‘స్పేస్‌’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్‌  హోటల్‌ | 3D Printing Hotel On Earth As Rehearsal For Homes In Space | Sakshi
Sakshi News home page

3D Printing Hotel: భవిష్యత్తులో చందమామ, అంగారకుడిపైకి వెళ్తే ఇళ్లు కట్టుకోవడం ఎలా.. ఇదిగో సమాధానం..!

Published Sat, Apr 8 2023 2:59 AM | Last Updated on Sat, Apr 8 2023 5:32 AM

3D Printing Hotel On Earth As Rehearsal For Homes In Space - Sakshi

ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్‌’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? 
భవిష్యత్తుకు   బాటలు వేసేలా.. 
మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్‌’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్‌ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్‌ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది.
ఏమిటీ హోటల్‌ ప్రత్యేకతలు? 
ఈ హోటల్‌లో త్రీడీ విధానంలో ప్రింట్‌ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్‌ పూల్, స్పా, ఆరుబయ­ట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. 
దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్‌’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్‌లు, బాత్రూమ్‌లతో ఆ ఇళ్లు ఉంటాయి. 
గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్‌లు, టేబుల్స్‌ వంటి కొంత ఫర్నిచర్‌ను కూ­డా త్రీడీ విధానంలోనే ప్రింట్‌ చేయనున్నారు.  
చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపో­యేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. 
ఎడారిలో క్యాంపింగ్‌ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్‌ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్‌ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్‌ హోటల్‌ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. 
ప్రఖ్యాత ఆర్కిటెక్చర్‌ కంపెనీ ‘బిగ్‌ (బ్జర్కే ఇంగెల్స్‌ గ్రూప్‌)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్‌ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. 

ఇక్కడ చేసి.. చూపించి..
‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ 
– ‘ఐకాన్‌’ సహ వ్యవస్థాపకుడు జేసన్‌ బల్లార్డ్, హోటల్‌ యజమాని లిజ్‌ లాంబర్ట్‌
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement