పేదలపాలిట సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు
సాక్షి, అమరావతి: పేదలపాలిట సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. పేదలకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని నాశనం చేశారని శైలజానాధ్ మండిపడ్డారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి దాదాపు రూ.477 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రానికి పట్టిన అనారోగ్యాన్ని బాగు చేసేందుకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీకి నైతిక విలువలు లేవన్నారు. చంద్రబాబు సీఎం కాగానే ఆయన ఆస్తులు 300 రెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.