యేకంగా పౌడర్లు, టానిక్కులు, విటమిన్ టాబ్లెట్లు, పండ్లు, వారికి ఇష్టమైన ఆహారమూ తెచ్చి పెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నాయో గమనించుకోవాలి. ‘నాకు ఫలానాది తినాలని ఉంది’ అని స్త్రీ చెప్పే పరిస్థితి కొన్ని ఇళ్లల్లో ఉండదు. ఉద్యోగం చేసే స్త్రీలు కూడా తాము తాగే సోడాకు భర్తకు లెక్క చెప్పే పరిస్థితి ఉందని అంగీకరించడానికి సిగ్గు పడాల్సిన పని లేదు. వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట తక్కిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా ఇంటినే లోకంగా భావించే స్త్రీల వైపు అందరం దృష్టి పెట్టాల్సిన అక్కరను గుర్తు చేస్తోంది. ఇవాళైనా విందామా? – సాక్షి ఫ్యామిలీ -
కరోనా నేపథ్యంలో లంగ్స్ జాగ్రత్త
ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏప్రిల్ 7న దీన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న ఉద్దేశం/ నినాదం (స్లోగన్) ‘అందరికీ ఆరోగ్యం’. అయితే ఈ ఏడాది ‘ప్రపంచ ఆరోగ్య దినం’ వచ్చిన సమయంలో లోకమంతా కరోనా వైరస్ గుప్పెట్లో విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా వచ్చే ‘కోవిడ్–19’ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా? ప్రతి ఏడాదీ... ప్రతి ఒక్కరికీ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతో కొంత తగ్గుతూ పోతుంటుంది. దాంతో ఆక్సిజన్ అందే సామర్థ్యం కూడా తగ్గుతుంద. దీన్ని నివారించాలంటే మనం క్రమం తప్పకుండా శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సైజెస్) చేస్తూ ఉండాలి. ఇలాంటి వృత్తులో ఉన్నవారు జరభద్రం... ♦ గొర్రెల పెంపకం అన్నది కూడా చాలామందికి ఓ జీవనోపాధి. అయితే గొర్రెల మంద మీదుగా వచ్చే గాలిలో కూడా ‘కాక్సియల్లా’ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వీటివల్ల ఇంకో రకం నిమోనియా వస్తుంది. అందుకే వీటి నుంచీ జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక మార్గం ఉంది. గొర్రెల మీదుగా వచ్చే గాలి ఒకరకమైన వాసనతో మన ముక్కుపుటాలకు తాకుతుంది. ఆ వాసన తగలనంతటి దూరంలో మనం ఉండటం మేలు. ♦ ఇక మన సమాజంలో కోళ్లు, బాతుల వంటి వాటిని పెంచేవారు చాలామందే ఉంటారు. ఆ పక్షుల మీదుగా వచ్చే గాలిలోని ‘క్లెమీడియా’ అనే సూక్ష్మజీవుల వల్ల ఒక రకం నిమోనియా వస్తుంది. అందుకే ఆ పక్షులను పెంచేవారు వాటిని మీ నివాసాల నుంచి దూరంగా ఉంచేలా జాగ్రత్త పడండి. ♦ పావురాలు, అవి వేసే రెట్టల వల్ల ఆస్పర్జిల్లస్, క్రిప్టోకోకస్ అనే సూక్ష్మజీవుల వల్ల వ్యాప్తి చెంది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. షుగర్ లేదా ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. వీటిని కనుగొనడం, చికిత్స... ఈ రెండూ కష్టమైన, ఖరీదైన విషయాలే. కాబట్టి వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. కొందరు వాటికి దాణా తినిపించడం మంచి విషయంగా భావిస్తుంటారు. కానీ వాటిని నివాసప్రాంతాలకు దూరంగా ఉంచాలన్నది గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా క్వారంటైన్ ప్రదేశాలు, హాస్పిటల్స్ వంటి వైద్య/చికిత్సా కేంద్రాలకు దూరంగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి. ♦ పిల్లులూ లేదా ఇతర పెంపుడు జంతువులు కూడా మీనుంచి దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాటి సాధారణ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే వాటిని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి. ♦ ఇక పట్టణాల్లో... ఆ మాటకొస్తే కొన్ని పల్లెల్లో కూడా చాలాకాలం వాడని ఏసీలు, కూలర్లలో ‘లెజినెల్లా’ అనే సూక్ష్మజీవులు పెరిగి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు ముదిరితే, దీర్ఘకాలంలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ)కి దారితీసే అవకాశాలూ ఉంటాయి. చాలాకాలం వాడకుండా ఉన్న కూలర్‌ను బయటకు తీసినప్పుడు కాసేపు ఆరుబయట దాన్ని ఆన్‌చేసి ఉంచి, ఆ తర్వాతే వాడాలి. ఏసీలు వాడేవారు వాటి తగిన సమయంలో వాటి ఫిల్టర్లను మార్చి వాడాలి. ♦ ఇళ్లలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. చాలాకాలం మూసి ఉంచిన గదుల్లోకి వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని వెళ్లడం మంచిది. ♦ లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం వంటివి చేసేటప్పుడు ముక్కు దగ్గర టిష్యూ లేదా కర్చిఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఆ టిష్యూను ఇక మళ్లీ వాడకుండా పారేయాలి. కర్చిఫ్‌ను ఉతికాకే మళ్లీ వాడుకోవాలి. టీష్యూ, కర్చిఫ్ లేకపోతే మోచేతి మడతలో తుమ్మడం/దగ్గడం చేయాలన్నది ఇటీవలి సూచనల వల్ల మీకు తెలిసిన విషయమే. ♦ పొగతాగే అలవాటుంటే, తక్షణమే మానేయాలి. పొగతాగే వారంతా ఈ 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా తమ అలవాటు మానుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మరణాలను నివారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా లంగ్స్ ఆరోగ్యం కోసం ఈ సూచనలు పాటించండి. -
భారత్, చైనా ప్రపంచ పెద్దన్నలు కావాలి
దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు శ్రేయోరాజ్యాన్ని, ప్రపంచం అంతర్జాతీయ మానవతావా దాన్ని కాంక్షిస్తున్న కాలంలో సరిహద్దులు దాటి అనేక సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరి గినాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్– మన దేశ స్వాతంత్య్ర కాలానికి అటు ఇటుగా ఏర్పడినాయి. 1920లో జెనీవా కేంద్రంగా హెన్రీ డ్యూనాంట్ ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సంస్థ కోటి మంది స్వచ్ఛంద సైనికులతో దేశాలు, వాటి ఘర్షణలతో సంబంధం లేకుండా క్షతగాత్ర సైనికు లకు సేవలు అందించింది. దీని స్ఫూర్తితో 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడి, తన మొదటి అసెంబ్లీని 1950లో సమాయత్తపరిచింది. అన్ని దేశాల ప్రజలు అత్యున్నత శారీరక, మానసిక ఆరోగ్యం సాధించాలని పిలుపును ఇచ్చింది. మన దేశంలో అమలైన మాతా శిశు సంరక్షణ, జాతీయ మలేరియా, క్షయ, కుష్టు, అనేక అంటురోగాల నిర్మూలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారం ఉన్నది. ఎయిడ్స్ వ్యాధి నివారణకు వర్ధమాన దేశాల నుండి మందుల సరఫరాకు అతి తక్కువ ధరల బిడ్స్ కోరినందునే మన దేశంలోనే అనేక మందుల కంపె నీలు అంతర్జాతీయ ప్రమాణాలతో సరఫరా చేసి నాయి. చైనా, ఇండియా, జపాన్ కొత్త ప్లేయర్స్‌గా అవతరించినాయి. అయితే, గత 30 ఏండ్లలో లేని తీవ్రమైన నిధుల కొరతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎదుర్కొంటున్నది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో బేలగా కొన్ని సలహాలే తప్ప, క్రియాశీలకంగా ముందుకు పోలేని స్థితిలో నేడు 72వ వార్షికోత్సవం జరుపుకొంటున్నది. 1978లో రష్యాలో ‘2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఆరోగ్యం’ డిక్లరేషన్ జరిగింది. దేశాలలో వనరుల పంపిణి సమంగా ఉంటే కాని ఈ లక్ష్యం నెరవేరదనీ, పేద దేశాలకు నిధులు సమకూర్చడం అగ్రదేశాల మాననీయ కర్తవ్యమనీ అర్థించింది. ఈ మాటలు సహజంగానే అమెరికా, యూరోప్ దేశాలకు నచ్చలేదు. చమురు పోస్తే కాని తోటి దేశాల ఆరోగ్య దీపాలు వెలగవని ఇవి గ్రహించలేకపోయినాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రజలు సంవత్సరమంతా ఒక నిర్దేశిత ఆరోగ్య లక్ష్యం చుట్టూ గమనంలో ఉండాలని ప్రతి ఏప్రిల్ 7కు ఒక థీమ్‌నూ, ఒక గోల్‌నూ ప్రతిపాదిస్తుంది. అనేక సంక్షోభ, సంక్లిష్ట కారణాలతో 2000 నాటికి అందరికి ఆరోగ్యం సాధించడం జరగలేదు కనుక, 2018 ఏప్రిల్‌లో తన 70వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వ జనీన ఆరోగ్య కవరేజ్ ప్రకటించుకుంది. 2019లో కూడా అదే టార్గెట్‌ను ప్రపంచ దేశాలకు నిర్దేశించినా, విధానపరమైన నిర్ణయాత్మకత లేకపోవడంతో ఫలి తాలు రాలేదు. ఇప్పుడు కోవిడ్ 19 నేపథ్యంలో సంక్ర మణ వ్యాధుల చర్చను, కార్యక్రమాలను ప్రకటిం చింది. సేవామూర్తులైన నర్సులకు ఆరాధ్య దేవత ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జన్మదినోత్సవ పునరు త్తేజంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది ముందుకు పోవా లని అన్నది. అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (íసీడీసీ) ప్రపంచంలో ప్రామాణికమైన పరిశోధనా సంస్థ. కానీ సార్స్, ఎబోలా, నిఫా, మెర్స్ సమయంలో సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చిన సాంకేతిక సహాయం, సలహాలు నామమాత్రం. నిన్నటి కరోనా, నోవల్ కరోనాగా వచ్చి వూహాన్ గగనతలాన్ని దాటి తమ దేశాల్లో ప్రవేశిస్తుంటే చేష్టలుడిగిన దౌర్భాగ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాభవం తగ్గడానికి ఒక కారణం. కరోనా దెబ్బకు లక్షమంది దేశీయంగా చని పోతారని వణికిపోతున్న అమెరికా గ్లోబల్ సహాయం చేసే స్థితిలో లేదు. అందుకే భారత్ అయినా గతంలో చేసిన తప్పులు చేయకుండా 2020 ఆరోగ్య బడ్జెట్లో 6% నిధులను కేటాయిస్తే బాగుంటుంది. ప్రపంచ ప్రజల ఆర్థిక శక్తులుగా ఎదిగిన చైనా, ఇండియా ఇతర వర్ధమాన దేశాలను ప్రభావితం చేయడానికి తామే పెద్దన్నలుగా ఎక్కువ నిధులు ఈ సంస్థకు సమ కూర్చితే 2020లో అదే పెద్ద ‘కంట్రిబ్యూషన్’. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్యానికి ఆక్సిజన్. దాన్ని బలో పేతం చేయడం ఒక అత్యవసర కార్యం. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా) డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త సామాజిక వైద్యులు, రాజకీయ కార్యకర్త -
మానవాళిపై కత్తి దూసింది...
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని ఆర్యోక్తి. మన పూర్వీకులు ఆరోగ్య ప్రాధాన్యాన్ని ఏనాడో గుర్తించారు. ఆరోగ్యాన్ని రక్షించుకునే మార్గాలనూ బోధించారు. కొంచెం ముందుచూపు కలిగి, ముందు జాగ్రత్తలను పాటించినట్లయితే చాలావరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా, ఒక్కోసారి మహమ్మారి రోగాలు విజృంభిస్తూ ఉంటాయి. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంటాయి. పెద్దసంఖ్యలో మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటాయి. కాల గమనంలో పరిస్థితులు తిరిగి సద్దుమణుగుతాయి. మహమ్మారి రోగాలు చెలరేగినçప్పుడు మనుషులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మరింత సంయమనంతో మెలగాల్సి ఉంటుంది. ఎన్నో మహమ్మారి రోగాలు సృష్టించిన దారుణ మారణహోమాలను చూసిన చరిత్ర మనది. ఒక్కొక్కటినే జయించుకుంటూ వచ్చాం. తాజాగా ‘కరోనా’ వైరస్ ‘సుస్తీమే సవాల్’ అంటూ మానవాళిపై కత్తి దూసింది. దీనిని సైతం మట్టుబెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అంతవరకు మహమ్మారులను ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధులం కావాలో తెలుసుకుందాం. ఆరోగ్య పరిరక్షణలో చరిత్ర చెప్పిన పాఠాలనూ తెలుసుకుందాం.. వ్యాయామాత్ లభతే స్వాస్థ్య దీర్ఘాయుష్యం బలం సుఖం ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ఎన్నో సవాళ్లు.. మరెన్నో మైలురాళ్లు.. చరిత్ర గమనంలో ప్రజల ఆరోగ్యానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు విజృంభించిన మహమ్మారి రోగాలు, రకరకాల ఇన్ఫెక్షన్లు నిష్కారణంగా నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. వైద్యరంగం ఇలాంటి సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నా, వాటిని కూడా అధిగమించేందుకు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతూ వస్తోంది. పెన్సిలిన్ సహా వివిధ యాంటీబయోటిక్ ఔషధాల ఆవిష్కరణ, వివిధ వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్ల ఆవిష్కరణ, మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఆవిష్కరణ, అవయవ మార్పిడి శస్త్రచికిత్స పద్ధతులు వంటి ఎన్నో ఘనవిజయాలను ఆధునిక వైద్యరంగం నమోదు చేసుకుంది. ఆధునిక వైద్యరంగం సాధించిన పురోగతి ఫలితంగా ఇప్పటికే కొన్ని వ్యాధులు కనుమరుగయ్యాయి. ఇదివరకటి కాలంలో బాగా భయపెట్టిన వ్యాధులు కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉన్నా, వాటికి భయపడే పరిస్థితులైతే ఇప్పుడు లేవు. ఒకనాటి కాలంలో ప్రాణాంతకంగా ఉన్న చాలా వరకు వ్యాధులను సమర్థంగా నయం చేయగల ఔషధాలు, చికిత్స పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వైద్యరంగం సాధించిన ముఖ్యమైన మైలురాళ్లు కొన్ని.. చేతులు కడుక్కోమన్నాడని చితగ్గొట్టి చంపేశారు పంతొమ్మిదో శతాబ్దిలో తరచుగా మాతా శిశు మరణాలు సంభవించేవి. పురుళ్లు పోసే మంత్రసానులు, వైద్యులు సరైన శుభ్రతను పాటించకపోవడం వల్లనే నిష్కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్న సంగతిని తొలిసారిగా హంగేరియన్ వైద్యుడు ఇగ్నాజ్ ఫిలిప్ సెమ్మెల్వీస్ గుర్తించాడు. క్లోరిన్ కలిపిన సున్నపు నీటితో (క్యాల్షియం హైపోక్లోరైట్) చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత పురుళ్లు పోస్తే, మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించాడు. తాను పనిచేసే వియన్నా జనరల్ హాస్పిటల్లో సెమ్మెల్వీస్ ఇలా చేతులను శుభ్రం చేసుకునే పద్ధతిని కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ప్రసవాల కోసం వచ్చే మహిళల్లో, వారికి పుట్టే శిశువుల్లోను ప్రసవానంతర ఇన్ఫెక్షన్లను గణనీయంగా తగ్గించగలిగాడు. ఇదే అంశమై తన పరిశీలనను ‘ఎటియాలజీ, కాన్సెప్ట్ అండ్ ప్రొఫిలాక్సిస్ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్’ అనే పుసక్తంగా 1847లో వెలువరించాడు. సెమ్మెల్వీస్ పుస్తకం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రసవాలు చేయడానికి ముందు, శస్త్రచికిత్సలకు ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సెమ్మెల్వీస్ చేసిన సూచన ఆనాటి వైద్యులకు ఆగ్రహం తెప్పించింది. ‘నువ్వు చెప్పే వరకు మాకు తెల్దేటి మరి’ అనే రీతిలో అతడిని నానా రకాలుగా హేళన చేసి, మానసికంగా హింసించారు. తన వాదనను బలపరచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించిన సెమ్మెల్వీస్ ఒక దశలో కాస్త మతిస్థిమితం తప్పాడు. అలాంటి పరిస్థితుల్లో అతడితో పనిచేసే సహవైద్యుడు ఒకరు 1860లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్చాడు. తనకు పిచ్చిలేదని అతడు చెబుతున్నా పట్టించుకోని గార్డులు అతడిని చితగ్గొట్టారు. గార్డుల దాడిలో చేతికి తగిలిన గాయం గ్యాంగరీన్గా మారడంతో పద్నాలుగు రోజుల్లోనే సెమ్మెల్వీస్ కన్నుమూశాడు. అతడు మరణించిన కొంత కాలానికి గాని అతడి వాదనలోని వాస్తవాన్ని ఆధునిక వైద్యరంగం గుర్తించలేదు. సెమ్మెల్వీస్ మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని స్జెంట్ రోకుస్ ఆస్పత్రి ఆవరణలో అతడి నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పి, ఆయన పట్ల జరిగిన అపరాధానికి పశ్చాత్తాపం ప్రకటించుకున్నారు. వ్యాయామంతోనే ఆరోగ్యం లభిస్తుంది. దీర్ఘాయుష్షు, బలం, సుఖం దానితోనే లభిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగానే ఉంటేనే ఏదైనా సాధించగలం. వైద్యరంగం ఆధునికతను సంతరించుకోక ముందే మన పూర్వీకులు ఈ సంగతిని గుర్తించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి విలువైన సూత్రాలను ఎన్నింటినో చెప్పారు. కొందరు శాస్త్రవేత్తలు ఎంతో ముందుచూపుతో శుచి శుభ్రతలను గురించి చెప్పిన ఆరోగ్య సూత్రాలను జనాలు తొలినాళ్లలో అర్థం చేసుకోలేకపోయారు. పైగా ఆరోగ్య సూత్రాలు చెప్పిన వారినే నిందించారు, దారుణంగా హింసించారు. చివరకు చేతులు కాలిన తర్వాత తాపీగా పశ్చాత్తాపం చెందారు. ‘కరోనా’ దెబ్బకు ఇప్పుడందరూ శానిటైజర్లు వాడుతున్నారు. ఘడియ ఘడియకు చేతులు కడుక్కుంటున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకుంటే చాలు, సూక్ష్మజీవుల నుంచి వచ్చే చాలావరకు వ్యాధులను నివారించుకోవచ్చు. వ్యాధి సోకిన తర్వాత దానిని నయం చేసుకునేందుకు నానా తిప్పలు పడే బదులు నివారణ చర్యలు పాటించడమే మంచిదనే స్పృహ మనుషుల్లో బాగానే పెరిగింది. రెండు శతాబ్దాల కిందట మనుషుల్లో ఈ స్పృహ అంతగా ఉండేది కాదు. చిన్నా చితకా రోగాలకే మనుషులు పిట్టల్లా రాలిపోయేవారు. శారీరక శుభ్రత, వ్యాయామం తగినంతగా ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. నేటికీ చాలావరకు జీవనశైలి వ్యాధులకు మూల కారణం వ్యాయామ లోపమే! డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు మొదలుగా గల వ్యాధులు వ్యాయామ లోపం వల్ల మనుషులను పీడిస్తున్నాయి. ఇక సాధారణమైన జలుబు మొదలుకొని ఇటీవలి ‘కరోనా’ వరకు చాలా వ్యాధులకు అసలు కారణం శుభ్రతా లోపమేనని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. చరిత్రలోనే తొలి వ్యాక్సిన్ ఒకప్పుడు మానవాళిని వణికించిన మశూచి మహమ్మారిని తుదముట్టించే ప్రయత్నాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నెర్ 1796లో తొలి విజయం సాధించాడు. మశూచి నివారణ కోసం ఆయన ప్రపంచ చరిత్రలోనే తొట్టతొలి వ్యాక్సిన్‌ను రూపొందించాడు. మశూచిని పోలిన వ్యాధితో బాధపడే ఆవుదూడల లింఫ్ గ్రంథులను ఎండించి, ఫ్రీజ్ చేసి, వాటి నుంచి సేకరించిన కణాలతో డాక్టర్ జెన్నెర్ రూపొందించిన ‘డ్రైవాక్స్’ వ్యాక్సిన్ ప్రపంచ వైద్య చరిత్రలోనే గొప్ప మైలురాయి. తర్వాతి కాలంలో పంతొమ్మిదో శతాబ్దిలో అమెరికన్ ఔషధ తయారీ సంస్థ ‘వైయెత్’ మశూచి నివారణ కోసం మరింత మెరుగైన వ్యాక్సిన్ తయారు చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్లు మశూచి మానవాళిని వెంటాడింది. చరిత్రలో చిట్టచివరి మశూచి కేసు 1977లో నమోదైంది. ఆ తర్వాత ఇది పూర్తిగా కనుమగురైంది. చరిత్ర గతిని మార్చిన పెన్సిలిన్ చిన్నా చితకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సైతం ఒకనాటి కాలంలో మనుషుల ప్రాణాలను బలి తీసుకునేవి. యాంటీబయోటిక్ ఔషధాలేవీ అందుబాటులో లేని కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా ఉండేవి. ఈ పరిస్థితులు ఇరవయ్యో శతాబ్ది నాటికి కూడా ఉండేవి. అలాంటి రోజుల్లో స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో యాంటీబయోటిక్ ఔషధం ‘పెన్సిలిన్’ను కనుగొన్నాడు. లండన్‌లోని సెయింట్ మేరీ హాస్పిటల్ లాబొరేటరీలో ఫ్లెమింగ్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌పై పరిశోధనలు సాగించేవాడు. అప్పటికే ఫ్లెమింగ్ మతిమరపు మనిషిగా, నిర్లక్ష్య ధోరణితో పనిచేసే వ్యక్తిగా పేరు మోశాడు. పెన్సిలిన్ ఆవిష్కరణ చాలా చిత్రంగా జరిగింది. స్టాఫిలోకాక్సస్ బ్యాక్టీరియాపై పరిశోధన మొదలుపెట్టిన ఫ్లెమింగ్, ఆ బ్యాక్టీరియా కల్చర్ ప్లేట్‌పై అలాగే లాబ్‌లో వదిలేసి, ఎందుకో రెండువారాలు సెలవుపై వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకుంటే, ఆ ప్లేట్‌పై పూర్తిగా బూజుపట్టి కనిపించింది. ప్లేట్‌పై పెరిగిన బూజు స్టాఫిలోకాక్సస్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించినట్లు ఫ్లెమింగ్ కనుగొన్నాడు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ పరిణామమే ‘పెన్సిలిన్’ రూపకల్పనకు దారితీసింది. ఇది ప్రపంచ వైద్య చరిత్రనే సమూలంగా మార్చేసింది. అమెరికాలో సెప్టిసీమియాకు గురైన రోగికి 1942లో తొలిసారిగా పెన్సిలిన్ ఇవ్వడం ద్వారా స్వస్థత చేకూర్చగలిగారు. తర్వాత అమెరికన్ ఔషధ కంపెనీలు పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. రెండో ప్రపంచ యుద్ధం 1942లో మొదలైన తొలి ఐదు నెలల్లో కేవలం 40 కోట్ల యూనిట్ల పెన్సిలిన్ మాత్రమే అందుబాటులో ఉండేది. యుద్ధం ముగిసే నాటికి నెలకు 65 కోట్ల యూనిట్ల మేరకు పెన్సిలిన్‌ను ఔషధ సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఫలితంగా యుద్ధంలో గాయపడ్డ వేలాది సైనికుల ప్రాణాలను కాపాడటం సాధ్యమైంది. పెన్సిలిన్ తర్వాత అందుబాటులోకి వచ్చిన చాలా యాంటీబయోటిక్ ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలను కొడిగట్టిపోకుండా కాపాడగలిగాయి.నిజానికి పెన్సిలిన్ కంటే ముందే యాంటీబయోటిక్ యుగం మొదలైంది. జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్తీమ్, ఆయన సహచరుడైన వైద్యుడు పాల్ ఎల్రిక్ 1907లో తొలి యాంటీబయోటిక్ ఔషధం సాల్వర్సాన్ను రూపొందించారు. అప్పట్లో తీవ్రంగా ఉన్న సిఫిలిస్ చికిత్సలో దీనిని విజయవంతంగా ఉపయోగించారు. వ్యాక్సిన్ల చరిత్రలో మలుపు ఫ్రెంచి రసాయనిక శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ పంతొమ్మిదో శతాబ్దిలో వ్యాక్సిన్ల చరిత్రనే మలుపు తిప్పాడు. ర్యాబిస్ వైరస్‌ను కుందేళ్లకు ఎక్కించి, వైరస్ సోకిన నాడీ కణాలను ఎండబెట్టడం ద్వారా వైరస్‌ను నాశనం చేసే పద్ధతిని కనుగొన్నాడు. పాశ్చర్ సహచరుడైన ఫ్రెంచి వైద్యనిపుణుడు ఎమిలీ రోక్స్ ఇదే పద్ధతి ద్వారా ర్యాబిస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా రూపొందించాడు. మనుషులపై దీనిని ప్రయోగించడానికి ముందు యాభై కుక్కలపై ప్రయోగించాడు. ఆ తర్వాత 1885లో కుక్కకాటుకు గురైన ఒక తొమ్మిదేళ్ల బాలుడికి తొలిసారిగా ఈ వ్యాక్సిన్ ఇచ్చి, అతడు పూర్తిగా కోలుకునేలా చేశాడు. ర్యాబిస్ వ్యాక్సిన్ రూపకల్పనలో పాశ్చర్ అనుసరించిన పద్ధతే తర్వాతి కాలంలో వివిధ వ్యాధులను నిరోధించగలిగే మిగిలిన వ్యాక్సిన్ల తయారీకి మార్గాన్ని సుగమం చేసింది. శానిటైజర్‌గా ఆల్కహాల్ ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఉల్లాస పానీయాలుగా ఉపయోగించే అలవాటు పదివేల ఏళ్ల కిందటే ఉండేది. ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఇన్ఫెక్షన్ల నివారణ కోసం ఉపయోగించిన ఘనత మాత్రం ప్రాచీన ఈజిప్షియన్లకే దక్కుతుంది. కంటికి సోకిన ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి ఈజిప్షియన్లు ఆల్కహాల్ కలిగిన ద్రవాలను ఉపయోగించేవారు. క్రీస్తుశకం రెండో శతాబ్ది నాటికి గాయాలకయ్యే ఇన్ఫెక్షన్ల నివారణ కోసం క్లాడియస్ గాలెన్ వంటి ప్రాచీన వైద్యులు ఆల్కహాల్‌ను విరివిగా ఉపయోగించేవారు. ఆల్కహాల్‌లోని యాంటీసెప్టిక్ లక్షణాలను తొలిసారిగా గుర్తించినది మాత్రం ఆధునిక కాలంలోనే. ఆల్కహాల్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తుందని 1875లో గుర్తించారు. శస్త్రచికిత్సలు చేసే వైద్యులు శస్త్రచికిత్సలు చేసే ముందు ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని అప్పటి వైద్యులు కొందరు సూచించేవారు. దాదాపు డెబ్బయి శాతానికి మించిన గాఢత కలిగిన ‘ఇథనాల్’ (ఈథైల్ ఆల్కహాల్) 1930 నాటికి ఆస్పత్రుల్లో యాంటీసెప్టిక్‌గా విరివిగా వాడుకలోకి వచ్చింది. అయితే, ఇథనాల్‌ను నేరుగా చేతులకు పూసుకోవడం కొంత ఇబ్బందిగానే ఉండేది. ఇథనాల్‌ను జెల్ వంటి పదార్థంలో కలిపి, ఉపయోగించేలా తయారు చేసిన ఘనత మాత్రం అమెరికన్ నర్సింగ్ విద్యార్థిని ల్యూప్ హెర్నాండెజ్‌కు దక్కుతుంది. ఆమె ఆవిష్కరణతో 1966 నుంచి ఆధునిక హ్యాండ్ శానిటైజర్ల యుగం మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం హ్యాండ్ శానిటైజర్లను 1980 నుంచి అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చింది. ఆశాజనకంగా యాంటీవైరల్ ఔషధాలు యాంటీబయోటిక్స్‌తో పోల్చి చూస్తే యాంటీవైరల్ ఔషధాల ఆవిష్కరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. తొలి యాంటీవైరల్ ఔషధం ‘ఇడాక్సురిడిన్’కు 1963లో ఆమోదం లభించింది. అమెరికన్ ఫార్మకాలజిస్ట్ విలియం ప్రుసాఫ్ ఈ ఔషధాన్ని 1959లో రూపొందించారు. హెర్పిస్ వైరస్‌ను సమర్థంగా అరికట్టడంలో ఈ ఔషధం సత్ఫలితాలను సాధించింది. ఇడాక్సురిడిన్ చూపిన మార్గంలోనే మరిన్ని యాంటీవైరల్ ఔషధాలు రూపుదిద్దుకున్నాయి. హెపటైటిస్ నుంచి హెచ్ఐవీ వరకు వివిధ వైరస్ల కారణంగా తలెత్తే వ్యాధుల నివారణలో ఈ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాంటీ బయోటిక్ ఔషధాల మాదిరిగా ఇవి వ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవులను నేరుగా నాశనం చేయవు. ఇవి వ్యాధికారక వైరస్ అభివృద్ధిని నిరోధించి, అవి క్రమంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా రోగులకు స్వస్థత కలిగిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారి వ్యాధుల్లో ఒకటిగా గుర్తించిన హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను అరికట్టడంలో యాంటీవైరల్ ఔషధాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కొద్ది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వ్యాధి నావెల్ కరోనా వైరస్ డిసీజ్ ‘కోవిడ్–19’ను అరికట్టడంలో కూడా వైద్యరంగం త్వరలోనే సఫలం కాగలదనే ఆశించవచ్చు. దీని నియంత్రణకు యాంటీ వైరల్ ఔషధాలు, నివారణకు తగిన వ్యాక్సిన్ రూపొందించే దిశగా ముమ్మరంగా జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు సాధ్యమైనంత త్వరలోనే మానవాళికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో కొత్త కొత్త వ్యాధులు ఎన్ని పుట్టుకొచ్చినా వైద్యరంగం ‘సుస్తీమే సవాల్’ అంటూ వాటన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించింది. రానున్న సవాళ్లను సైతం ఆధునిక వైద్యరంగం ఇదే రీతిలో ఎదుర్కోగలదని మనం ఆశించవచ్చు. – పన్యాల జగన్నాథదాసు -
మీ ఆరోగ్య ప్రపంచం
ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ‘‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’’. అంటే... అందరికీ ఆరోగ్య రక్షణ అందడం. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర్నుంచి...వృద్ధాప్యపు దశ వరకు అందరి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే నేటి ఈ ప్రత్యేక కథనం. మీ ప్రపంచం మీ కుటుంబమేగా! అందుకే ప్రపంచ ఆరోగ్య దినాన మీ ఆరోగ్య ప్రపంచం కోసం చదవండి... చదివించండి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందాల్సిందే (యూనివర్సల్ హెల్త్ కవరేజ్) అన్నది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న పిలుపు. కానీ ఆచరణలో అది వాస్తవరూపం దాల్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోస్వచ్ఛందంగా ఆరోగ్యాన్ని పొందడం కోసం మనకు మనమే కొన్ని చర్యలు చేపట్టవచ్చు. మరికొన్ని జాగ్రత్తలతో అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ ఏడాది థీమ్‌ను మనమే పొందడానికి మనం పాటించాల్సిన సూచనలు/జాగ్రత్తలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. మనం పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలకు ముందుగా ఒకసారి ఆరోగ్యరంగంలో మన దేశం పరిస్థితిని చూద్దాం. ఇటీవల మన సమాజం దాదాపుగా పాశ్చాత్య జీవనశైలినే అనుసరిస్తోంది. దాంతో మన దేశంలోనూ నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్‌గా మనం పేర్కొనే దాదాపుగా జీవనశైలి వల్ల వచ్చే డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి పెరుగుతున్నాయి. 2016 నాటి లెక్కల ప్రకారం మన దేశ జనాభా 132,41,71,000. అయితే మన జీడీపీలో మనం వైద్యానికి చేస్తున్న ఖర్చు కేవలం 4.7% మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే కోసం ఇచ్చిన థీమ్ ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’. అంటే జనాభా అంతటికి ఆరోగ్యం అందడానికి ఉద్దేశించిన ‘సార్వత్రిక ఆరోగ్యం’ అనేది ఈ సారి నినాదమన్న మాట. కానీ అది ఆచరణ సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి చాలా అంశాలు కారణమైనప్పటికీ అందులోని ఒక ప్రధాన కారణం... అర్హత ఉన్న వైద్యుల్లో (క్వాలిఫైడ్ డాక్టర్లు) దాదాపు నాలుగింట మూడొంతులు నగర/పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం... భారత్‌లో కేవలం 28% ఉన్న నగర జనాభాకు మొత్తం డాక్టర్లలో 74% మంది నగరాల్లో నివసిస్తుండగా... పల్లెల్లో నివాసం ఉంటున్న మిగతా 72% మందికి కేవలం 26% మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక మన దేశంలోని ప్రతి 10000 మందికీ కేవలం 17 మంది శిక్షణ పొందిన వైద్యం చేయడానికి అర్హులైన వైద్యసిబ్బంది (డాక్టర్లు, నర్సులు) మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతి 10000 మందికీ కనీసం 25 మంది శిక్షణ పొందిన వైద్యసిబ్బంది అయినా ఉండాలని సిఫార్సు చేస్తోంది. ఇక 10000 మందికి కేవలం 13 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఆ సంఖ్యకోసం కనీసం 35 పడకలు అవసరమని కూడా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. చవకే గానీ అందుబాటులో లేదు... మనదేశంలోని ఇంకా విచిత్రమైన అంశమేమిటంటే... భారత్‌లోని పెద్ద నగరాల్లో ప్రపంచస్థాయి వైద్యసేవల్లో చాలావరకు లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద నగరాలతో పోలిస్తే భారత్‌లో దొరికే వైద్యసేవలు చాలా చవక. ఉదాహరణకు గుండె వంటి కొన్ని కీలక శస్త్రచికిత్సల వంటివి భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో 20 రెట్లు ఎక్కువ. పక్కనే ఉన్న మలేషియాలో కూడా ధరలు భారత్ కంటే రెట్టింపు. అయితే అవి ప్రస్తుతానికి విదేశీయులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. స్థానిక ప్రజలకు మాత్రం అందుబాటులో లేవు. దీనికి కారణం... 2016 నాటి ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం రోజుకు 4.5 డాలర్లు/ రూ. 310 మాత్రమే. దాంతో 164 దేశాల్లోని తలసరి ఆదాయాల్లో భారత్ స్థానం 112. ఫలితంగా అంతర్జాతీయంగా పోలిస్తే దేశంలో ఇంత చవగ్గా వైద్యసదుపాయాలు లభ్యమవుతున్నా... ప్రస్తుతానికి భారతీయులకు మాత్రం అవి భరించలేనివే. ఇలాంటి గణాంకాల ప్రకారం వైద్యచికిత్స సామాన్యులకు అందుబాటులో లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈ ఏడాది నినాదమైన సార్వత్రిక ఆరోగ్యం (యూనివర్సల్ హెల్త్ కవరేజ్) ఇంకా నినాద స్థాయిలోనే ఉంది. అందుకే చిన్న పిల్లలు మొదలుకొని... వృద్ధుల వరకు వివిధ వర్గాల వారు అసలు హాస్పిటల్‌కే వెళ్లాల్సిన అవసరం లేకుండా... నిత్యం తమంతట తామే ఆరోగ్యం ఉండేందుకు కొన్ని సూచనలివి... 0 నుంచి ఏడాది వరకు చిన్న పిల్లల ఆరోగ్యం కోసం... పిల్లల ఆరోగ్య సంరక్షణ అన్నది తల్లి గర్భం నుంచే మెుదలు కావాలి. ఇందుకోసం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న కాబోయే తల్లి మూడు నెలల ముందునుంచే తాజా ఆకుకూరలు, పండ్లు లాంటివి తమ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనికి తోడుగా ఐరన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ వంటి మాత్రలు తీసుకుంటే పుట్టబోయే చిన్నారి ఆరోగ్యంగా బాగుండటమే కాకుండా... చాలా రకాల సమస్యలూ నివారితమవుతాయి. పిల్లలు పుట్టాక కనీసం ఆర్నెల్ల పాటు వారికి తల్లిపాలు తప్పక తాగించాలి. పుట్టగానే స్రవించే ముర్రుపాలను తప్పక పట్టాలి. కొన్ని అపోహల కారణంగా కొంతమంది ఆ పాలు పట్టరు. అయితే చిన్న పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తే అవి వృద్ధాప్యం వరకు కూడా ఎన్నో జబ్బులను నివారిస్తాయన్నది నిరూపితమైన సత్యం. ఆ తర్వాత పిల్లలు పుట్టిన నాటి నుంచి ‘యూనివర్సల్ ఇవు్యూనైజేషన్’ కార్యక్రవుంలో భాగంగా ఆ చిన్నారులకు ఇవ్వాల్సిన అన్నిరకాల టీకాలు, వ్యాక్సిన్లు ఇప్పించడం ద్వారా వాళ్లు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. ఆర్నెల్ల పాపాయిలకోసం ఘనాహారం వైపునకు వుళ్లించేందుకు వూర్కెట్లో దొరికే ఖరీదైన ఆహారపదార్థాలు కాకుండా ఇంట్లోనే లభ్యవుయ్యే పదార్థాలతో పోషకాలు ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తయారుచేసి అందించవచ్చు. పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని వీనింగ్ అంటారు. వీనింగ్ సమయంలో పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, కండరాల పెరుగుదల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. ఈ సవుయంలో 4 నుంచి 6 నెలల వయస్సులో... వరి, రవ్వ లాంటి వాటితో బాగా మెత్తగా వండిన పదార్థాలు, ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు; 6 నుంచి 8 నెలల వయస్సులో... బాగా గుజ్జులా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొద్దిగా తాజా పండ్లు, 8 నుంచి 10 నెలల వయస్సులో ... (మాంసాహారం తినేవారైతే) గుజ్జుగా ఉడికించిన వూంసం, చికెన్, చేపలు, గుడ్డుతో పాటు తినదగిన తృణధాన్యాలు; 11–12 నెలల వయస్సులో... బాగా తరిగిన ఆహారం నుంచి క్రవుంగా పెద్ద వుుక్కలుగా కోసిన ఆహారం అన్ని పోషకాలు ఉన్న ఆహారం వంటి వాటివైపునకు వుళ్లించాలి. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు... పెరిగే పిల్లల కోసం... ఇక మొదటి ఏడాది నుంచి పన్నెండు, పదమూడేళ్ల వరకు ఎదిగే వయసు కాబట్టి, అందుకు వీలుగా అన్ని రకాల పోషకాలు, విటమిన్లూ, మినరల్స్, మైక్రోన్యూట్రియెంట్స్... ఇవన్నీ పుష్కలంగా ఉండే పదార్థాలు తినిపించాలి. ఇందుకోసం వాళ్ల ఆహారంలో పొట్టుతో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ధాన్యాలు... అంటే గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు మొదలైనవి ఇవ్వండి. బేకరీ పదార్థాల కంటే తాజా పండ్లనే ఎక్కువగా తినిపించాలి. ఎముకల ఆరోగ్యం కోసం... క్యాల్షియం ఎక్కువగా అందేలా చూడాలి. ఇందుకోసం వారికి రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తప్పనిసరిగా ఇవ్వాలి. ఆహారంలో భాగంగా అన్నం, చపాతి వంటి కార్బోహైడ్రేట్లతో పాటు పప్పులు (దాల్) లేదా శెనగలు, రాజ్మా వంటి ప్రోటీన్లు తీసుకునేలా చూడాలి. రోజూ ఓ కప్పు పెరుగు కూడా ఇస్తే మంచిదే. చాక్లెట్లు బిస్కెట్లకు బదులు కూరగాయలను సలాడ్స్రూపంలో తింటుండేలా వారికి అందుబాటులో ఉంచాలి. వీటిని పిల్లలు చిరుతిండిలా నమలడం అలవాటు చేయండి. ప్రతిరోజూ ఉదయం రాత్రి గ్లాసెడు పాలు ఇవ్వండి. ఇలా వారు తినేది తక్కువైనా... అందులోనే సాధ్యమైనన్ని వెరైటీలు... తాజా పళ్లు, తృణధాన్యాలు ఉండేలా చూడండి. ఇచ్చే పదార్థాలన్నీ వాళ్లు ఇష్టంగా తినేలా చూడాలి. ఉదాహరణకు పిల్లలు పండ్లు తినకుండా మారాం చేస్తుంటే... వాటిని ఫ్రూట్ సలాడ్స్‌గా, కస్టర్డ్‌తో కలిపి పెట్టడం చేయండి. జ్యూస్‌గా తీసి ఇవ్వండి. పాలు తాగకపోతే మిల్క్‌షేక్‌గా మార్చి ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి. మాంసాహారం, చేపలూ (తినేవారైతేనే), లెగ్యూమ్స్ (దాల్స్), బాదాం, జీడిపప్పు, వాల్నట్ వంటి నట్స్ ఇవ్వాలి. వెన్న, నెయ్యి వంటి కొవ్వులుంటే ఆహారం ఎక్కువగా వద్దు. వెన్న, నెయ్యి లాంటి శాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలను రుచికోసం మాత్రం కొద్దిగానే తీసుకోవాలి. వేపుళ్లు కూడా అవాయిడ్ చేయాలి. రజస్వల అయ్యే వయసులోని అమ్మాయిలకు... అమ్మాయిలు సాధారణంగా తొమ్మిది, పదేళ్ల నుంచి పన్నెండు, పదమూడేళ్ల లోపే రజస్వల అవుతుంటారు. ఆ టైమ్‌లో కోల్పోయిన ఐరన్ భర్తీ చేసుకోడానికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమ్మాయిలకు ఇవ్వడం వుంచిది. అంటే వూంసాహారం తినేవాళ్లయితే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, గసగసాలు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ వచ్చే వుుందే ఇవ్వాలి. పీరియడ్స్ సమయంలో ఉప్పు, కొవ#్వలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వడాన్ని అవాయిడ్ చేయండి. ఆ సవుయంలో అవి తీసుకుంటే ఆడపిల్లలు వుందకొడిగా ఉంటారు. ఒకేసారి ఎక్కువగా ఆహారం ఇవ్వడానికి బదులుగా కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహరం ఇవ్వండి. పీరియడ్స్ సవుయంలో అమామయిలకు నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తుండండి. కౌమార యువత నుంచి మధ్య వయసు వచ్చే వరకు... పదహారు లేదా 18 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి 45 ఏళ్లు వచ్చే వరకు ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసేవే ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు బియ్యం విషయానికి వస్తే దంపుడుబియ్యం, ఇతర ధాన్యాల్లో పొట్టుతీయని ముడి ధాన్యాలు తీసుకోవాలి. అలాగే కూరల విషయంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) మంచివి. మాంసాహారంలో చేపలు చాలా మంచి ఆహారం. అయితే మాంసాహారం తీసుకునేవారు ప్రోటీన్ల కోసం రెడ్ మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. అరటి, నారింజ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటితో పాటు పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి. మేలు చేయని ఆహారాలు: కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. మిగతా జాగ్రత్తలు ►ఎముకలు గట్టిపడేలా విటమిన్–డి అందేలా రోజూ ఆరుబయట లేత ఎండలో/ సూర్యకాంతిలో నడవాలి ►ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లోని వారైతే... యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. ఎప్పుడూ సానుకూల ధోరణితో (పాజిటివ్ దృక్పథంతో) ఉండాలి ►రోజు శరీరం అలసిపోయేలా వ్యాయామం చేయాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి ►నిద్ర విషయానికి వస్తే కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. మధ్యవయస్కుల నుంచి వృద్ధాప్యపు తొలి దశ వరకు... ►మధ్య వయసు అయిన 45–48 ఏళ్ల నుంచి వృద్ధాప్యపు తొలి దశ అయిన 65–68 ఏళ్ల వరకు చాలా మందిలో ►డయాబెటిస్ ►హైబీపీ ►ఆర్థరైటిస్ ►గుండెజబ్బులు ►కొన్ని రకాల క్యాన్సర్లు ►మహిళల్లో హార్మోనల్ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ఒక వయసు దాటాక రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్ వంటివి కనిపిస్తుంటాయి. ఈ వయసులో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ►జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ప్రధానమైనవి... ►గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం... ►రోజూ ఆటలాడటం ►రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు రక్తదానం చేయడం ►గుండెకు ఆరోగ్యాన్నిచ్చే కార్డియో వ్యాయామాలు చేయడం ►కనీసం వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి ►ఇక రక్తపోటు విషయానికి వస్తే అది ఎప్పుడూ 120–130 / 70–80 ఎంఎం హెచ్‌జీ లోపు ఉండేలా చూసుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కోసం ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు వంటివి తినడం వంటి మంచి అలవాట్లు చేసుకోండి. ఒకవేళ మీ రక్తపోటు (డయాస్టోలిక్ ప్రెషర్) 90 కు మించి ఉంటే తక్షణం డాక్టర్‌ను సంప్రదించండి ►డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 70 ఏళ్లు వచ్చేవరకు ఆరోగ్యంగా గడపవచ్చు. 68 నుంచి 70 ఏళ్లు దాటిన వృద్ధుల విషయంలో... ఇక 68 ఏళ్ల నుంచి 70 ఏళ్లు దాటాక మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మాత్రం తరచూ హాస్పిటల్‌కు వెళ్లి ఏ టైమ్‌లో తీసుకోవాల్సిన వ్యాక్సిన్లను ఆ టైమ్‌లో తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు... అంతకు ముందు ఎప్పుడూ తీసుకోని వారు ఒక డోసు ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటితే మరోసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి ∙గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 70 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది) ∙అరవై లేదా డెబ్భై దాటాక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. డాక్టర్ రాహుల్ అగర్వాల్సీనియర్ జనరల్ ఫిజీషియన్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్,మాదాపూర్, హైదరాబాద్ -
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: సాకే
సాక్షి, అమరావతి: పేదలపాలిట సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. పేదలకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని నాశనం చేశారని శైలజానాధ్ మండిపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి దాదాపు రూ.477 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రానికి పట్టిన అనారోగ్యాన్ని బాగు చేసేందుకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీకి నైతిక విలువలు లేవన్నారు. చంద్రబాబు సీఎం కాగానే ఆయన ఆస్తులు 300 రెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. -
యోగాతో వత్తిడిని జయిద్దాం
చెన్నూరు : జీవన శైలిలో మార్పు తెచ్చుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక వత్తిడిని జయించి ఆరోగ్యంగా జీవిద్దామని మండల వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో శరీరానికి శ్రమ లేకుండా పోవడం, వ్యాయామం చేయడానికి సమయం కేటాయించక పోవడంతో వ్యాధులు పెరిగి పోతున్నాయన్నారు. తగినంత నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం పోషకాహారలోపం, దుర అలవాట్లు వల్ల అనారోగ్యపాలౌతున్నారని అన్నారు. అలసట, వత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సంగీతం వినడం, ఆహ్లాదకర వాతావరణంలో గడపడం, ద్యానం, యోగ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయన్నారు. వయస్సుతో పని లేకుండా రక్తపోటు, మధుమేహ వ్యాధి ఎక్కువ మందిలో ఉందని, దీనిని నివారించాలంటే, వ్యాయామం, ఆహారంలో అలవాట్లలో సమూల మార్పు రావాలన్నారు. ర్యాలీలో సీహెచ్ఓ భారతీ, హెచ్ఈ కుమారి, సూపర్వైజర్లు రవిస్వామి, నిర్మళ, వైద్య సిబ్బంది, మాదవి, కల్యాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
= మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన = వివరాలు వెల్లడించిన డీఎంహెచ్ఓ యాస్మిన్ ఒంగోలు సెంట్రల్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా కొనకనమిట్ల, సింగరాయకొండలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. జిల్లా స్థాయిలో సీఎస్‌పురం, రాజుపాలెం, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం విజయవాడలో సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు 8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, వాటిని కూడా ప్రారంభిస్తామని వివరించారు. ఒంగోలులో 4, చీరాలలో 2, మార్కాపురంలో 2 కేంద్రాలు చొప్పున ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ కేంద్రాల్లో కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్ఓ యాస్మిన్ వివరించారు. -
జయించు జీవించు
►ప్రపంచ జనాభాలో 4.4 శాతం ( 32.20 కోట్ల మంది) మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. ►ఇండియాలో 5.20 కోట్ల మంది కుంగుబాటు రుగ్మతతో బాధపడుతున్నారు. మనసు లేని బతుకొక నరకం.. మరువలేని మనసొక నరకం అన్నట్లు శరీరానికి తలనొప్పి, కడుపునొప్పి వచ్చినట్లే.. మనసుకూ బాధ కలిగితేమహాపరాధమేమీ కాదు. దాన్ని దాచి పెట్టుకుని.. మరింత పెంచుకుని బలైపోవడం కంటే బయటపడి కుంగుబాటును జయించి జీవించడం మంచిది. అందుకు విశ్వాసపాత్రులు, విజ్ఞానవంతులు, అనుభవజ్ఞులు సాయం పొందవచ్చు. మనిషిలో ఉన్న శతకోటి కోరికలు, బలహీనతల కారణంగా ఒక్కొక్కప్పుడు ప్రతి మనిషిలోనూ అసాధారణ ప్రవర్తన, సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తనా శైలి చోటు చేసుకుంటుంది. ఇది నిస్సందేహంగా కుంగుబాటే. ఇది తాత్కాలికం కావచ్చు.. కొంతకాలం ఉండొచ్చు. ఈ మానసిక రుగ్మతకు కూడా ఆస్పత్రులు ఉన్నాయి. చికిత్స పొందవచ్చు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్యదినోత్సవం. ఈ ఏడాది ఆరోగ్యదినోత్సవం సందర్భంగా తీసుకున్న థీమ్ డిప్రెషన్. దీన్నే కుంగుబాటు అంటారు. దీనిపై ప్రత్యేక కథనం. 1 పరీక్షలో ఉత్తీర్ణతసాధించలేకపోయాననే మనస్తాపంతో మదనపల్లెలో మార్చి 30న గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2 కుటుంబ కలహాలతో చంద్రగిరి నరసింగాపురానికి చెందిన బాలాజీ మార్చి 28న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ వయసు కేవలం 33 సంవత్సరాలు. అతడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది. 3 నాగలాపురం మండలం టీపీ పాళేనికి చెందిన సెల్వీ ముగ్గురు కుమారులతో సహా మార్చి 22న ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేయడంతోనే అఘాయిత్యానికి పాల్పడింది. చిత్తూరు, సాక్షి: పరీక్ష పాస్ కాలేదని ఒక రు, పాసైనా తక్కువ మార్కులొచ్చాయని ఇంకొకరు. వచ్చినా కోరుకున్న కాలేజీలో సీటు రాలేదని మరొ కరు.. క్యాంపస్ సెలెక్షన్లలో ఉద్యోగం రాలేదని.. ప్రేమ విఫలమైందని.. సఫలమైనా పెళ్లి వరకు వెళ్లలేదని .. అప్పుల బాధతో.. భర్త పుట్టింటికి పంలేదని.. పెంపుడు కుక్క కనిపించలేద ని .. ఇంట్లో చెల్లి రిమోట్ ఇవ్వలేదని.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ.. చాలా సందర్భల్లో çకుంగు బాటుకు గురై చావులోనే పరిష్కారం వెదుక్కుంటున్నారు. కుంగుబాటుతోనే అధికశాతం ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా కుంగుబాటుతోనే జరుగుతున్నాయి. ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులతో ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకోడానికి కూడా సమయం దొరకడం లేదు. దీంతో ఏదైనా అనుకోని ఆప ద ఎదురైనా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మానసికంగా మళ్లీ మామూలు మనిషిని చేయడానికి స్నేహితులు కూడా వారివారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలీక చాలా మంది సతమతం అవుతుం టారు. కొన్నిసార్లు పెద్ద సమస్య లేకపోయినా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతుండటం వల్ల ఆత్మహత్యలకు కారణం అవుతోంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు.. క్షణికావేశంలో చేసే పొరపాటు వల్ల కలిగే నష్టాలు అపారం. వీరిపై ఆధారపడి ఉన్న జీవితాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు, దిక్కుమొక్కులేని జీవితాన్ని వెళ్లదీస్తారు. కుటుం బాలు వీధిన పడతాయి. ఆర్థికంగా చితికిపోతాయి. తల్లిదండ్రులకు గుండెలు పగిలినంత శోకం ఎప్పటికీ ఉంటుంది. కుంగుబాటు అంటే.. నిరంతరం బాధ, ఆందోళన, ఎప్పుడూ నిరాశలోనే కూరుకుపోవడం, జీవితం నిస్సారం అనిపించడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చికాకు, కుదురుగా ఉండకపోవడం గతంలో ఆనందంగా అనిపించిన విషయాలే ఇప్పుడు నిరాసక్తంగా అనిపించడం నలుగురిలో కలవలేకపోవడం వంటి వి కుంగుబాటు లక్షణాలు. పోషకాహారలేమి.. డిప్రెషన్ రావడానికి కారణం పోషకాహారలేమి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పో షకం కంటే ఎక్కువ పోషకాల లోపం కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫాటీ ఆసిడ్ లోపం కార ణంగా డిప్రెషన్ కలుగుతుంది. మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యానికి ఈ ఆసిడ్లు చాలా అవస రం. అలాగే అమైనో ఆసిడ్ల లోపం కూడా మరో కారణం. మెదడు కీలకమైన విధులకు అమైనో ఆసిడ్లు చాలా అవసరం రోజు వారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. విటమిన్–బి లోపం తో డిప్రెషన్ కలుగుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 309 సెక్షన్ తొలగింపు.. భారతీయ శిక్షాస్మృతి 309 ప్రకారం ఆత్మహత్య చేసుకో వడం నేరం. ఈ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యకు పాల్పడి బతికినవారికి జైలు శిక్ష విధిస్తారు. దీన్ని తొలగించాలని 1971 నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బతకడంతో పాటు చావడంలోనూ విఫలమై తీవ్రంగా కుమిలి పోతున్న బాధితులపై నేరం మోపి శిక్షించడం అమానుషమని న్యాయ సంఘం సూచనలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ సంఘం సూచనల మేరకు ఇలాంటి కేసులను తీవ్ర మానసిక ఒత్తిడి పేరుతో నమోదు చేసుకుని మానసిక వైద్య నిపుణులతో చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేయాల్సింది ఇదీ.. కుంగుబాటు, ఆత్మహత్యలపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ మానసిక రోగులకు కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు రూపొందిం చాలి. దీనివల్ల కొన్ని మరణాలనైనా ఆపవచ్చు. యువకులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి కాబట్టి.. కళాశాల స్థాయిలో సైలకాలజీని ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెడితే ఉపయోగం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ రకాలివీ.. మేజర్ డిప్రెషన్, క్రానిక్ డిప్రెషన్, బైపోలార్ డిప్రెషన్, సీజనల్ డిప్రెషన్, సైకోటిక్ డిప్రెషన్, పోస్టు పార్టమ్ డిప్రెషన్, సీజన్ డిప్రెషన్,సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ మూడ్ డిసార్డ్ర్ (ఎస్ఐఎండీ), డిప్రెషన్ ముఖ్యమైనవి. వీటితోపాటు డబుల్ డిప్రెషన్, సెకండరీ డిప్రెషన్, ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్, మాస్క్డ్ డిప్రెషన్లు ఉన్నాయి. కుంగుబాటుతోనే ఆత్మహత్యలు ప్రతి లక్ష మందిలో వెయ్యి మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు. కుంగుబాటు కూడా మిగిలిన వ్యాధిలాంటిదే. ఈ వెయ్యి మందిలో వంద మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్ తగ్గిపోవడం వల్లనే కుంగుబాటు వ్యాధి వస్తుంది. న్యూరోట్రాన్స్‌మిట్టర్స్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ తాలూకా ఆదేశాలు తగ్గిపోతాయి. దీంతో జీవితం వ్యర్థం అనుకోవడం, ఆత్మన్యూనతా భావం, జీవితం అంతా అంధకారం అనుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులు లేకుండానే నివారించవచ్చు. కుంగుబాటుతో బాధపడేవారు తమకు ఉల్లాసాన్నిచ్చే వ్యక్తులు, వాతావరణంలో ఉంటే కొంత మేర ప్రయోజనం ఉంటుంది. –డాక్టర్ ఎన్.ఎన్రాజు, సైకియాట్రిస్ట్ -
మౌనమేలనోయి
సందర్భం : నేడు ప్రపంచ ఆరోగ్య దినం మనం అనుకున్నది నెరవేరకుంటే ఏదోలా ఉంటుంది. అది సహజం. అయితే దాని వల్ల జీవితం నిస్సారమైందని భావించకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. సరైన దృక్పథంతో ఆలోచించగలిగితే భవిష్యత్‌పై నమ్మకం పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని అంటున్నారు. జీవితం ఆశాజనకంగా కన్పించాలంటే ముందుగా మౌనం వీడాలని.. హాయిగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆత్మనూన్యత(డిప్రెషన్) తీవ్రత, దాని పర్యవసానాలను గుర్తించి ఈ ఏడాది ‘డిప్రెషన్‌పై మౌనం వీడండి..మాట్లాడండి’ నినాదంతో అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చింది. శుక్రవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - అనంతపురం మెడికల్ డిప్రెషన్ అనేది సర్వసాధారణమైన మానసిక సమస్య. 14 రోజులకు మించి రోజూ దిగులుగా ఉండడం, రోజువారీ దైనందిన కార్యక్రమాలపై ఆసక్తి తగ్గిపోవడం, శారీరక జబ్బు లేకపోయినా చిన్నచిన్న పనులకు త్వరగా అలసిపోవడం, నిద్రపట్టకపోవడం, ఆకలి మందగించడం, ధ్యాస లోపించడం, సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం, చిన్న విషయాలను సైతం విసుగు, కోపగించుకోవడం, జరిగిపోయిన ఘటనలకు సంబంధించి అతిగా పశ్చాత్తాపం చెందడం, తనకు తాను శిక్షించుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం... ఈ లక్షణాలు ఉంటే మనం డిప్రెషన్‌కు గురవుతున్నట్లే. డిప్రెషన్‌కు గురైతే.. – మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలవుతారు. – చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులకు గురవుతారు. – మందులకు లొంగని తలనొప్పి, వెన్నునొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి చర్మవ్యాధులు, ఇతర శారీరక జబ్బులు ఎక్కువ అవుతాయి. – వృత్తిపరంగా ధ్యాస లోపించి పని సామర్థ్యం తగ్గుతుంది. కుటుంబ కలహాలకు దారి తీస్తుంది. – కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో పాటు సమాజంలో ఉన్న వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. డిప్రెషన్ ఎందుకొస్తుంది? కోరికలు నశించడం, పని చేసే సామర్థ్యం కొరవడడం, నెగిటివ్ ఆలోచనలు, జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం, బాగా కావాల్సిన వారి ఆకస్మిక మరణం ఇతరత్రా కారణాల వల్ల డిప్రెషన్ ఏర్పడవచ్చు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి తమ చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది. ‘మాటలే’ పరిష్కారం డిప్రెషన్‌ను నివారించే ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల ఇది నయంకాదు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం, సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ వల్ల డిప్రెషన్‌ను అదుపు చేయవచ్చు. మానసిక వైద్య శాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో మానసిక జబ్బులకు కారణం ‘పాపం చేశారని, శాపం వంటిదని, తప్పులు చేసే వారికి సంక్రమిస్తాయని, చేతబడి, పీడ, దెయ్యం వంటికి పట్టాయన్న మూఢనమ్మకాలతో భూత వైద్యులు, మంత్ర వైద్యులకు చూయించుకునేవారు. ఈ క్రమంలో జబ్బు తీవ్రత పెంచుకుని ఏళ్ల తరబడి ఆలనాపాలనకు నోచుకోక గృహ నిర్బంధంలో మగ్గేవారు. కానీ ఇవన్నీ తప్పని, మానసిక సమస్యలకు మెదడులో కలిగే రసాయనాల ఒడిదుడుకులే కారణమని వైద్యశాస్త్రం నిరూపించింది. శారీరక జబ్బుల్లానే మానసిక జబ్బులు వస్తాయని తేల్చింది. మనసును బాగా చూసుకుంటే చాలా రకాల శారీరక జబ్బులను జయించవచ్చు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ‘మాట్లాడుకోవాలి’ అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలిలా... – డిప్రెషన్‌కు లోనైన వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. ఆ వ్యక్తికి సన్నిహింతంగా ఉంటూ విషయం ఏమిటో కనుక్కోవాలి. ఎప్పటి నుంచి అలా విచారంగా అనిపిస్తుందో అడగాలి. – వారి తలకు నూనె పట్టించి మసాజ్ చేయాలి – గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలని చెప్పాలి – ‘ఇంత చిన్న విషయానికి బాధపడతావెందుకు’ వంటి మాటలు చెప్పి వారిలో మానసిక స్థైర్యం పెంపొందించాలి. – చాలా సార్లు చెప్పినా భోజనం చేయకపోతే పక్కనే కూర్చుని మీ చేత్తో కలిపి తినిపించాలి. – బయట అలా తిరిగొద్దామనో, సినిమాకు వెళ్దామనో చెప్పి వెంట తీసుకెళ్లాలి సర్వజనాస్పత్రిలో కౌన్సెలింగ్ కేంద్రం డిప్రెషన్ అనేది పూర్తిగా నివారించదగిన సాధారణ మానసిక జబ్బు. మొదటి దశలోనే లక్షణాలను గుర్తించి ఆప్తులతో సమస్యను పంచుకోవాలి. లోలోపల కుమిలిపోకుండా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్ తీసుకోవాలి. రోజురోజుకూ పెరుగుతున్న మానసిక జబ్బుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో మానసిక జబ్బుల విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. ఆత్మహత్యల నివారణ కోసం కౌన్సెలింగ్ కేంద్రం ఉంది. – డాక్టర్ యెండ్లూరి ప్రభాకర్, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రి, సర్వజనాస్పత్రి, అనంతపురం 6 వేల మందికి పైగా ఆత్మహత్యాయత్నం : గత ఏడాది మన జిల్లాలో 728 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించి బయట పడిన వారు 6 వేల మంది వరకు ఉంటారని అంచనా. కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకునే వారిలో 90 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడి ‘చావే మార్గం’ అని భావించి చనిపోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని బట్టి డిప్రెషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మహత్యలకు కారణాలివీ.. కుటుంబ కలహాలు – 25 శాతం వ్యాధులు : 26 శాతం ప్రేమ వైఫల్యం : 3.2 మద్యపానం : 5.3 వరకట్నం :1.6 పేదరికం : 1.9 ఆర్థిక సమస్యలు : 2 తెలియని కారణాలు : 15 ఇతర సమస్యలు : 20 -
మానసిక కుంగుబాటు
►నలుగురు మహిళల్లో ఒకరికి డిప్రెషన్ ►బాధితుల్లో 67 శాతం మంది ఆత్మహత్యకు యత్నం.. ►మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం ►ఏప్రెల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వెరసి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దేశంలోని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు, పది మంది పురుషుల్లో ఒకరు డిప్రెషన్(మానసిక కుంగుబాటు)కు లోనవుతున్నారు. వీరిలో 67 శాతం మంది ఆత్మహత్యాత్నానికి పాల్పడుతుండగా, మరో 45 శాతం మంది మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నట్లు జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ(2015–16)లో వెల్లడైంది. అంతేకాదు ఇది ప్రత్యక్షంగా మనిషిని మానసికంగా కుంగదీయడమే కాకుండా పరోక్షంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, కేన్సర్లకు కారణమవుతున్నట్లు గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్ 7)సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఏటా ఒక థీమ్‌ను తీసుకుని, ఆ అంశంపై అవగాహన కల్పిస్తున్న విష యం తెలిసిందే. అయితే ఈ ఏ డాది ‘డిప్రెషన్–లెట్స్ టాక్’ అంశాన్ని థీమ్‌గా ఎంచుకోవడం విశేషం. కౌమార దశ నుంచే.. జనాభాలో 13 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు బాధితుల్లో 7.3 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. భార్యభర్తలు పిల్లలకు తగిన సమయం కేటాయించక పోవడం వల్ల వారు చిన్నతనంలోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు తేలింది. భయంతో చాలా మంది చికిత్సకు ముందుకు రావడం లేదు. ధైర్యంతో ముందుకు వచ్చిన వాళ్లకు కూడా నిపుణుల కొరత కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదు. యూరప్‌లో ప్రతి లక్ష మందికి 10 మంది మానసిక నిపుణులు ఉండగా, యూఎస్ఏలో 16 మంది ఉన్నారు. మన దేశంలో ఒక్కరే ఉండటం గమనార్హం. ఇద్దరూ పని చేయడం వల్లే భార్యభర్తల్లో చాలా మంది ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. వీరు ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతూ, పిల్లలకు కనీస సమయం కేటాయిం చడంలేదు. దీంతో వారు ఇంట్లో ఒంటరిగా ఉంటూ టీవీల్లో వచ్చే నేర ప్రేరేపిత ప్రసారాలను చూస్తూ వాటిని అనుసరిస్తున్నారు. చిన్న వయసులోనే మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నా రు. మానసిక కుంగుబాటు వల్ల చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – ప్రేరణ కోహ్లీ,ప్రముఖ సైక్రియాటిస్ట్, న్యూఢిల్లీ 6–9 గంటలు నిద్రపోవాలి ఒత్తిడిని జయించడం చాలా సులభం. ఏ విధమైన ఖర్చులేని, సహజ వ్యాయామమైన నడక. ప్రతి గంట నడక వ్యక్తి ఆయుఃప్రమాణాన్ని 3 నిముషాలు పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి 6 నుంచి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవటం తోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. బాధాకరమైన అనుభవాల నుంచి బయటపడేందుకు దోహద పడుతుంది. – డాక్టర్ శివరాజు, కిమ్స్ -
మితాహారం..ఆరోగ్యకరం
– ఘాటు వంటకాలతో చేటే – జిల్లాలో పెరుగుతున్న ‘ఫాస్ట్‌ఫుడ్’ కల్చర్ – ఊబకాయానికి దారి తీస్తుందంటున్న వైద్యులు – ఆకుకూరలు, కూరగాయలు తినాలని సూచన సందర్భం : నేడు ప్రపంచ ఆహార దినోత్సవం ఫాస్ట్ ఫుడ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కల్చర్ ఎక్కువైంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ వ్యాపారం ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఈ క్రమంలో ఏవి పడితే అవి తింటూ జనం అనారోగ్యం పాలవుతున్నారు. బతకడానికి ఆహారం అవసరమేనని, అయితే అది మితంగా ఉండాలంటున్నారు వైద్యులు. నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అధికమేతే అనర్థం సాయంత్రం వేళ వెచ్చగా ఉండాలని ఏదో ఒకటి తినడం ఇప్పుడు అలవాటుగా మారింది. కళాశాలకు వెళ్లొచ్చాక విద్యార్థులు.. ఆఫీసుల నుంచి వచ్చాక ఉద్యోగులు.. వ్యాపారస్తులు.. ఇలా ప్రతి ఒక్కరూ బయటి తిండికే అలవాటు పడుతున్నారు. ఏదో ఒకటి తింటూ పోతే శరీరం బొద్దుగా, అడ్డదిడ్డంగా మారి కొవ్వు పెరిగిపోతుందని డాక్టర్లు అంటున్నారు. పని ఒత్తిడిలో ఉన్నామనో.. ఏదో పొద్దు గడవడం లేదనో కొందరు కాస్త సేదదీరడానికి కాఫీలు, టీలతో పాటు ఐస్‌క్రీంలు, చిరుతిండ్లు తీసుకుంటారు. అప్పటికప్పుడు అవి ఉపశమనం కలిగించినా మన ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తాయి. ఊబకాయానికి ఫుడ్ అడెక్షనే ప్రధాన కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు పెరిగితే గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 30 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు రావడానికి ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్, బీపీ, ఆకలి మందగించడం, అల్సర్‌కు గురికావడంతో పాటు ఒత్తిడికి లోనవుతుంటారు. ఎంత ఆహారం తీసుకోవాలి? 25 ఏళ్లలోపు వయసు గల వారు 2500 కేలరీల శక్తి లభించే ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలో సమతుల్యత పాటించాలి. ఆరోగ్యంగా 60 కిలోలున్న వ్యక్తికి 1600 కేలరీల ఆహారం అవసరం. ఇందులో 60 శాతం కార్బోహైడ్రేట్లు, 15 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉండేలా చూసుకోవాలి. జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ సంస్కతి ప్రస్తుతం ఫాస్ట్‌ఫుడ్ సంస్కతి బాగా పెరిగిపోతోంది. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గ, గుత్తి, రాయదుర్గం.. ఇలా అన్ని పట్టణాల్లో వందల సంఖ్యలో సెంటర్లు ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో ఫాస్ట్‌ఫుడ్ తినే అలవాటు ఎక్కువైంది. మధ్యాహ్న భోజన సమయంతో పాటు సాయంత్రం ఇళ్లకు వచ్చాక ప్రైడ్‌రైస్, ఎగ్‌పఫ్, గోబీరైస్, సమోసా ఆరగించి కడుపునింపుకుంటున్నారు. పెద్దలు కూడా పకోడి, మిర్చి, కబాబ్స్, బజ్జీలు, గారెలు తదితర ఘాటు వంటకాలు తింటుంటారు. దీని వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఘాటు వంటకాలు తగ్గించుకోవాలని వైద్యులు అంటున్నారు. చైనీస్ వంటకాల్లో అధిక సోడియం తినే ఆహారంలో సోడియం అతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏ మాత్రం మోతాదుకు మించినా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనీస్ వంటకాలను తగ్గించుకోవాలి. వీటిలో సోయా, టమాటా సాస్‌ను వినియోగిస్తారు. అందులో సోడియం అధికంగా ఉంటుంది. పలురకాల చిప్స్, సాల్టెడ్ నట్స్‌లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోరాదు. మధ్యాహ్నం చపాతి, కొద్ది రైస్ తీసుకుంటే మేలు. రాత్రి కేవలం చపాతీతోనే సరిపెట్టుకోవాలి. రోజూ నిర్ణీత సమయంలో భోజనం చేయాలి. ఆకుకూరలు, కూరగాయలే మేలు అతిగా తినడం, ఏది పడితే అది భుజించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బయటి తిండి తిన్నప్పుడు ఒక్కో సారి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఫుడ్ పాయిజన్ అయితే ఇలాంటి ప్రభావం ఉంటుంది. బీపీ, షుగర్ వస్తాయి. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇవి రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. వ్యాయామం చేయాలి. కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లకు అలవాటు పడొద్దు. ఆయిల్ ఫుడ్‌తో ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. – డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఫిజీషియన్ (మెడికల్ కళాశాల ప్రిన్సిపల్), అనంతపురం -
గ్రామీణ వైద్యానికి గ్రహణం
విశ్లేషణ గ్రామీణ ప్రజలకు సంచార వైద్య సేవల (104) వంటి ఉత్తమ పథకం వైఎస్ మరణానంతరం అటకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజలకు మంచి చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని చెబుతున్నాయి. కాబట్టి అవి గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెట్టాలి. ఆసుపత్రుల ఫీజులు కట్ట లేని రోగి చావాల్సిందేనా? నేడు ఈ ప్రశ్న తరచుగా విన బడుతోంది. జవాబు ఇచ్చే వాళ్లే లేరు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య, వైద్య సేవల గురించి విశ్లేషిం చుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వాలు ఏటా కోట్లాది రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) కొంత మేరకు ప్రజ లకు ఆరోగ్య సేవలను అందిస్తున్నా గ్రామీణ ప్రజల ఆరోగ్యం సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య శాస్త్ర పట్టభద్రులు పల్లెల్లో వైద్యం చేయడానికి సిద్ధంగా లేరు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న పల్లెల్లోని ప్రజలకు ఈ అరకొర సదుపాయమూ అందుబాటులో లేదు. ఇక అంత సులువుగా చేరుకోలేని కొండకోనల్లోని ఆది వాసులకు రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. వారికి మలేరియా, అతిసార వంటి వ్యాధులేగాక మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ల వ్యాధులతో కూడా బాధపడుతుంటారు. అయినా వారు ఎలాంటి వైద్య పరీక్షలు ఎన్నడూ చేయించుకుని ఎరుగరు. కనుక వారికి తమ జబ్బుల గురించే తెలియదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్యశాఖ అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే, వైద్యం అవసరం రాదన్న అర్థం అందులో నిగూఢంగా ఉంది. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాథమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోతాయి. వైద్య రంగంపై ప్రభుత్వం, వ్యక్తులు చేసే ఖర్చు గణనీ యంగా తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం. ఈ సదుద్దేశంతోనే కొద్దికాలం క్రితం హెచ్ఎంఆర్ఐ అనే స్వచ్ఛంద సంస్థ కొంత కృషి చేసింది. సుదూర గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, నాటు వైద్యంపైనే ఆధారప డుతున్న ప్రజలకు సంచార వైద్య కేంద్రాల ద్వారా వారి గ్రామాలకే వెళ్లి, వైద్యసేవలను అందించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి వివరించింది. సంచార వైద్య కేంద్రాలు గ్రామీణ ప్రజానీకానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ జరిపి తగిన మందులిస్తే చాలా రోగాలకు సులువుగా సురక్షితమైన వైద్యాన్ని అందించవచ్చని, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా వారిని కాపాడవచ్చని తెలిపారు. స్వత హాగా వైద్యుడయిన నాటి ముఖ్యమంత్రి అలాంటి వైద్య సేవల ఆవశ్యకతను గుర్తించారు. అలా ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎంఆర్ఐ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. పీహెచ్‌సీలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు నెల నెలా వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందించే 104 సంచార వైద్య వాహనానికి రూపకల్పన చేశారు. ఇక 108 అంబులెన్స్ పథకం ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి ఎనభై రూపాయలే. వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్లో పది శాతం కన్నా తక్కువ. ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శించేది. ఈ వాహనంలో ఉండే మొత్తం ఏడుగురు సిబ్బంది గర్భిణులను, బాలిం తలను పరీక్షించి మందులు ఇచ్చేది. గర్భిణుల కడుపులో పిండం పెరుగుదలను బట్టి, తగు జాగ్రత్తలు సూచించేది. అవసరమని భావిస్తే 108 అంబులెన్స్‌ను రప్పించి రోగిని ఆస్పత్రిలో చేర్పించే వారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులున్న వారికి నెలవారీ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు తగు మార్పులు చేస్తూ అక్కడికక్కడే మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సవివరంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేవారు. ‘దర్వాజాలో దవాఖానా’ వంటి ఈ పథకం తదనంతర రాజకీయ పరిణామాల ఫలితంగా అర్ధంతరంగా అటకెక్కింది. దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం, వైఎస్ ఆకస్మిక మరణానంతరం కొందరి నిర్వాకాలకు, మరికొందరి స్వార్థాలకు బలైపోయింది. ఇంత అత్యుత్తమ పథకం మూలన పడినా అంతా ఏమీ జరగనట్టే ఉండటానికి కారణం... ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్న వారు నోరూవాయీ లేని నిరుపేదలు కావడమే. నిరక్ష రాస్యులైన వారి గురించి రాసేవారూ లేరు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. వారి దుర్భర జీవితాలు బుల్లి తెరలపైకీ ఎక్కవు. ఎందు కంటే అలాంటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉన్న అభాగ్యుల గోడు వినిపిస్తే చూపిస్తే రేటింగులూ పెరగవు. సమాజంలోని అట్టడుగు బడుగులకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పథకం పురిట్లోనే సంధికొట్టిన రీతిగా అదృశ్యమైంది. ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కథ. ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమదైన రీతిలో ప్రజలకు మంచి పనులు చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని పదేపదే చెబుతున్నారు. వారికి ఆ తపన ఉంటే అలాంటి ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తాం అనే సంస్థలకు కొదవలేదు. కాబట్టి ఇకనైనా రెండు తెలుగు ప్రభుత్వాలూ గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెడితే బాగుంటుంది. తుది పలుకు: పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలిచి చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే...’అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పింది నేటికీ వర్తించే వాస్తవం. రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు మొబైల్ : 98491 30595 -
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
-
ఆహారం... ఆరోగ్యం...
ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే థీమ్... ‘సురక్షితమైన ఆహారం’. మనం రోజూ ఎన్నో ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. సదరు ఆహారాల పట్ల మరెన్నో నమ్మకాలతో ఉంటాం. శాస్త్రీయంగా చూసినప్పుడు వాటిలో చాలావరకు అపోహలు... మూఢనమ్మకాలే. అందుకే ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా మనం ఆహారంగా స్వీకరించే అనేక అంశాల గురించి శాస్త్రీయమైన వాస్తవాలేమిటో తెలుసుకుందాం. అలా వాటి పట్ల నిజమైన అవగాహన కల్పించుకుంటే మంచి ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. అపోహలూ, మన సమాజంలో కొనసాగుతున్న అనేక నమ్మకాల వెనక ఉన్న శాస్త్రీయ అంశాలను తెలుసుకుందాం. అలా తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. పచ్చికూరలు ఆరోగ్యానికి మేలేనా? వాస్తవానికి పచ్చిగానే తినదగ్గ కూరగాయలూ, పచ్చికూరల రసాలు (క్యారట్, బీట్రూట్ వంటివి) ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఇటీవలికాలంలో ప్రతి పంటలోనూ రసాయన ఎరువులూ, పురుగుమందులూ వేయకుండా పండించడం లేదు. దాంతో పచ్చికూరగాయలు తినడం వల్ల లభించే పీచు (డయటరీ ఫైబర్), విటమిన్లు వంటి పోషకాల కంటే... వాటిపై ఉండే క్రిమిసంహారక మందుల వల్ల చేకూరే నష్టాలే ఎక్కువ. అందుకే ఒకవేళ పచ్చిగానే తినదగ్గ కూరగాయలు, వాటి రసాలతో ఆరోగ్య ప్రయోజనం పొందాలనుకునేవారు విధిగా వాటిని కొద్దిపాటి సోడా ఉప్పు (సోడియం బై కార్బొనేట్, మామూలు ఉప్పు (సోడియం క్లోరైడ్)లతో దాదాపు 5 - 10 నిమిషాలు కడగాలి. దాంతో క్రిమిసంహారక మందులు చాలావరకు తొలగిపోతాయి. ఇలా కడిగి తినడం వల్ల పచ్చిగానే తినదగ్గ కూరగాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేపాకు డయాబెటిస్‌కు మందు కాదు... చేదుగా ఉన్న ప్రతి ఒక్కటీ చక్కెర వ్యాధికి మందు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ అది ఎంతమాత్రమూ వాస్తవం కాదు. నిజానికి వేపలో చాలా ఔషధగుణాలు ఉన్న మాట వాస్తవం. కానీ వైద్యులు, పరిశోధకులు సరిగ్గా ఏ రసాయనం, ఏరకమైన ఔషధగుణాన్ని కలిగి ఉందో గుర్తించి, ఆ మందు కోసమే ఆ రసాయనాన్ని వాడుతుంటారు. అంతేగానీ... మనం ఎలాంటి విచక్షణ లేకుండా వేపాకులు నమలడం, వేప రసం తాగడం వల్ల... అందులోని ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలు మనలోని మేలు చేసే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే మనం క్రమం తప్పకుండా వేపాకును నములుతూ ఉంటే కీడు చేసే బ్యాక్టీరియా కూడా వేపలోని ఇన్సెక్టిసైడ్ గుణాలకు అలవాటు పడి, దాని పట్ల నిరోధాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇలా వేపను వాడటం వల్ల రెండురకాలుగా నష్టం చేకూరే ప్రమాదం ఉంది. కాకపోతే వేపను సమర్థంగా ఉపయోగించుకోవాలంటే ఒకపని చేయవచ్చు. కొన్ని చర్మరోగాలకు వేపాకును నూరి లేపనంగా (టాపికల్ మెడిసిన్‌లా) వాడుకోవచ్చు. కొన్నిసార్లు తలనొప్పులు వచ్చినప్పుడు వేపాకును కణతలకు రుద్దుకొని ఉపశమనం పొందడం మన పల్లెల్లో చూస్తూనే ఉంటాం. ఇలా వేపను పైపూతగా వాడుకోవడం ప్రమాదకరం కాదు. మాంసాహారం మంచిది కాదా? మతపరమైన, సామాజికపరమైన నమ్మకాల ఆధారంగా కాకుండా కేవలం సశాస్త్రీయంగా చూడాల్సిన అంశమిది. మాంసాహారం మంచిది కాదంటూ, చాలామంది శాకాహారంవైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వీరిలో అత్యధికులు విటమిన్-డి, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాలు ఏర్పడి, అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే పైన పేర్కొన్న పోషకాలు మాంసాహారంలోనే సమృద్ధిగా ఉంటాయి. ఇక విటమిన్ బి12 అయితే చాలావరకు మాంసాహారంతోనూ, కొంతవరకు పాలు, గుడ్లలో లభ్యమవుతుంది. మన మెదడునుంచి నరాల ద్వారా అన్ని అవయవాలకూ అందే ఆదేశాలన్నీ విటమిన్ బి12 ద్వారానే అందుతాయి. అందుకే విటమిన్ బి12 లోపం ఉన్నవారు మెదడునుంచి ఆయా అవయవాలకు ఆదేశాలు అందక ఒక్కోసారి స్పృహతప్పి పడిపోయే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలోనో, ఈతకొట్టే సమయంలోనో ఈ తరహా ప్రమాదం ఎదురైతే అది ప్రాణాంతకం కావచ్చు. ఒకవేళ ఇతర జీవులకు ప్రాణహాని తలపెడుతున్నామనే భావనతో ఉండేవారు, అన్ని ప్రాణులకూ జీవించే అవకాశం ఉందనీ అందువల్ల ఆహారం కోసం ఇతర ప్రాణులను చంపడం తప్పని భావించి శాకాహారం వైపు మళ్లిన వారు పై పోషకాల లోపాలను భర్తీ చేసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది అవిశగింజలను ఎక్కువగా వాడటం. వాటిని తప్పనిసరిగా రోజుకు ఒక చెంచాకు తక్కువ కాకుండా తినాలి. ఇవి ‘ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్’ను సమృద్ధిగా సమకూరుస్తాయి. మాంసాహార లోపాన్ని అవిశగింజలు (ఫ్లాక్స్సీడ్స్) చాలావరకు భర్తీ చేస్తాయి. కాఫీ నిజంగానే ఉత్తేజపరుస్తుందా, బరువు తగ్గిస్తుందా? మనలో చాలామందికి కాఫీ అలవాటే. కొందరికి అది లేనిదే రోజు గడవదు. కాఫీలోని కెఫిన్ వల్ల కొంత ఉత్తేజం కలిగే మాట వాస్తవమే. కెఫిన్లోని బీటా ఆక్సిడేషన్ క్రియ వల్ల కొంత కొవ్వు కూడా తగ్గే విషయమూ నిజమే. అందుకే పరుగుపందేలలో పాల్గొనాలనుకునేవారు కొవ్వు, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఇది చాలా అనారోగ్యకరమైన ప్రక్రియ. దీని వల్ల గుండె స్పందనల్లో లయ తప్పే (అరిథ్మియాసిస్ వచ్చే) అవకాశం ఉంది. శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయడం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. దీర్ఘకాలంలో దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉత్తేజం పొందడానికి, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఆశ్రయించడం సరైన పద్ధతి కానే కాదు. కాఫీలోని కెఫిన్ కంటే టీ లోని ఎల్-థయనైన్ కొంతవరకు మంచిది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. అయితే అది కాఫీ అయినా లేదా టీ అయినా రోజుకు రెండు నుంచి మూడు చిన్న కప్పులకు మించి తాగకపోవడమే మంచిది. తులసి ఆరోగ్యానికి మేలు అయితే... తులసీదళాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆసిమమ్ సాంక్టమ్ అనే పేరున్న తులసిలోని కొన్ని రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా, ద్రవరూపంలోనే ఉంచేలా చూస్తాయి. తులసిలోని ఈ గుణమే పరిశోధకులను తనవైపు ఆకర్షించేలా చేసింది. తులసిదళాలు వేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడవు. ఫలితంగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడటం వల్ల గుండెపోటు నివారితమవుతుంది. అలాగే మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షవాతం లాంటి జబ్బులనూ నివారించవచ్చు. పరిమితులివి... అయితే తులసీదళాలకు ఉన్న రక్తాన్ని పలచబార్చే గుణమే ఒక్కోసారి కొందరిలో ప్రాణాంతకం కావచ్చు. ఉదాహరణకు ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘థ్రాంబోసైటోపీనియా’ అంటారు. ఇలాంటి కండిషన్ ఉన్నవారు తులసిదళాలు తమకు మేలు చేస్తాయనే భావనతోనో, లేదా భక్తి కొద్దో తులసిని మిగతా ఆరోగ్యవంతుల్లాగా వాడటం సరికాదు. ఇక శస్త్రచికిత్స చేయించుకోబోయే వాళ్లు సైతం ఆపరేషన్‌కు ముందు తులసినీళ్లు తాగడం, తులసి ఆకులు తినడం మంచిది కాదు. దీనివల్ల ఆపరేషన్ సమయంలో ఆగకుండా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులు వాడేవారు తులసిని ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఔషధాలు రక్తాన్ని పలచబార్చే మందులు. వాటికి తులసి కూడా తోడైతే... ఏదైనా దెబ్బతగిలినప్పుడు రక్తస్రావం ఆగకుండా జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. అందుకే తులసి ఆకులను ఆరోగ్యం కోసం వాడేవారు జాగ్రత్తగా అప్పుడప్పుడూ ఒకటి, రెండు ఆకులకు మాత్రమే పరిమితం కావడం మేలు. వరి అన్నంతో డయాబెటిస్ వస్తుందా? వరి అన్నం తినడం వల్ల అందులోని పిండి పదార్థాల వల్ల డయాబెటిస్ త్వరగా వస్తుందని మన సమాజంలోని చాలా మందికి ఒక నమ్మకం. అందుకే డయాబెటిస్ లేని వాళ్లలో చాలామంది దాన్ని నివారించుకుంటున్నామనే భావనతో రాత్రివేళ గోధుమరొట్టెలు తింటుంటారు. అలా తినమంటూ తోటివారికి హితబోధ కూడా చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. తృణధాన్యాలన్నింటిట్లోనూ తక్షణం ఉపయోగించడానికి వీలైనది కాబట్టి జపాన్, కొరియా, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా, కొన్ని ఆఫ్రికా దేశాలు వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటాయి. ప్రపంచంలో 60 శాతం మంది వరిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నిజానికి వరి అన్నం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందా అన్న అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలిద్దాం. మనం ఏైవైనా ఆహారపదార్థాలను తిన్న తర్వాత వాటివల్ల రక్తంలో పెరిగే చక్కెర ప్రమాణాలను కొలతను గ్లైసీమిక్స్ ఇండెక్స్ (జీఐ) అంటారు. అంటే... దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర పాళ్లు అంత ఎక్కువన్నమాట. ఇలా కొలిచే సమయంలో జీఐ విలువ 70 కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువనీ, జీఐ విలువ 56 నుంచి 69 మధ్య ఉంటే అది మీడియం అనీ, జీఐ విలువ 55 లేదా అంతకంటే తక్కువ ఉంటే అది తక్కువనీ వర్గీకరిస్తారు. (జీఐ విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలు డయాబెటిస్ పేషంట్లకు అంత మంచిది కాదు). అయితే వేర్వేరు రకాల వరి, గోధుమల తాలూకు జీఐ విలువలివి... బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) 55 తెల్ల రైస్ (పొట్టుతీసిన బియ్యం) 64 ముడి గోధుమతో చేసిన రోటీలు 58 తెల్ల గోధుమపిండితో చేసిన బ్రెడ్ 71 దీన్నిబట్టి చూస్తే వరి, గోధుమల గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంచుమించూ సమానమే. ఇక కొన్ని రకాల గోధుమల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా వరి కంటే కూడా కాస్తంత ఎక్కువే. వరితో పోలిస్తే గోధుమలో పీచుపదార్థాలు ఎక్కువ. (అయితే అవి వరి, గోధుమల్లో వేర్వేరు రకాల మీద కూడా ఆధారపడి ఉంటాయి). కాబట్టి గోధుమలే తినాలని, డయాబెటిస్ వంటి రోగులు అవి తింటేనే మంచిదనే అపోహలు అవసరం లేదు. తమకు అలవాటైనదే సౌకర్యంగా తినవచ్చు. కాకపోతే వరి అన్నం తినే సమయంలో దాన్ని కూరలు, పప్పు, పులుసు, పెరుగు వంటి వేర్వేరు వాటితో కలిపి తింటున్నారనుకోండి. ఆ సమయంలో ఆహారం రుచిగా ఉంటే మనం ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామో మనకే తెలియకుండా కాస్త ఎక్కువగానూ తినే అవకాశం ఉంది. కానీ గోధుమతో చేసిన రోటీలు తినేసమయంలో వాటి సంఖ్యను బట్టి మనం ఎక్కువగా తింటున్నామా లేదా అన్న విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ పరిమితంగా తీసుకోగల నియంత్రణ శక్తి ఉంటే డయాబెటిస్ రోగులు సైతం తమకు అలవాటైన వరి అన్నాన్నే తినవచ్చు. ఇక వరి అన్నం దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశాలను కలగజేస్తుందన్న మాటలో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. జపాన్ దేశస్తులు వరి అన్నంతో పాటు చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఆయుఃప్రమాణం విషయంలో జపాన్ దేశస్తులే ఎక్కువ కాలం బతుకుతారన్న విషయం తెలిసిందే. (జపాన్ దేశస్తుల సగటు ఆయుఃప్రమాణం 87.6 ఏళ్లు). వరి అన్నంతో మనం చెప్పుకుంటున్నంత ప్రమాదమే ఉంటే జపాన్ దేశస్తుల ఆయుఃప్రమాణం అంత ఎక్కువగా ఉండేది కాదు కదా. కాబట్టి డయాబెటిస్‌కూ, వరి అన్నానికీ సంబంధం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మీరెంత సమర్థంగా డయాబెటిస్‌ను నివారించుకుంటున్నారు అన్న విషయం ప్రధానం. ఒకవేళ డయాబెటిస్ వచ్చి ఉంటే నడక, వ్యాయామం, వేళకు మందులు తీసుకోవడం, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ చక్కెరను ఎలా నియంత్రణలో ఉంచుకుంటున్నారన్నదే ముఖ్యం. మద్యం గుండెజబ్బులను రాకుండా ఆపుతుందా? పరిమితమైన మద్యం లేదా రెడ్‌వైన్ గుండెజబ్బులను నివారిస్తుందని ఇటీవల కొందరు వాదిస్తుండటం మనకు తెలిసిన విషయమే. నిజానికి మద్యంలో ఆ గుణమే ఉంటే డాక్టర్లందరూ దాన్ని సిఫార్సు చేసే వారే కదా. కానీ మద్యంలో అలాంటి గుణమేదీ లేకపోగా... అది మెదడు, నాడీవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలుఇలా ఎన్నో అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఆ అవయవాలతో నడిచే వ్యవస్థలను నాశనం చేస్తుంది. శరీరబరువు పెంచుతుంది. పైగా మద్యానికి ఉన్న అలవాటుపడే (అడిక్షన్) గుణం కారణంగా అది అన్ని విధాలా చేటే చేస్తుంది తప్ప... ఏ విధంగానూ ఆరోగ్యానికి దోహదం చేయదు. మద్యం గుండెజబ్బులను ఎంతమాత్రమూ నివారించలేదు సరికదా... ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు దోహదం చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. కోడిగుడ్డు పచ్చసొన వల్ల హాని తప్పదా? ఇటీవల చాలామంది కోడిగుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అందుకే అది ఆరోగ్యానికి హానికరం అని నమ్ముతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ అనేది ఒక రకం కొవ్వు. అందరిలోనూ కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం సరికాదు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే కోడిగుడ్డు పచ్చసొనను పరిహరించాలి. మిగతావాళ్లు నిరభ్యంతరంగా పచ్చసొనను వాడాలి. ఎందుకంటే ఈ కారణం వల్ల పచ్చసొనను పారవేస్తే... అందులోనే ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. అందుకే రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు మినహాయించి... చిన్నపిల్లలూ, యుక్తవయసులోకి వస్తున్న కౌమార బాలబాలికలు (అడాలసెంట్ యూత్), యువతీయువకులు, వృద్ధులు వారానికి నాలుగైదు గుడ్లు పూర్తిగా (పచ్చసొనతో) తినాలి. నిజానికి పచ్చసొనలో ఉండే ‘కొలైన్’ అనే పోషకం కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దాంతోపాటు ఐరన్, ఫాస్పరస్, ఐయోడిన్, సెలీనియమ్ వంటి ఖనిజలవణాలు, అన్నిరకాల విటమిన్లు... ఈ పచ్చసొనలోనే ఉంటాయి. ఎన్ని నీళ్లు తాగితే అంత ఆరోగ్యమా? నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యమంటూ చాలామంది చెబుతుంటారు. పైగా ఇలా నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు కడుక్కుపోతాయంటూ వివరణ కూడా ఇస్తుంటారు. ఇందులోని వాస్తవాలను శాస్త్రీయంగా పరిశీలిద్దాం. శరీరం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని వాడుకుంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా చేయడానికి, రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి, మలమూత్రాలతో పాటు, చెమట విసర్జన వంటి అంశాలకు నీరు చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు అది తాను నిర్వహించాల్సిన కార్యకలాపాలను మరచి... మూత్రరూపంలో త్వరగా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటుంది. (అందుకే ఎక్కువగా నీరు తాగినప్పుడు మూత్రం త్వరగా వచ్చేస్తుంటుంది). ఇలా బయటకు పోతూపోతూ శరీరంలోని సోడియం లవణాలను కూడా బయటకు తీసుకెళ్తుంటుంది. కాబట్టి శరీరంలో సోడియం లవణాలు తగ్గి ‘హైపోనేట్రీమియా’ అనే లవణాలు తగ్గిన కండిషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇది చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించి, ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితినీ కల్పించవచ్చు. వయసు పైబడ్డవారిలో తరచూ ఈ ‘హైపోనైట్రీమిక్ కార్డియోమయోపతి’ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఇక బీపీ మాత్రలూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీటిని ఎక్కువగా తాగినప్పుడు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ఏసీఎస్ఎమ్), కెనెడియన్ న్యూట్రిషన్ సొసైటీ వంటి ఎన్నో ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ఇక ఒక్కోసారి శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే అది కణాల్లోకి చొచ్చుకుపోయి కణాలను నాశనం చేయగలదు. దీన్నే ‘వాటర్ ఇంటాక్సికేషన్’ అంటారు. బరువు తక్కువగా ఉండే పిల్లలు, ఎండలో స్పోర్ట్స్ ఆడేవారు, నీళ్లు తాగడం వంటి పోటీలలో పాల్గొనేవారు, సైకోజెనిక్ పాలీడిప్పియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు)... అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కడుక్కుపోయి/కొట్టుకుపోయి మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మన సామెతను గుర్తుపెట్టుకుని అవసరమైనంత మేరకే నీళ్లు తాగాలి. మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి? కేవలం దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి మూత్రం మరీ తెల్లగా అంటే డిస్టిల్డ్ వాటర్లా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మూత్రం మరీ పచ్చగా వస్తోందంటే శరీరంలో నీరు తగ్గిందని అర్థం. కాబట్టి మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేలాగే నీరే తాగాలి ఒకసారి తాగినప్పుడు 100 ఎం.ఎల్. తాగడమే మంచిది వారి వారి శరీర బరువును బట్టి ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిది కాదు మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు, నీళ్ల విరేచనాలు అయ్యేవారు డాక్టరు సూచించిన మేరకే నీళ్లు తాగాలి. ఈ జబ్బులున్న వాళ్లు నీళ్లు తాగే విషయంలో డాక్టర్ సలహా తప్పక పాటించాలి. మీ సేవాభావం... కావాలి ఇతరులక ఆదర్శం! వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలే ప్రాతిపదిక. మీ ఎంట్రీలను పంపండి. మీ సేవా కార్యకలాపాల దృష్టాంతాలకు ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను పంపండి. చిరునామా: సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. డాక్టర్ భక్తియార్ చౌదురి, ఫిట్నెస్ నిపుణులు, హైదరాబాద్ -
గుండె దడదడ..నివారిద్దామిలా
న్యూఢిల్లీ: భారతీయుల్లో గుండె జబ్బులు అధికంగా వారసత్వంగా వస్తున్నాయి. ఈ క్రమంలో వయస్సుతో సంబంధం లేదు. వృద్ధులు మొదలు చిన్న, యుక్త వయస్సులో ఉన్న వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. వారసత్వం తోపాటు నిత్య జీవనశైలిలో పనిఒత్తిడి కారణంగా కూడా గుండె జబ్బులకు గురవుతున్నారు. వారంలో మూడు రోజులు వ్యాయామం తప్పని సరి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, నృత్యం, నడక ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పలువురు హృద్యోగ నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంంబర్ 29న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారు దేశప్రజలకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. గుండె జబ్బుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని అంటున్నారు. ఇంకా అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యాయమమే మేలు బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ నీరజ్ బల్లా మాట్లాడుతూ.. గుండె జబ్బుల నివారణకు ప్రతివారం సుమారు 150 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి. నడక లేదా ఈతకొట్టడంతోపాటు సైక్లింగ్, ఏరోబిక్ (ఆక్సీజన్ తీసుకోవడం) వ్యాయామం చేయాలి. దీంతో గుండె సంబంధ కండరాలు బలోపేతం అవుతాయి. వ్యక్తిగతంగా ఎవరి శరీర అవసరాలకు తగినట్లు వారు వ్యాయామాన్ని చేయాలి. అతిముఖ్యమైన విషయమేమిటంటే శరీరం మీద అధిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అలా అయితేనే జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా సాగుతోంది. అత్యధిక అధ్యయనాల్లో ఉపఖండంలోని ప్రజలు కార్డియోవస్కులర్ డిసీజెస్(సీవీడీ)తోపాటు మదుమేహం(డయాబటిక్)తో కూడా సతమతమవుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. 2.25 మిలియన్లకు చేరిన మరణాలు వివరాలిలా ఉన్నాయి... అత్యధికంగా భారతదేశంలో గుండె జబ్బుల కారణంగా 2.25 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2015లో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2.94 మిలియన్లకు చేరింది. ఇప్పటికీ గుండె వ్యాధుల తీవ్రత,దాని ప్రభావాన్ని ప్రజలు గుర్తించడం లేదని నిపుణులు అంటున్నారు. విదేశాల్లోనూ భారతీయులే ‘వాస్తవమేమిటంటే భారతీయులకు గుండెజబ్బులు ఎక్కువగా వారసత్వంగా వస్తున్నాయి. అది కూడా అతి చిన్న వయస్సులోనే వస్తున్నాయని ఇంటర్నేషనల్ కాడ్రియాలోజిస్టు, నోయిడాలోని జయపీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ గుంజాన్ కపూర్ చె ప్పారు. అదే విధంగా విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ స్థానికులకన్నా అధికంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. బ్రిటన్, యూఎస్, ఆఫ్రికా ఇంకా పలు దేశాల్లో ఉన్న భారతీయులు స్థానికులకన్నా అధికంగా గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని కపూర్ చెప్పారు. ప్రజల్లో చైతన్య తేవాలి ‘ఘజియాబాద్‌లోని కొలంబియా ఆస్పత్రి చీఫ్ హృద్రోగ నిపుణుడు అనిల్ బన్సల్ మాట్లాడుతూ..ప్రజల్లో ఉన్న అవగాహనా రాహిత్యం కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది. ఇందుకు పరిష్కారం ఒక్కటే..గుండె జబ్బుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. అవసరమైన సమాచారం, శాస్త్రీయ పరిజ్ఞానానికి మధ్య ఉన్న దూరాన్ని అధిగమించాల్సి ఉంది. జీవనశైలిలో ప్రజలు తమ అలవాట్లను మార్చుకొనేలా చైతన్యం చేయాలి. ఆరోగ్య సంరక్షణ పట్ల ముందస్తు శ్రద్ధ తీసుకొనెలా చూడాలి. అత్యవసర సమయాల్లోనే డాక్టర్లను సంద్రించే పద్ధతి మంచిదికాదు, ముందుగా దాన్ని ప్రజల మనస్సుల్లో నుంచి తొలగిపోవడానికి అవసరమైన చర్యలు, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అవగాహన కల్పించాలి శ్రీకాంత్ కేవీ..బెంగళూర్‌లోని నారాయణ హెల్త్ సిటీకి చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు శ్రీకాంత్ కేవీ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ముందుగా ఒక గ్రూపును ఎంచుకొని గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే చిన్నారులకు గుండు జబ్బులపై అవగాహన కల్పించాలి. అదేవిధంగా యువత, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని చేపట్టాలి. ప్రజలు పనిచేసే చోట, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించాలి. ఇందులో అంగన్ వాడీ వర్కర్ల బాధ్యత కీలకంగా ఉండేలా చూడాలని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గుర్గావ్లోని పరాస్ ఆస్పత్రి కార్డియాలజిస్టు తపన్ ఘోష్ మాట్లాడుతూ.. అర్బనైజేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ఉబకకాయంతోపాటు మద్యం, పొగ తాగడం, అధిక ఒత్తిడి, మదుమేహంతోపాటు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు రావడానికి ప్రధాన కారణాలని చెప్పారు.