planet
-
గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!
భూమి మినహా ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా? కోట్లాది నక్షత్ర మండలాలు, తారాతీరాలు, గ్రహాలు... సుదూరాన ఇలా ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి పరిఢవిల్లుతోందా? భూమి కాకుండా ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై జీవరాశి జాడ తెలుసుకోవడమెలా? జీవులకు ఆవాసయోగ్యమైన భౌమ్యేతర ప్రదేశాలను కనిపెట్టడమెలా? జీవం ఉనికి, జీవుల మనుగడకు సంబంధించి సానుకూల పరిస్థితులతో ఆశలు రేకెత్తిస్తున్న ప్రదేశాలు మన సౌరకుటుంబంలో ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ సాగాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? ఈ అన్వేషణకు ఒక సరైన, అత్యుత్తమ ప్రదేశమేదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఈ నెల 10న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. జలం మూలం ఇదం జీవం! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. యూరోపాపై ఏకంగా ఓ భారీ సముద్రమే ఉంది! దాని అడుగుభాగం శిలానిర్మితమని, ప్రాణుల మనుగడకు అవసరమైన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. ఈ ‘బిల్డింగ్ బ్లాక్స్’ యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉంటాయని; తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ మూలకాలను దానిపై విడిచిపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీది సమస్త శక్తికీ సూర్యుడే ఆధారం. కిరణజన్యసంయోగ క్రియతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం ద్వారా మానవులు, జంతువులకు శక్తి బదలాయింపు జరుగుతుంది. కానీ యూరోపాలోని మహాసముద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని భావిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగానే రసాయన చర్యల వల్ల యూరోపాలోని సముద్రంలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని ఊహిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలా కాలం గడిచి ఇక జీవం పుట్టే సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా అక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న ప్రదేశం యూరోపానే!యూరోపా.. ఆశల లోకం!జీవాన్వేషణలో ‘నాసా’ యూరోపాను ఎంచుకోవడానికి కారణాలు బోలెడు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో తన టెలిస్కోపుతో కనుగొన్నారు. ఆ గెలీలియన్ మూన్స్ పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో యూరోపా మన చంద్రుడి సైజులో ఉంటుంది. యూరోపా ఓ ‘ఐసీ మూన్’. దాని ఉపరితలం మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 5-40 కిలోమీటర్లు. మంచు పొర కింద 50-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. మన భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని ఆ మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపా ఉపరితలంపై పెద్ద సంఖ్యలో పగుళ్లు, కొద్దిపాటి బిలాలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా దాని ఉపరితలం భౌగోళికంగా క్రియాశీలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి కానే కాదు! అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వబోవటం (డ్రిల్ చేయడం) లేదు. అలాగే అక్కడి మహా సముద్రం లోపలికి చొచ్చుకెళ్లి పరిశీలించబోవడం లేదు కూడా. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవుల ఆవాసానికి అవసరమైన నివాసయోగ్యతా సామర్థ్యం యూరోపాకు ఉందా? ఆసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును నాసా చేపడుతోంది. భవిష్యత్ మిషన్లకు అవసరమయ్యే ముఖ్య సమాచారాన్ని యూరోపా క్లిప్పర్ నౌక సంపాదించబోతోంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిరులు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి నిటారుగా పైకి లేస్తున్న నీటి ఆవిరులు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్.. అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్! గ్రహాంతర అన్వేషణ కోసం ‘నాసా’ ఇప్పటివరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక బరువు 6 టన్నులు. ఇందులో ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో 9 శాస్త్రీయ పరికరాలు అమర్చారు. యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ వాటిలో ఉన్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ నౌక ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే! బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువగా (77 కోట్ల కిలోమీటర్లు) ఉంటుంది. సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక సూర్యకిరణాలు కూడా బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, ఆ డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. తక్కువ ఇంధనం వినియోగం నిమిత్తం తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని ‘యూరోపా క్లిప్పర్’ ఉపయోగించుకుంటుంది. ఐదున్నరేళ్లు సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2030 ఏప్రిల్‌లో ‘యూరోపా క్లిప్పర్’ గురుగ్రహం కక్ష్యను చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోమారు గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ ప్రమాదం మెండు. అందుకే క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటు చేశారు. యూరోపాలో మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, దాని లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టాలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్ కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. అయితే, హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను తాకే అవకాశమున్నందున యూరోపా క్లిప్పర్ ప్రయోగం వాయిదా పడొచ్చు. కానీ, నాసా మాత్రం ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. -జమ్ముల శ్రీకాంత్.(Courtesy: NASA, The New York Times, Space.com, Astrobiology News, TIME, CNN, Business Standard, DNA, Mint, The Economic Times, Hindustan Times). -
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
ఆ గ్రహంపై అధిక ఉష్ణోగ్రతలు.. తుఫాను గాలులు, రాళ్ల వర్షాలు
కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు రెండు గ్రహాలను కనుగొన్నారు. ఈ గ్రహాలు మిగిలిన గ్రహాల కన్నా భిన్నంగా ఉన్నాయి. వాటి పరిమాణం బృహస్పతి గ్రహానికి సమానంగా ఉంది. ఈ రెండు గ్రహాలు మన పాలపుంత గెలాక్సీలో వాటి నక్షత్రానికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అక్కడి అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతాయని, ఈ గ్రహాల్లో ఒకదానిపై ఆవిరితో కూడిన రాళ్ల వర్షం కురుస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తీవ్రతకు టైటానియం వంటి శక్తివంతమైన లోహాలు కూడా కరిగి ఆవిరైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత, విశిష్ట రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో వైవిధ్యాన్ని కూడా తెలుసుకోవచ్చంటున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రిపోర్టులో శాస్త్రవేత్తలు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించామని తెలిపారు. ఈ గ్రహంపైగల వాతావరణంలో సిలికాన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది. ఈ గ్రహంపై పగటిపూట మేఘాలు ఉండవని, అయితే రాత్రిపూట గంటకు రెండు వేల మైళ్ల వేగంతో తుఫాను గాలులు వీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీనితో పాటు, ఈ గ్రహంలోని ఒక భాగం ఎల్లప్పుడూ దాని నక్షత్రం వైపు ఉంటుంది. ఈ గ్రహానికి అవతలి వైపున ఉన్న సిలికాన్ మోనాక్సైడ్ చాలా చల్లగా ఉండడం కారణంగా మేఘాల నుంచి నీరు వెలువడేందుకు బదులుగా రాళ్ల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఈ గ్రహం మీద ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల రాళ్లు కూడా ఆవిరిగా మారుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొదటిసారి సిలికాన్ మోనాక్సైడ్ ఇలాంటి రూపంలో కనిపించింది. మరొక అధ్యయనం ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. దీనిలో అత్యంత వేడి వాతావరణం కలిగిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారనిపేర్కొన్నారు. 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి కేఈఎల్టీ-20బీ అని పేరు పెట్టారు. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్..
వాషింగ్టన్: భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఓ ఎర్రని మరుగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కెప్లర్–138సి, కెప్లర్–138డి అనే రెండు గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇందులో వింతేముందంటారా? పరిమాణంలో భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవైన ఇవి రెండూ దాదాపుగా నీటితో నిండి ఉన్నాయట! నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ వీటి ఉనికిని బయట పెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలికగా, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కనుక అది కచ్చితంగా నీరే అయి ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి! దీనికి సంబంధించి నేచర్ ఆ్రస్టానమీ జర్నల్‌లో లోతైన అధ్యయనం పబ్లిషైంది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
కాస్త ఆ గ్రహం తాలూకు వివరాలివ్వండీ ప్లీజ్!
నమస్తే సార్.. కాస్త ఆ గ్రహం తాలూకు వివరాలివ్వండీ ప్లీజ్! -
ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామా? మరి మన ప్లానెట్ పరిస్థితి ఏంటి?
ఏప్రిల్ 7..వరల్డ్ హెల్త్ డే ...‘‘అవర్ ప్లానెట్.. అవర్ హెల్త్’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే అనే విషయాన్ని గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. రోజు రోజుకి ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కాలుష్య భూతాన్ని అడ్డు కోవడం, పారిశుధ్య లేమి, క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ మన ఆరోగ్య రక్షణలో భాగమే. మెరుగైన ఆరోగ్య ప్రపంచం నిర్మాణ ధ్యేయంతో ప్రతీ ఏడాది స్పెషల్ థీమ్‌తో వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం. ఈ భూప్రపంచం, భూమ్మీద ఉన్న మనుషుల ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO తొలి సమావేశంలో నిర్ణయించారు. అలా 1950 నుండి ఏప్రిల్ 7న తొలి వరల్డ్ హెల్త్ డేని నిర్వహించారు. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచ నిర్మాణం అనే నినాదంతో మానవులను, భూమాతను ఆరోగ్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరించడం అన్నమాట. ఇక 2022 సంవత్సరానికి సంబంధించి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనే థీమ్‌తో వరల్డ్ హెల్త్ డేని పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజారోగ్య సమస్యలపై అవగాహనకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన నేపథ్యంలో 2021లో ‘మన ఆరోగ్యం మన బాధ్యత’ అనే స్లోగన్‌తో వరల్డ్ హెల్త్ డేని నిర్వహించుకున్నాం. అయితే కోవిడ్-19 కారణంగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, విటమిన్లు, పోషకాలపై శ్రద్ధ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాధులనుంచి తప్పించుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారంపై ప్రత్యేక దృష్టి మొదలైంది. కానీ దీనికి చాలా కాలం ముందునుంచే ఆహారం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వాటినెలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనాకి తోడు ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, న్యుమోనియా, ఆస్తమా, ముప్పు పెరిగింది.ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు నివారించ దగిన పర్యావరణ కారణాల వల్ల సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది. మానవాళి ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ఆరోగ్య ముప్పు వాతావరణ సంక్షోభం. ఇదే ఆరోగ్య సంక్షోభానికీ దారి తీస్తుందనేది అని మనం గమనించాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం, క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో, మనం నివసిస్తున్న భూగ్రహాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ కాలుష్య నివారణపై ప్రతీ పౌరుడు ఆలోచించడం చాలా అవసరం. ప్లాస్టిక్‌ని నిషేధం, సహజ అటవీ, నీటి వనరుల రక్షణ కీలకం. వాయు కాలుష్యం, కలుషిత నీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతోపాటు, పారిశుద్ధ్య లేమి, కొన్ని ప్రమాదకర రసాయనాలు, క్లైమేట్ చేంజ్ ప్రతికూల ప్రభావాలు అత్యంత ప్రమాదకర మైన ముప్పు అనేది గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణకోసం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మనమందరం పునరంకితం కావాలి. -
ప్రకృతిని పరిరక్షించుకోకపోతే విపత్తులు తప్పవు
హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో ఒక రంగు మాత్రమే ఉంటే? భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే? అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా? నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది! వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు! కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు. ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా... వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ తదితరాల పేరుతో.... అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు! వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సిద్ధం చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020 చెబుతున్నది ఇదే! కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్1ఎన్1 కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు. ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్–19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పరిశీలించిన వాటిల్లో మూడింట రెండు వంతుల జంతుజాలం క్షీణావస్థలో ఉంది. మొక్కల విషయానికొస్తే... ప్రతి ఐదింటిలో ఒకటి అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. గత ఏడాది ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవులనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆరుసెకన్లకు రెండు ఎకరాల చొప్పున నష్టపోయామని నివేదిక తెలిపింది. అడవులు నరికివేసి వ్యవసాయం చేయడం మొదలుకొని నదీజలాల కాలుష్యంతో జలచరాలకు ముప్పు తేవడం వరకూ అన్నింటి ఫలితంగా భూమి ఇప్పుడు అత్యవసర సాయం కోరుతూ ఆక్రందనలు చేస్తోందని వివరించింది. ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోతే ఇంకో పదేళ్లలో సరిచేసుకునేందుకు వీలు కానంత పెద్ద ప్రమాదంలో పడతామని హెచ్చరించింది. అయితే ఇప్పటికైనా పరిస్థితి మించిపోలేదని, దేశాలన్నీ కలిసికట్టుగా పచ్చ‘ధనం’ పండిస్తే.. వినియోగం విషయంలో మనల్ని మనం మార్చు కోగలిగితే భూమి మరికొన్ని కాలాలపాటు పచ్చగా ఉండేందుకు అవకాశం లేకపోలేదని చెబుతోంది ఈ నివేదిక. ఇవీ కారణాలు భూ వినియోగంలో మార్పులు. అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతూ ఉండటం, జంతుజాలాల ఆవాస యోగ్య ప్రాంతాలు కుంచించుకుపోవడం జీవవైవిధ్యం తగ్గుదలకు ఒక కారణం. ప్రకృతి వనరుల విచ్చలవిడి వాడకం రెండో కారణం. ఇన్వేసివ్ స్పీషీస్ (ఇతర జీవావరణాల నుంచి వచ్చిన జంతువులు, పక్షులు, మొక్కలు) మూడో కారణం. నాలుగవ, ఐదవ కారణాలుగా కాలుష్యం, వాతావరణ మార్పులను పేర్కొనవచ్చు. భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జీవ వైవిధ్యతలో తగ్గుదలకు ప్రధానంగా వాటి ఆవాస ప్రాంత నష్టం కారణం కాగా.. ఇన్వేసివ్ స్పీషీస్, వ్యాధులు, అతి వాడకం ఇతర కారణాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌లో నగరీకరణ, వ్యవసాయ కార్యకలాపాలు, కాలుష్యం వంటి కారణాల వల్ల చిత్తడి నేలలు దాదాపు లేకుండా పోయాయని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అటవీ ప్రాంతాలు తగ్గడంతో జంతు సమూహాల్లోని సంఖ్య కూడా తగ్గిపోతోందని, ఇది కాస్తా సంతానోత్పత్తిపై ప్రభావం చూపడంతోపాటు వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతోందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది భారత్‌లో అటవీ భూములను ఇతర అవసరాల కోసం మళ్లించాలన్న అభ్యర్థనలు దాదాపు 240 వరకూ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాగా.. సుమారు 99 శాతం ప్రతిపాదనలకు అనుమతి లభించిందని ఈ నివేదిక తెలిపింది. సమీకృత విధానంతోనే పరిష్కారం... వేగంగా తగ్గిపోతున్న జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించాలన్నా, తద్వారా మానవ మనుగడను మరింత సుస్థిరం చేసుకోవాలన్నా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఆహార ఉత్పత్తిని, వాణిజ్యాన్ని మరింత ప్రకృతి అనుకూలమైన పద్ధతుల్లో చేపట్టడం ఇందులో ఒకటి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో కనీసం మూడో వంతు వృథాగా చెత్తబుట్టల్లోకి చేరుతుండటం జీవవైవిధ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ వృథా కారణంగా గాల్లోకి చేరుతున్న విషవాయువులు వైమానిక రంగ ఉద్గారాల కంటే ఎక్కువగా ఆరు శాతం వరకూ ఉండటం గమనార్హం. ఆహార రంగం ద్వారా వెలువడుతున్న విషవాయువుల్లో 24 శాతం సరఫరా నష్టాలు, వినియోగదారులు వృథా చేయడమేనని నివేదిక తెలిపింది. ఈ నష్టాలన్నింటినీ తగ్గించుకోగలిగితే జీవవైవిధ్యం పెంపునకు తోడ్పడినట్లే. భారత్ విషయానికి వస్తే.. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో వృథా అవుతున్నది దాదాపు 40 శాతం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివి ఈ నష్టాన్ని 10 నుంచి 15 శాతంగా మాత్రమే చెబుతున్నా అంతర్జాతీయ సంస్థలు 40 శాతంగా లెక్కవేస్తున్నాయి. జంతుజాలాన్ని, ప్రకృతిని పరిరక్షించడం జీవవైవిధ్యం కోసం కీలకమైనప్పటికీ కేవలం ఈ చర్యల ద్వారా మాత్రమే పరిస్థితిని పారిశ్రామిక విప్లవం మునుపటి స్థాయికి తీసుకువెళ్లలేమని వీటికి ఇతర అంశాలూ కూడా జోడిస్తేనే మేలు జరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. -
నాసా గుప్పిట్లో ఆ గ్రహం గుట్టు..!
వాషింగ్టన్ : అంతరిక్షంలో భూమిని పోలిన నివాసయోగ్యత కలిగిన గ్రహానికి అన్వేషణ సాగించే పరిశోధనలకు ఊతమిచ్చేలా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మొదటిసారిగా భూమిని పోలిన పరిమాణం కలిగిన గ్రహాన్ని కనుగొన్నారు. ఈ ప్లానెట్‌లో ద్రవ నీరు ఉనికిని గుర్తించారు. మరొక సానుకూల అంశంగా ఈ గ్రహం మన సౌర వ్యవస్థకు సమీపాన ఉండటం వెలుగులోకి వచ్చింది. నాసాకు చెందిన గ్రహాల అన్వేషణ విభాగం ఇటీవల జరిగిన అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశం సందర్భంగా ఈ వివిరాలు వెల్లడించింది. ఈ గ్రహం మన నుండి 100 కాంతి సంవత్సరాల కన్నా ఎక్కువ దూరంలో లేని ఒక నక్షత్రం (టీఓఐ 700) చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించింది. ఈ నక్షత్రం చుట్టూ తిరిగే మూడు గ్రహాల్లో ఈ గ్రహం ఒకటిగా పరిశోధకులు తేల్చారు. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహం సామర్ధ్యాన్నిఅంచనా వేశారు. టీఓఐ 700 అనే గ్రహం ఇతర రెండు గ్రహాలతో పోల్చితే దాని నక్షత్రాన్ని చాలా దూరం నుండి కక్ష్యలో తిరుగుతుంది. ఈ గ్రహంలో ఒక వైపు ఎప్పుడూ పగటి వెలుగు ఉంటుందని గుర్తించారు. గతంలో టీఓఐ 700 గ్రహం వేడిగా ఉంటుందని భావించారు, వ్యోమగాములు ఈ మూడు గ్రహాలూ మానవులకు నివాస యోగ్యం కాదని భావిస్తున్నా, ఈ గ్రహం భూ మండలంతో సమానంగా ప్రవర్తిస్తుందో లేదో నిర్ణయించలేమని, ఏదో ఒక రోజు, మనకు ఈ గ్రహం స్పెక్ర్టం లభించినప్పుడు దీని ఆంతర్యాన్ని పసిగట్టవచ్చని, వాటిని దగ్గరి అనుకరణ స్పెక్ట్రమ్‌తో సరిపోల్చవచ్చని నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకుడు గాబ్రియెల్ ఎంగెల్మన్ సుయిసా వెల్లడించారు. -
వాతావరణంలో అధికంగా సీఓ2
పారిస్: మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థాయిని దాటుతోంది. భూమిని వేడెక్కించే కార్బన్డయాక్సైడ్(సీఓ2) స్థాయిలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వాతావరణంలో 415.26 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్) సీఓ2 ఉన్నట్లు గుర్తించారు. 1950ల నుంచి వాతావరణంలోని సీఓ2 స్థాయిలను ప్రతి రోజూ రికార్డు చేస్తున్న ఈ అబ్జర్వేటరీ ఇంతటి గరిష్ట స్థాయిలను గుర్తించడం ఇదే ప్రథమం. ఈ స్థాయిలో భూ వాతావరణంలో సీఓ2 ఎప్పుడో 30 లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. భూ ఉష్ణోగ్రత సరాసరిన ఏడాదికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతోందన్నారు. -
చంద్రుడిపై మూడు ఎకరాలు కొన్న హీరో
న్యూఢిల్లీ: భూమి ధరలు కొండెక్కాయి.. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. మరి దీనికి పరిష్కారం లేదా.. ఉంది..! అదే చంద్రుడిపైకి వెళ్లిపోండి ఎంచక్కా.. అది కూడా కేవలం రూ.2 వేలతో! ఇటీవల బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా అక్కడ మూడెకరాల స్థలం కొన్నారు. చంద్రుడిపై, అరుణగ్రహంపై ఆస్తులు అమ్ముతామని చాలా కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. చంద్రుడిపై ఎకరా స్థలం కేవలం రూ.2,300కే అమ్ముతామని ‘ఓయ్ హ్యాపీ’ అనే కంపెనీ చెబుతోంది. చంద్రుడిపై స్థలం కావాలనుకునే వారు ఒక ఫారం నింపి ఇస్తే చాలు.. చంద్రుడిపై స్థలం వివరాలతో కూడిన ఓ సర్టిఫికెట్ ఇస్తామని ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ పేర్కొంటున్నారు. అయితే దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుందని, నిజంగా దీనిపై హక్కులు ఉండవన్నారు. రోజుకు దాదాపు 30 కొనుగోళ్లు జరుగుతున్నాయని, వాలంటైన్స్ డే, మదర్స్ డే వంటి రోజుల్లో ఈ కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయన్నారు. -
ప్లూటోను గ్రహంగా గుర్తించండి
వాషింగ్టన్: నవగ్రహాల్లో ఒకటిగా ఉండి.. 2006లో గ్రహ హోదాను కోల్పోయిన ప్లూటోను మళ్లీ గ్రహంగా గుర్తించాలని ఆరేళ్ల చిన్నారి నాసాకు లేఖ రాసింది. వివరాల్లోకెళ్తే... ఐర్లాండ్‌కు చెందిన కారా ఒ కానర్ అనే ఆరేళ్ల బాలిక నుంచి నాసాకు ఓ లేఖ వచ్చింది. దాంట్లో.. ‘నేను ఒక సాంగ్ విన్నా.. దానిలో గ్రహాల జాబితాలో ప్లూటో చివరి వరుసలో ఉంది. క్యూపర్ బెల్ట్‌లోని నెప్యూట్ పక్కన ప్లూటో ఉంటుందనే విషయం నాకు తెలుసు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జుపిటర్ వరుసలో ప్లూటో కూడా ఉండాలి. మరుగుజ్జుదంటూ దానిని తొలగించడానికి వీల్లేదు. వెనే గ్రహాల లిస్టులో ప్లూలోను కూడా చేర్చండి. ఏ గ్రహం మరుగుజ్జుది కాదు. భవిష్యత్తులో నేను కూడా ఆస్ట్రోనాట్‌ను కావాలనుకుంటున్నాన’ని పేర్కొంది. కానర్ లేఖకు నాసా డైరెక్టర్ స్పందిస్తూ... ‘నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పిన దానితో నేనూ ఏకిభవిస్తున్నాను. కానీ ఈ ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ప్రతీది మారుతూ ఉంటుంది. ప్లూటో మరుగుజ్జు గ్రహమా కాదా అనేది పక్కనబెడితే దానిపై పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. భవిష్యత్తులో నువ్వు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టగలవనే నమ్మకం నాకుంది. అయితే అప్పటిదాకా నువ్వు చాలా బాగా చదువుకోవాలి. త్వరలో నాసాలో నిన్ను చూస్తానని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. -
ఆ తొమ్మిదో గ్రహం ఉండొచ్చు!
వాషింగ్టన్: ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్ ఎర్త్’ఈ ప్లానెట్ 9 కావొచ్చని భావిస్తున్నారు. ప్లానెట్ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉందని చెబుతున్నారు. ప్లానెట్ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాంటిన్ బాటీజిన్ తెలిపారు. ప్లానెట్ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థి ఎలిజబెత్ బెయిలీ పేర్కొన్నారు. -
కనిపించని ఓ సూపర్ ఎర్త్.. ప్లానెట్–9
వాషింగ్టన్: సౌర వ్యవస్థలో ఉనికిలో ఉందని భావిస్తున్న ప్లానెట్–9 గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహం బరువు భూమి కంటే 10 రెట్లు ఎక్కువగాను, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ కంటే 20 రెట్లు దూరంలోనూ ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. కనిపించకుండా దోబూచులాడుతున్న ఈ ప్లానెట్–9 గ్రహాన్ని కనపించని ఓ సూపర్ ఎర్త్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. అయితే బరువులో మంచు గ్రహాలైన యూరేనస్, నెప్ట్యూన్ కంటే ప్లానెట్–9 గ్రహం బరువు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహ ఉనికికి సంబంధించి ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని, అయితే ప్రస్తుతం ఆ గ్రహ ఉనికిని తెలిపే 5 పరిశీలనాత్మక ఆధారాలు లభించాయని అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లానెటరీ ఆస్ట్రోఫిజియిస్ట్ కాన్స్టాంటిన్ బాజిన్ వివరించారు. -
సౌర వ్యవస్థలో మరో గ్రహం ఆనవాళ్లు
వాషింగ్టన్: త్వరలోనే మన సౌర వ్యవస్థలోకి మరో గ్రహం వచ్చి చేరబోతోందా.. ? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఉందని భావిస్తున్న ప్లానెట్–9 గ్రహం కంటే ముందుగా ప్లానెట్–10 అనే మరో గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మన సౌర వ్యవస్థ బాహ్య వలయంలో అంతు చిక్కని ప్లానెట్–10 అనే గ్రహం ఒకటి దాగి ఉండే అవకాశం ఉందని తాజా పరిశో« దనలో వెలుగుచూసింది. అంగారకుడి లాంటి గ్రహం ఒకటి మన సౌర వ్యవస్థ చుట్టూ పరిభ్రమిస్తోన్న ఆధారాలు లభించాయని, బహుశా ఇది ప్లానెట్–10 కావచ్చని ఈ పరిశోధనలో భాగమైన భారత సంతితి శాస్త్రవేత్త, అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో పనిచేస్తున్న రేణు మల్హోత్రా వెల్లడించారు. -
అరుణగ్రహం... రేపటి గృహం!
ఈ వ్యవహారం.... ‘ఆలు లేదు చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం’ అనైనా అనుకోండి. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట’ అనైనా అనుకోండి. పక్క ఫోటోలో కనిపిస్తున్నవి మాత్రం అరుణగ్రహంపై కట్టబోయే ఇళ్ల నమూనాలట! భూమికి కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణగ్రహంపై మనిషి ఇప్పటివరకూ అడుగుపెట్టనేలేదు. అక్కడ నీరుందని నిర్ధారణైందే కొన్నేళ్ల క్రితం. అయినాసరే.. శాస్త్రవేత్తలు ఎప్పుడో భవిష్యత్తులో అక్కడ మనం నివసించడం గ్యారెంటీ అన్న అంచనాతో అన్నీ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లండన్‌లోని రాయల్ అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ పెట్రానెక్ ఈ ‘రేపటి ఇంటి’ని డిజైన్ చేశారు. ధ్రువప్రాంత ప్రజలు నిర్మించుకునే ఇళ్లు ఇగ్లూలను పోలిన ఈ ఇల్లు ఒక మనిషి బతికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో కూడి ఉంటుంది. మనషులందరికీ దూరంగా ఉండే మార్స్ నివాసితుల కోసమని ఈ ఇంట్లో ఓ త్రీడీ ప్రింటర్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్, టీవీలు ఉంటాయిట. ఇవన్నీ వినోదం కోసం ఏర్పాటు చేశామని స్టీఫెన్ అంటున్నారు. వండుకోవడానికి ఓ మైక్రోవేవ్... పడుకునేందుకు ఓ బెడ్ ఉన్నాయి. వీటితోపాటు విపత్కర పరిస్థితుల్లో సురక్షితంగా ఉండేందుకని ప్రతి ఇంట్లో నేలకు కొన్ని అడుగుల లోతున మరో నాలుగు నిద్రించే గదులు ఏర్పాటు చేయాలని స్టీఫెన్ సూచిస్తున్నారు. అంతా బాగానే ఉందిగానీ.. వీళ్లు ఏం తిని బతకాలి? అంటే.... ఇంటి పైకప్పు ప్రాంతంలో చిన్నపాటి తోట లాంటిది ఏర్పాటు చేశారు. దీంట్లో కాయగూరల్లాంటివి పండించుకుని తినాలన్నమాట. అరుణ గ్రహంపై తిరిగేందుకు అవసరమైన ప్రెషర్ సూట్ కూడా ఉంటుంది. ఇదే లేకపోతే అక్కడి తేలిక వాతావరణానికి మనిషి కనుగుడ్లు పుర్రెలోంచి బయటకు వచ్చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకీ ప్రస్తుత అంచనాల ప్రకారం మనిషి అంగారకుడిపై జీవించేది ఎప్పుడో తెలుసా? కనీసం వందేళ్ల తరువాత! -
గురు ప్రదక్షిణ!
అయిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఫలించింది. గురు గ్రహం ‘అంతు’ కనుక్కోవడమే లక్ష్యంగా అంతరిక్షంలో గంటకు 1,30,000 కిలోమీటర్ల వేగంతో అవిచ్ఛిన్నంగా దూసుకుపోయిన వ్యోమ నౌక ‘జునో’ మంగళవారం గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ కక్ష్యలో అనుకున్న క్షణానికి, అనుకున్న చోట ఒడుపుగా ప్రవేశపెట్టగలగడ మన్నది అత్యంత సంక్లిష్టమైన పని. దీన్ని జయప్రదంగా పరిపూర్తి చేయడం నాసా శాస్త్రవేత్తల దీక్షాదక్షతలకు నిదర్శనం. దానిచుట్టూ ఒకటీ, రెండూ కాదు... ఏకంగా 63 చంద్రులు తిరుగాడుతుంటారు. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో తిరుగుతాయి. ఇవిగాక అసంఖ్యాకంగా తోకచుక్కలు, ఉల్కలు దానిపై నిత్యమూ పతనమవుతుం టాయి. ఇన్నిటినుంచి జునోను తప్పించి సురక్షితమైన ప్రాంతంలో పెట్టడం వారి కొక సవాలు. గురుడికున్న పెద్ద చంద్రులు కేలిస్టో, గానిమీడ్ల కక్ష్యను దాటి... యూరోపా, అయోలను తప్పించుకుని ముందుగానే నిర్ణయించిన కక్ష్యను జునో అందుకుంది. దానికి అమర్చిన ప్రధాన ఇంజిన్‌ను మండించడం వల్లనే అది సాధ్యమైంది. ఇన్ని కోట్ల కిలోమీటర్ల పయనం తర్వాత అది అసలు మండు తుందా... మండినా కావలసిన స్థాయిలో జునో వేగాన్ని నియంత్రించేలా చేయ గలమా అన్నది అయిదేళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. ఒక సంకేతం పంపాక దాని ఫలితాన్ని తెలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్నిబట్టి మళ్లీ మరో సంకేతాన్ని అందించాల్సి ఉంటుంది. ఎంతో ఏకాగ్రత, ఖచ్చితత్వం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యంకాదు. అనుకున్నట్టే ఇదంతా 35 నిమిషాల వ్యవధిలో పూర్త యింది. అందులో క్షణమాత్రం ఆలస్యమైనా జునో జాడ తెలియకుండా మాయ మయ్యేది. 101 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,812 కోట్లు)ప్రాజెక్టు వృథా అయ్యేది. ఇన్ని సంక్లిష్టతలుండబట్టే ఇది అత్యంత కఠోరమైన ప్రాజెక్టుగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. 2011 ఆగస్టు 5న నాసా జునోను ప్రయోగించింది. ఇప్పటివరకూ మొత్తంగా ఇది 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. బృహస్పతిగా నామాంతరమున్న గురుగ్రహం ఆదినుంచీ మానవాళికి అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం గురుడే. దాన్ని గురించి మానవాళికి తెలిసింది గోరంతయితే...తెలియాల్సింది కొండంత. ఇదంత సులభమేమీ కాదు. అందుకు కారణం దాన్ని దట్టంగా కమ్ముకునే వాయు మేఘాలే. అందులో హైడ్రోజన్ వాటా 90 శాతమైతే మిగిలిందంతా హీలియం. ఇంకా మీథేన్, గంథకం, అమోనియా, నీరు వంటివి కూడా ఉన్నాయి. ఈ వాయువుల్లో ఘన పదార్థంగా మారినవెన్నో, ఇంకా వాయురూపంలో ఉన్నవెన్నో తెలియదు. భూమికి 318 రెట్లు పెద్దగా ఉండే గురుగ్రహం ఇంద్రధనస్సులా అనేక రంగులతో మెరుస్తూ కనడటానికి కారణం ఈ పదార్థాలూ, వాయువులే అంటారు. అంతేకాదు... నుదుట సిందూరంలా ఈ గురుగ్రహంపై ఎర్రగా మెరిసే బింబం కూడా ఉంది. దాని పరిమాణమే భూమికి మూడింతలుంటుంది. పైగా అది స్థిరంగా కాక కదులుతూ ఉంటుంది. ఆరురోజులకొకసారి వేగంగా తిరుగాడుతూ కనబడుతుంది. గురు గ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. ఈ ఎర్రబొట్టును తొలిసారి 1831లో పసిగట్టారు. అప్పటినుంచీ దీన్ని ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జునో అదేమిటో చెప్పగలుగుతుందా అన్నది చూడాలి. అంతేకాదు...జునో నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి. దాని గురుత్వాకర్షణ శక్తిని, దాన్లోని అయస్కాంత క్షేత్ర విస్తృతిని అది చెప్పాలి. అక్కడి నీరు ఏ పరిమాణంలో ఉన్నదో వెల్లడించాలి. ఆక్సిజన్, హైడ్రోజన్ల నిష్పత్తి ఎలా ఉందో లెక్కగట్టాలి. గురుగ్రహ అంతర్భాగంనుంచి నుంచి నిరంతరాయంగా వెలువడే సూక్ష్మ తరంగాల ధగధగలనూ, వాటి ఉష్ణ తీవ్రతనూ కొలవాలి. వాటి ఆనుపానులను పసిగట్టాలి. అసలు గురుగ్రహం కేవలం వాయు వుల సమూహంగానే ఉన్నదా... లేక వాటిల్లో కొంత భాగమైనా చిక్కబడి కఠిన శిలగా రూపాంతరం చెందిందా అన్నదీ తేల్చాలి. ఇవన్నీ పరిశోధించడానికి జునోలో 9 ఉపకరణాలున్నాయి. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలు తీసి పంపడానికి అత్యంత శక్తిమంతమైన కెమెరా ఉంది. గురుణ్ణి 3,000 మైళ్ల దూరంనుంచి గమనిస్తూ జునో ఈ పనులన్నీ చేస్తుంది. చంద్రుడు భూమికి 2,38,800 మైళ్ల దూరంలో పరిభ్రమిస్తున్నాడని గుర్తుంచుకుంటే జునో గురుడికి ఎంత సమీపంగా వెళ్లిందో అర్ధమవుతుంది. గురుణ్ణి పలకరించడానికి వ్యోమ నౌక వెళ్లడం ఇదే తొలిసారేమీ కాదు. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్-10 అక్కడి వరకూ వెళ్లింది. 2003 వరకూ సంకేతాలు పంపుతూనే ఉంది. ఆ తర్వాత ఏమైందో పత్తాలేదు. 1977లో మన సౌర వ్యవస్థ ఆవలికి ప్రయాణం కట్టిన వాయేజర్ వ్యోమనౌక గురుగ్రహాన్ని దాటే వెళ్లింది. 1995లో పంపిన గెలీలియో 2003 వరకూ గురువు చుట్టూ చక్కర్లు కొట్టింది. గురుడిపై ఒక పరికరాన్ని జారవిడిచింది. 2000లో కసినీ అనే వ్యోమ నౌక దాన్ని ఫొటోలు తీసింది. అయితే జునోలో అమర్చిన వివిధ పరికరాలు వీటన్నిటికీ లేని విశిష్టతను దానికి చేకూర్చాయి. విజ్ఞానశాస్త్ర రంగంలో చేకూరే విజయాలు మన విశ్వంపైనా, దాని పుట్టుకపైనా మన అవగాహనను విస్తృతం చేస్తాయి. ఇప్పుడు జునో చేరేసే సమాచారం సౌర వ్యవస్థ ఎలా ఆవిర్భవించిందో, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో తెలి యడంతోపాటు మన భూమి పుట్టుకను అర్ధం చేసుకోవడానికి కూడా తోడ్ప డుతుంది. జునో తన పని పూర్తి చేయడానికి 2018 ఫిబ్రవరి వరకూ సమ యముంది. ఈలోగా గురుగ్రహంలోని అత్యుష్ణోగ్రతలు, ఇతరేతర పరిణామాలూ దాని శక్తిసామర్థ్యాలను కొంచెం కొంచెం దెబ్బతీస్తుంటాయి. దాని పరికరాల పని తీరును క్రమేపీ నిర్వీర్యం చేస్తుంటాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య నిర్దేశించిన లక్ష్యాన్ని జునో విజయవంతంగా పరిపూర్తి చేయగలదని, విశ్వరహఃపేటికను తెరుస్తుందని ఆశిద్దాం. -
జీవులుండే గ్రహం జాడ తెలిసింది!
వాషింగ్టన్: జీవుల ఉనికికి ఆస్కారమున్న గ్రహాన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిలో ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. భూమి నుంచి 1,200 కాంతి సంవత్సరాల దూరంలో శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ గ్రహంపై జీవులు నివసించడానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కెప్లర్-62f అనే గ్రహంపై పరిశోధనలు నిర్వహించి జీవుల ఉనికి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. భూమి కంటే 40 శాతం అధిక బరువుతో ఉన్న ఈ గ్రహంపై కావాల్సిన మోతాదులో ఉష్ణోగ్రతలు ఉండటం మూలంగా సముద్రాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుని కంటే తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉన్న ఓ నక్షత్రాన్ని కేంద్రంగా చేసుకొని పరిబ్రమిస్తున్న కెప్లర్-62f.. ఆ నక్షత్ర గ్రహమండలంలో ఐదో, చివరి గ్రహంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ గ్రహంపై ఉన్నటువంటి వాయువుల మిశ్రమాలు, కక్ష్య ఆకృతి లాంటి వివరాలను పరిశోధకులు నిర్థారించాల్సి ఉంది. -
నివాసయోగ్య గ్రహం గుర్తింపు!
మెల్బోర్న్: ఆవాసానికి అనువైన వూల్ఫ్ 1061సీ అనే గ్రహాన్ని గుర్తించినట్లు ఆస్ట్రేలియా ఖగోళ పరిశోధకులు ప్రకటించారు. మన సౌర వ్యవస్థ నుండి కేవలం 14 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి కంటే నాలుగు రెట్లు ద్రవ్యరాశి ఎక్కువగా ఉండి జీవులు నివసించడానికి అనువైన వాతావరణంతో ఉందని వెల్లడించారు. సౌర కుటుంబానికి దగ్గరలో ఉన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు గ్రహాలను కనుగొన్న పరిశోధకులు, మధ్యలో ఉన్నటువంటి 1061సీ గ్రహంలో నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రహంలో నీటి జాడ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డంకన్ రైట్ తెలిపారు. విశాలంగా ఉన్నటువంటి ఈ గ్రహం నివాసయోగ్యంగా ఉండటం, మన సౌరవ్యవస్థకు అత్యంత సమీపంలో దీనిని గుర్తించడం ఆసక్తిగా ఉందన్నారు. 1061సీ గ్రహం ఉపరితలం ఎక్కువ భాగం రాళ్లతో ఉన్నప్పటికీ, కొంత భాగంలో నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
మార్స్‌పైకి వెళ్లి.. రావచ్చు!
లండన్: మానవసహితంగా అరుణగ్రహంపైకి వెళ్లి తిరిగి రావడం సులువేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సోలార్ విండ్ సెయిల్(ఈ-సెయిల్) పరికరం ద్వారా ఆస్టరాయిడ్స్‌పై ఉన్న నీటిని వాడుకోవడం వల్ల ఇంధనం లేకుండానే ఈ ప్రయాణం సాధ్యపడుతుందంటున్నారు. 2006లో అభివృద్ధి చేసిన ఈ-సెయిల్ ఉల్కలపై ఉన్న నీటిని కనిపెట్టి.. అక్కడికి మైనింగ్ చేసే యంత్రాన్ని పంపి నీటిని సేకరిస్తుంది. అక్కడి నీటిని ఆవిరి రూపంలో చల్లటి కంటెయినర్లోకి ఎక్కించి, పూర్తిగా నిండిన తర్వాత దీన్ని మార్స్ కక్ష్యలోకి కాని, భూ ఉపరితలంపైకి కాని పంపిస్తారు. అక్కడ ఈ ఆవిరిని ద్రవరూప హైడ్రోజన్, ద్రవరూప ఆక్సిజన్‌గా మార్చి ఇంధనంగా వినియోగిస్తారు. -
అంగారకుడి ఉపరితలం కింద హిమనీనదాలు!
లండన్: అరుణగ్రహంపై భారీ హిమనీనదాలు ఉన్నాయట. ఉపరితలంపై దట్టమైన దుమ్ము, ధూళితో కూడిన పొర కింద 150 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంలో గడ్డకట్టిన హిమనీనదాలు ఉన్నాయట. వాటిలోని మొత్తం మంచును పర్చితే.. అంగారకుడి ఉపరితలంపై ఏకంగా మీటరు మందంతో మంచు పొర ఏర్పడుతుందట. సాధారణంగా మార్స్ ఉపరితలంపై ఎక్కడ చూసినా ఎర్రటి దుమ్ము మాత్రమే కనిపిస్తుంది. కానీ దట్టమైన ఆ దుమ్ముపొర కింద అనేక చోట్ల గడ్డకట్టిన నీరుతో కూడిన భారీ హిమనీనదాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్వో) పంపిన రాడార్ సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే అరుణగ్రహం ఉపరితలం కింద మంచు ఉండవచ్చని గతంలోనే అంచనా వేసినా, ఆ మంచు నీటితో ఏర్పడిందా? లేక కార్బన్ డయాక్సైడ్ వల్ల ఏర్పడిందా? అన్నది నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాడార్ సమాచారాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అది నీటిమంచేనని తేల్చారు. దుమ్ము పొర ఉండటం వల్లే ఆ మంచు ఆవిరైపోకుండా ఉన్నట్లు తెలిపారు. -
శుక్రుడిపై శాశ్వత నివాసం!
భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా భూమిని పోలిన వాతావరణం, ఇతర సానుకూలతలెన్నో శుక్రుడి వాతావరణంలో తేలే నగరాన్ని నిర్మించే యోచన వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శుక్రుడిపై దృష్టి సారించింది. మన సౌర వ్యవస్థలో భూమికి అతి సమీపంలో ఉండే గ్రహం అదే కావడంతో భారీ ప్రణాళికలు రూపొందించింది. సౌరశక్తితో నడిచే వ్యోమనౌకలను శుక్రుడిపైకి పంపించి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయాలని, క్రమంగా ఆ గ్రహంపై ఆకాశంలో తేలే మానవ కాలనీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నాసాకు చెందిన స్పేస్ మిషన్ అనాలిసిస్ విభాగ పరిశోధకులు డేల్ ఆర్నీ, క్రిస్ జోన్స్ ఈ ప్రతిపాదనలు చేశారు. అంగారక గ్రహంపైకి మనుషులను పంపేలోగానే శుక్రుడిపై పరిశోధనలు చేయడం ఉత్తమమని వారంటున్నారు. శుక్రుడిని లక్ష్యంగా చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ‘హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కాన్సెప్ట్(హవోక్) మిషన్‌గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనలో ముందుగా శుక్రుడిపైనున్న వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. భూమిపై 50 కి.మీ. ఎత్తున ఉన్నటువంటి వాతావరణమే వీనస్‌పై కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ భూమిపై కంటే కొంచెం తక్కువగా ఉంటాయని, అలాగే శుక్రుడిపై దిగే వ్యోమగాములకు ఎలాంటి రేడియేషన్ ముప్పు కూడా ఉండదని పేర్కొంటున్నారు. ఇక సూర్యుడికి మరింత దగ్గరగా ఉన్నందున శుక్రుడిపై భూమిపై కంటే 40 శాతం అధికంగా సౌర శక్తి లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న టెక్నాలజీ ప్రకారం అంగారకుడిపైకి వ్యోమగాములను పంపడానికి 500 రోజులకుపైగా పడుతుందని, అదే శుక్రుడిపైకి 440 రోజుల ప్రయాణంతోనే చేరుకోవచ్చు. ఈ సానుకూలతల దృష్ట్యా తొలి దశలో శుక్రుడి వాతావరణంపై అధ్యయనం చేసి, తర్వాతి దశలో అక్కడి వాతావరణంలోనే శాశ్వత మానవ కాలనీని నిర్మించాలని నాసా భావిస్తోంది. ముందుగా రోబోతో ప్రయోగం చేసి, తర్వాత ఇద్దరు వ్యోమగాములను అక్కడ నెల రోజుల పాటు ఉంచాలని చూస్తోంది. చివరిగా శాశ్వతంగా మనుషులు ఉండగలిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం సౌరశక్తితో నడిచే రెండు వ్యోమనౌకలను కూడా డిజైన్ చేస్తోంది.