Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా? | Disease X: WHO Investigation On Mysterious flu like illness in Congo | Sakshi
Sakshi News home page

Disease X: డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?

Published Tue, Dec 10 2024 3:29 PM | Last Updated on Tue, Dec 10 2024 3:46 PM

Disease X: WHO Investigation On Mysterious flu like illness in Congo

అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి  31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్‌ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్‌వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్‌ (Disease X)గా పరిగణిస్తున్నారు.

ఏమిటీ డిసీజ్‌ ఎక్స్‌
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్‌ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్‌ ఎక్స్‌’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్‌ సరసన జాబితాలో చేర్చింది.

అయితే.. డిసీజ్‌ ఎక్స్‌కు ఏ వైరస్‌ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్‌ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్త: డిసీజ్‌ ఎక్స్‌ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..

ఆలోపు వ్యాక్సిన్‌ సిద్ధం!
డిసీజ్‌ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్‌లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?
మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

కాంగో కొత్త వ్యాధి లక్షణాలు

  • జ్వరం

  • తలనొప్పి

  • దగ్గు,జలుబు

  • ఒళ్లు నొప్పులు


అయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే   వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్‌ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్‌ ఎక్స్‌ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement