అరుణగ్రహంపై ఒక వ్యక్తి నివసించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లతో నిర్మించిన ఇంటి నమూనా.
ఈ వ్యవహారం.... ‘ఆలు లేదు చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం’ అనైనా అనుకోండి. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట’ అనైనా అనుకోండి. పక్క ఫోటోలో కనిపిస్తున్నవి మాత్రం అరుణగ్రహంపై కట్టబోయే ఇళ్ల నమూనాలట! భూమికి కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణగ్రహంపై మనిషి ఇప్పటివరకూ అడుగుపెట్టనేలేదు. అక్కడ నీరుందని నిర్ధారణైందే కొన్నేళ్ల క్రితం. అయినాసరే.. శాస్త్రవేత్తలు ఎప్పుడో భవిష్యత్తులో అక్కడ మనం నివసించడం గ్యారెంటీ అన్న అంచనాతో అన్నీ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లండన్‌లోని రాయల్ అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ పెట్రానెక్ ఈ ‘రేపటి ఇంటి’ని డిజైన్ చేశారు.
ధ్రువప్రాంత ప్రజలు నిర్మించుకునే ఇళ్లు ఇగ్లూలను పోలిన ఈ ఇల్లు ఒక మనిషి బతికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో కూడి ఉంటుంది. మనషులందరికీ దూరంగా ఉండే మార్స్ నివాసితుల కోసమని ఈ ఇంట్లో ఓ త్రీడీ ప్రింటర్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్, టీవీలు ఉంటాయిట. ఇవన్నీ వినోదం కోసం ఏర్పాటు చేశామని స్టీఫెన్ అంటున్నారు. వండుకోవడానికి ఓ మైక్రోవేవ్... పడుకునేందుకు ఓ బెడ్ ఉన్నాయి. వీటితోపాటు విపత్కర పరిస్థితుల్లో సురక్షితంగా ఉండేందుకని ప్రతి ఇంట్లో నేలకు కొన్ని అడుగుల లోతున మరో నాలుగు నిద్రించే గదులు ఏర్పాటు చేయాలని స్టీఫెన్ సూచిస్తున్నారు. అంతా బాగానే ఉందిగానీ.. వీళ్లు ఏం తిని బతకాలి? అంటే.... ఇంటి పైకప్పు ప్రాంతంలో చిన్నపాటి తోట లాంటిది ఏర్పాటు చేశారు. దీంట్లో కాయగూరల్లాంటివి పండించుకుని తినాలన్నమాట. అరుణ గ్రహంపై తిరిగేందుకు అవసరమైన ప్రెషర్ సూట్ కూడా ఉంటుంది. ఇదే లేకపోతే అక్కడి తేలిక వాతావరణానికి మనిషి కనుగుడ్లు పుర్రెలోంచి బయటకు వచ్చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకీ ప్రస్తుత అంచనాల ప్రకారం మనిషి అంగారకుడిపై జీవించేది ఎప్పుడో తెలుసా? కనీసం వందేళ్ల తరువాత!