గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం! | NASA Will Launching Major mission Jupiter Moon Europa | Sakshi
Sakshi News home page

గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!

Published Mon, Oct 7 2024 7:04 PM | Last Updated on Mon, Oct 7 2024 8:45 PM

NASA Will Launching Major mission Jupiter Moon Europa

గురుడిపై జీవులకు నివాసయోగ్యమేనా?

అధ్యయనానికి ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్

10న ఫ్లోరిడా నుంచి ప్రయోగం

2030లో గురుడి కక్ష్యలోకి అంతరిక్ష నౌక ఖర్చు రూ.42 వేల కోట్లు

భూమి మినహా ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా? కోట్లాది నక్షత్ర మండలాలు, తారాతీరాలు, గ్రహాలు... సుదూరాన ఇలా ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి పరిఢవిల్లుతోందా? భూమి కాకుండా ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై జీవరాశి జాడ తెలుసుకోవడమెలా? జీవులకు ఆవాసయోగ్యమైన భౌమ్యేతర ప్రదేశాలను కనిపెట్టడమెలా? జీవం ఉనికి, జీవుల మనుగడకు సంబంధించి సానుకూల పరిస్థితులతో ఆశలు రేకెత్తిస్తున్న ప్రదేశాలు మన సౌరకుటుంబంలో ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ సాగాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? ఈ అన్వేషణకు ఒక సరైన, అత్యుత్తమ ప్రదేశమేదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఈ నెల 10న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. 

జలం మూలం ఇదం జీవం! 
జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. యూరోపాపై ఏకంగా ఓ భారీ సముద్రమే ఉంది! దాని అడుగుభాగం శిలానిర్మితమని, ప్రాణుల మనుగడకు అవసరమైన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. ఈ ‘బిల్డింగ్ బ్లాక్స్’ యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉంటాయని; తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ మూలకాలను దానిపై విడిచిపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీది సమస్త శక్తికీ సూర్యుడే ఆధారం. కిరణజన్యసంయోగ క్రియతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.

మొక్కలను తినడం ద్వారా మానవులు, జంతువులకు శక్తి బదలాయింపు జరుగుతుంది. కానీ యూరోపాలోని మహాసముద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని భావిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగానే రసాయన చర్యల వల్ల యూరోపాలోని సముద్రంలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని ఊహిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలా కాలం గడిచి ఇక జీవం పుట్టే సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా అక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న ప్రదేశం యూరోపానే!

యూరోపా.. ఆశల లోకం!
జీవాన్వేషణలో ‘నాసా’ యూరోపాను ఎంచుకోవడానికి కారణాలు బోలెడు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో తన టెలిస్కోపుతో కనుగొన్నారు. ఆ గెలీలియన్ మూన్స్ పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో యూరోపా మన చంద్రుడి సైజులో ఉంటుంది. యూరోపా ఓ ‘ఐసీ మూన్’. దాని ఉపరితలం మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 5-40 కిలోమీటర్లు. మంచు పొర కింద 50-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. మన భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని ఆ మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. 

యూరోపా ఉపరితలంపై పెద్ద సంఖ్యలో పగుళ్లు, కొద్దిపాటి బిలాలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా దాని ఉపరితలం భౌగోళికంగా క్రియాశీలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి కానే కాదు! అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వబోవటం (డ్రిల్ చేయడం) లేదు. అలాగే అక్కడి మహా సముద్రం లోపలికి చొచ్చుకెళ్లి పరిశీలించబోవడం లేదు కూడా. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవుల ఆవాసానికి అవసరమైన నివాసయోగ్యతా సామర్థ్యం యూరోపాకు ఉందా? ఆసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును నాసా చేపడుతోంది. భవిష్యత్ మిషన్లకు అవసరమయ్యే ముఖ్య సమాచారాన్ని యూరోపా క్లిప్పర్ నౌక సంపాదించబోతోంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిరులు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి నిటారుగా పైకి లేస్తున్న నీటి ఆవిరులు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.

క్లిప్పర్.. అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్! 
గ్రహాంతర అన్వేషణ కోసం ‘నాసా’ ఇప్పటివరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక బరువు 6 టన్నులు. ఇందులో ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో 9 శాస్త్రీయ పరికరాలు అమర్చారు. యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ వాటిలో ఉన్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ నౌక ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే! బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువగా (77 కోట్ల కిలోమీటర్లు) ఉంటుంది. 

సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక సూర్యకిరణాలు కూడా బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, ఆ డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. తక్కువ ఇంధనం వినియోగం నిమిత్తం తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని ‘యూరోపా క్లిప్పర్’  ఉపయోగించుకుంటుంది. ఐదున్నరేళ్లు సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2030 ఏప్రిల్లో ‘యూరోపా క్లిప్పర్’ గురుగ్రహం కక్ష్యను చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోమారు గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. 

గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ ప్రమాదం మెండు. అందుకే క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటు చేశారు. యూరోపాలో మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, దాని లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టాలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ (జ్యూస్) మిషన్ కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. అయితే, హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను తాకే అవకాశమున్నందున యూరోపా క్లిప్పర్ ప్రయోగం వాయిదా పడొచ్చు. కానీ, నాసా మాత్రం ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. 

-జమ్ముల శ్రీకాంత్.
(Courtesy: NASA, The New York Times, Space.com, Astrobiology News, TIME, CNN, Business Standard, DNA, Mint, The Economic Times, Hindustan Times).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement