ఏప్రిల్ 7..వరల్డ్ హెల్త్ డే ...‘‘అవర్ ప్లానెట్.. అవర్ హెల్త్’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే అనే విషయాన్ని గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. రోజు రోజుకి ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కాలుష్య భూతాన్ని అడ్డు కోవడం, పారిశుధ్య లేమి, క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ మన ఆరోగ్య రక్షణలో భాగమే. మెరుగైన ఆరోగ్య ప్రపంచం నిర్మాణ ధ్యేయంతో ప్రతీ ఏడాది స్పెషల్ థీమ్‌తో వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం.
ఈ భూప్రపంచం, భూమ్మీద ఉన్న మనుషుల ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO తొలి సమావేశంలో నిర్ణయించారు. అలా 1950 నుండి ఏప్రిల్ 7న తొలి వరల్డ్ హెల్త్ డేని నిర్వహించారు. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచ నిర్మాణం అనే నినాదంతో మానవులను, భూమాతను ఆరోగ్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరించడం అన్నమాట. ఇక 2022 సంవత్సరానికి సంబంధించి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనే థీమ్‌తో వరల్డ్ హెల్త్ డేని పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజారోగ్య సమస్యలపై అవగాహనకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం ఆనవాయితీ.
గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన నేపథ్యంలో 2021లో ‘మన ఆరోగ్యం మన బాధ్యత’ అనే స్లోగన్‌తో వరల్డ్ హెల్త్ డేని నిర్వహించుకున్నాం. అయితే కోవిడ్-19 కారణంగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, విటమిన్లు, పోషకాలపై శ్రద్ధ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాధులనుంచి తప్పించుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారంపై ప్రత్యేక దృష్టి మొదలైంది. కానీ దీనికి చాలా కాలం ముందునుంచే ఆహారం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వాటినెలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
కరోనాకి తోడు ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, న్యుమోనియా, ఆస్తమా, ముప్పు పెరిగింది.ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు నివారించ దగిన పర్యావరణ కారణాల వల్ల సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది. మానవాళి ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ఆరోగ్య ముప్పు వాతావరణ సంక్షోభం. ఇదే ఆరోగ్య సంక్షోభానికీ దారి తీస్తుందనేది అని మనం గమనించాలి.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం, క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో, మనం నివసిస్తున్న భూగ్రహాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ కాలుష్య నివారణపై ప్రతీ పౌరుడు ఆలోచించడం చాలా అవసరం. ప్లాస్టిక్‌ని నిషేధం, సహజ అటవీ, నీటి వనరుల రక్షణ కీలకం. వాయు కాలుష్యం, కలుషిత నీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతోపాటు, పారిశుద్ధ్య లేమి, కొన్ని ప్రమాదకర రసాయనాలు, క్లైమేట్ చేంజ్ ప్రతికూల ప్రభావాలు అత్యంత ప్రమాదకర మైన ముప్పు అనేది గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణకోసం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మనమందరం పునరంకితం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment