jupiter planet
-
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!
భూమి మినహా ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా? కోట్లాది నక్షత్ర మండలాలు, తారాతీరాలు, గ్రహాలు... సుదూరాన ఇలా ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి పరిఢవిల్లుతోందా? భూమి కాకుండా ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై జీవరాశి జాడ తెలుసుకోవడమెలా? జీవులకు ఆవాసయోగ్యమైన భౌమ్యేతర ప్రదేశాలను కనిపెట్టడమెలా? జీవం ఉనికి, జీవుల మనుగడకు సంబంధించి సానుకూల పరిస్థితులతో ఆశలు రేకెత్తిస్తున్న ప్రదేశాలు మన సౌరకుటుంబంలో ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ సాగాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? ఈ అన్వేషణకు ఒక సరైన, అత్యుత్తమ ప్రదేశమేదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఈ నెల 10న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. జలం మూలం ఇదం జీవం! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. యూరోపాపై ఏకంగా ఓ భారీ సముద్రమే ఉంది! దాని అడుగుభాగం శిలానిర్మితమని, ప్రాణుల మనుగడకు అవసరమైన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. ఈ ‘బిల్డింగ్ బ్లాక్స్’ యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉంటాయని; తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ మూలకాలను దానిపై విడిచిపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీది సమస్త శక్తికీ సూర్యుడే ఆధారం. కిరణజన్యసంయోగ క్రియతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం ద్వారా మానవులు, జంతువులకు శక్తి బదలాయింపు జరుగుతుంది. కానీ యూరోపాలోని మహాసముద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని భావిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగానే రసాయన చర్యల వల్ల యూరోపాలోని సముద్రంలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని ఊహిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలా కాలం గడిచి ఇక జీవం పుట్టే సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా అక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న ప్రదేశం యూరోపానే!యూరోపా.. ఆశల లోకం!జీవాన్వేషణలో ‘నాసా’ యూరోపాను ఎంచుకోవడానికి కారణాలు బోలెడు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో తన టెలిస్కోపుతో కనుగొన్నారు. ఆ గెలీలియన్ మూన్స్ పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో యూరోపా మన చంద్రుడి సైజులో ఉంటుంది. యూరోపా ఓ ‘ఐసీ మూన్’. దాని ఉపరితలం మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 5-40 కిలోమీటర్లు. మంచు పొర కింద 50-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. మన భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని ఆ మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపా ఉపరితలంపై పెద్ద సంఖ్యలో పగుళ్లు, కొద్దిపాటి బిలాలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా దాని ఉపరితలం భౌగోళికంగా క్రియాశీలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి కానే కాదు! అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వబోవటం (డ్రిల్ చేయడం) లేదు. అలాగే అక్కడి మహా సముద్రం లోపలికి చొచ్చుకెళ్లి పరిశీలించబోవడం లేదు కూడా. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవుల ఆవాసానికి అవసరమైన నివాసయోగ్యతా సామర్థ్యం యూరోపాకు ఉందా? ఆసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును నాసా చేపడుతోంది. భవిష్యత్ మిషన్లకు అవసరమయ్యే ముఖ్య సమాచారాన్ని యూరోపా క్లిప్పర్ నౌక సంపాదించబోతోంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిరులు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి నిటారుగా పైకి లేస్తున్న నీటి ఆవిరులు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్.. అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్! గ్రహాంతర అన్వేషణ కోసం ‘నాసా’ ఇప్పటివరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక బరువు 6 టన్నులు. ఇందులో ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో 9 శాస్త్రీయ పరికరాలు అమర్చారు. యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ వాటిలో ఉన్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ నౌక ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే! బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువగా (77 కోట్ల కిలోమీటర్లు) ఉంటుంది. సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక సూర్యకిరణాలు కూడా బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, ఆ డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. తక్కువ ఇంధనం వినియోగం నిమిత్తం తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని ‘యూరోపా క్లిప్పర్’ ఉపయోగించుకుంటుంది. ఐదున్నరేళ్లు సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2030 ఏప్రిల్‌లో ‘యూరోపా క్లిప్పర్’ గురుగ్రహం కక్ష్యను చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోమారు గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ ప్రమాదం మెండు. అందుకే క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటు చేశారు. యూరోపాలో మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, దాని లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టాలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్ కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. అయితే, హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను తాకే అవకాశమున్నందున యూరోపా క్లిప్పర్ ప్రయోగం వాయిదా పడొచ్చు. కానీ, నాసా మాత్రం ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. -జమ్ముల శ్రీకాంత్.(Courtesy: NASA, The New York Times, Space.com, Astrobiology News, TIME, CNN, Business Standard, DNA, Mint, The Economic Times, Hindustan Times). -
అరుదైన ఘటన.. అతి సమీపానికి గురుశుక్రులు..ఏ రోజున అంటే..
న్యూయార్క్: గురు, శుక్ర గ్రహాలు పరస్పరం అత్యంత సమీపానికి రానున్నాయి. ఈ అరుదైన ఘటన మార్చి 1వ తేదీన కనువిందు చేయనుంది. ఆ రాత్రి భూమి నుంచి చూస్తే అవి రెండూ దాదాపు ఒకదాన్నొకటి ఆనుకున్నంత దగ్గరగా కన్పిస్తాయి! నిజానికవి ఎప్పట్లాగే పరస్పరం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాకపోతే సూర్యుని చుట్టూ వాటి పరిభ్రమణ క్రమంలో భాగంగా భూమి నుంచి చూసేవాళ్లకు మాత్రం ఆ రోజు పరస్పరం అత్యంత దగ్గరగా వచ్చినట్టు కన్పిస్తాయన్నమాట. దీన్ని మామూలు కళ్లతోనే చూడొచ్చు. సౌరమండలంలో సూర్యచంద్రుల తర్వాత అత్యంత ప్రకాశవంతమైనది శుక్రుడే. భూమికి అత్యంత సమీపంలో ఉండటంతో అప్పుడప్పుడూ పగటి పూటా కనిపిస్తుంటుంది! -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్‌ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్‌లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్‌కు 27, నెప్ట్యూన్‌కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే!
వాషింగ్టన్: సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి సోమవారం భూమికి అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సోమవారం సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది! -
ఇంతకీ ఇది ఏం దోశ.. తెలియడం లేదా?
ఇంటర్నెట్లో దీనిపై భారీ చర్చనే నడిచింది. కొందరు ఎగ్ దోశ అని చెబితే.. మరికొందరు వాళ్లమ్మ వేసే మినప్పిండి దోశ సేమ్ ఇలాగే ఉంటుందని.. కాబట్టి.. ఇది అదే అని వాదించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ మాత్రం ఎహే.. ఇది ప్లెయిన్ దోశ అంటూ తేల్చేశారు. ఇంతకీ మీరేమంటారు? ఏం దోశ ఇది.. మసాలానా.. లేక మరేదైనానా.. సరిగ్గా తెలియడం లేదా.. టైం అప్.. నిజమేంటంటే.. అసలు ఇది దోశనే కాదు.. ఓ గ్రహం.. అది కూడా సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్దదైన బృహస్పతి(జుపిటర్). గతంలో నాసాకు చెందిన అంతరిక్ష నౌక ‘కసీని’ కక్ష్యలో తిరుగుతూ ఈ గ్రహాన్ని కింద నుంచి ఫొటో తీసింది. తాజాగా నాసా దీన్ని మళ్లీ విడుదల చేయడం.. ఈ ఫొటో దోశను పోలి ఉండటంతో ట్విట్టర్లో ‘ఇది ఏం దోశ’’ అనే చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా నెటిజన్లు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి చేశారు. -
భూమికి రక్షణ.. ‘గురు’తర బాధ్యతే..
సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొన్న ఓ ఆస్టరాయిడ్.. డైనోసార్లు సహా 90 శాతం జీవాన్ని తుడిచిపెట్టేసింది. అలాంటి ఆస్టరాయిడ్లు ఎన్నో భూమివైపు దూసుకొస్తూనే ఉంటాయి. కానీ గురుగ్రహం వాటిని మధ్యలోనే పట్టేసుకుని.. భూమిని కాపాడుతోంది. అలా గురుగ్రహం పట్టేసుకున్న ‘ట్రోజాన్ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసమే నాసా తాజాగా ‘ల్యూసీ’ వ్యోమనౌకను ప్రయోగించింది. సూర్యుడు, గ్రహాల పుట్టుక నుంచి భూమ్మీద జీవానికి మూలం దాకా.. ఎన్నో రహస్యాలను వాటి నుంచి తెలుసుకోవచ్చని చెబుతోంది. మరి ఆ ఆస్టరాయిడ్లు ఏంటి, గురుగ్రహం పట్టేసుకోవడం, భూమిని కాపాడుతుండటం ఏమిటో తెలుసుకుందామా? సైజు, బలం పెద్దవే.. మన సౌర కుటుంబంలో అతిపెద్దది గురుగ్రహం. ఇంచుమించు 1,300 భూగ్రహాలను కలిపితే.. గురుగ్రహం అవుతుంది. అంత పెద్ద గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే తనకు దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్లు, తోక చుక్కలను ఆకర్షించేస్తుంది. అందులో కాస్త పెద్దవి, దూరం నుంచి వెళ్తున్నవి అయితే వాటి కక్ష్యలను మార్చేసుకుని గురుగ్రహం ఆకర్షణకు లోబడి తిరుగుతుంటాయి. మిగతావన్నీ వెళ్లి ఆ గ్రహాన్ని ఢీకొని దానిలో కలిసిపోతాయి. ఈ క్రమంలోనే సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను గురుగ్రహం మధ్యలోనే అటకాయిస్తుంది. ఎక్కడివీ ఆస్టరాయిడ్లు.. సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో పదార్థమంతా అక్కడక్కడా గుమిగూడి గ్రహాలుగా ఏర్పడింది. అలా ఆకర్షణకు లోనుకాని శకలాలు, తోకచుక్కలు వంటివి అలాగే మిగిలిపోయాయి. వాటితోపాటు కొత్తలో చిన్నాపెద్ద గ్రహాలు, ఆస్టరాయిడ్లు ఢీకొట్టుకోవడంతో ఏర్పడిన శకలాలూ ఉన్నాయి. అవన్నీ సూర్యుడి చుట్టూ వివిధ కక్ష్యల్లో పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆస్టరాయిడ్లు.. గ్రహాల కక్ష్యలను దాటుకుంటూ ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి గ్రహాలను ఢీకొడుతుంటాయి. అలా సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఓ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడంతోనే.. డైనోసార్లు సహా చాలా రకాల జీవులు అంతరించిపోయాయి. భూమికి రక్షణగా.. సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చిన ఆస్టరాయిడ్లు గురుగ్రహం ఆకర్షణకు లోనై.. దాని కక్ష్యలో చేరిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కడో బయటి నుంచి వచ్చి చిక్కుకుపోయిన వీటిని ట్రోజాన్ ఆస్టరాయిడ్లుగా పిలుస్తున్నారు. ఇవి గురుగ్రహ కక్ష్యలోనే ఆ గ్రహానికి ముందు ఒక గుంపుగా, వెనుక మరో గుంపుగా తిరుగుతున్నాయి. ఇవి నేరుగా దూసుకొచ్చి ఉంటే.. వాటిలో కొన్ని అయినా భూమిని ఢీకొట్టి ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా జరగకుండా గురుగ్రహం భూమికి రక్షణ కల్పిస్తోందని అంటున్నారు. ► 1994 జూలైలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన గురుగ్రహం చిత్రమిది. షూమేకర్–లెవీ9 తోకచుక్కకు చెందిన పెద్ద పెద్ద శకలాలు గురుగ్రహం ఆకర్షణకులోనై దానిపై పడిపోవడాన్ని (ముదురు గోధుమ రంగులో ఉన్న ప్రాంతం) హబుల్ చిత్రీకరించింది. ఆ తర్వాత కూడా చాలా ఆస్టరాయిడ్లు గురుగ్రహాన్ని ఢీకొట్టాయి. ► తాజాగా గత నెల 13న ఓ ఆస్టరాయిడ్ గురుగ్రహాన్ని ఢీకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఓ పెద్ద ఆస్టరాయిడ్ గురుగ్రహం ఆకర్షణకు లోనై ముక్కలై, ఆ గ్రహంపై పడిపోయి ఉంటుందని జపాన్‌కు చెందిన ఎన్టీటీ కమ్యూనికేషన్ సైన్స్ ల్యాబ్ పరిశోధకుడు మార్క్ డెల్క్రోక్స్ వెల్లడించారు.(గత నెలలో గురుగ్రహాన్ని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు వెలువడిన కాంతి ఇది) శనిగ్రహంతోనూ రక్షణ సౌర కుటుంబంలో రెండో పెద్ద గ్రహమైన శనిగ్రహం కూడా ఆస్టరాయిడ్లను ఆకర్షించి, భూమికి రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుడి తరహాలోనే శనిగ్రహానికి ముందు, వెనుక కూడా కొన్ని ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయని చెప్తున్నారు. నాసా ‘ల్యూసీ’ మిషన్ ఎందుకు? సౌర కుటుంబం అంచుల్లో యురేనస్ గ్రహానికి అవతల కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని క్యూపియర్ బెల్ట్ అంటారు. సూర్యుడు, గ్రహాలు రూపొందిన కొత్తలోనే ఆ ఆస్టరాయిడ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. వాటిపై సూర్యుడి ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో.. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్ల నాటి ఆధారాలు అలాగే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనితోపాటు భూమిపై జీవం ఆవిర్భావానికి ఆస్టరాయిడ్ల నుంచి వచ్చిన పదార్థాలే కారణం కావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. అటు సౌర కుటుంబం గుట్టును, ఇటు జీవం ఆవిర్భావానికి మూలాలను తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ‘ల్యూసీ’ మిషన్‌ను చేపట్టింది. ► గురుడి ముందు, వెనకాల కలిపి ఇప్పటివరకు 6,500కుపైగా ట్రోజాన్ ఆస్టరాయిడ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ముందు పరిభ్రమిస్తున్న నాలుగింటిని, వెనకాల పరిభ్రమిస్తున్న మూడింటిని నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ►ల్యూసీ వ్యోమనౌక భూమి నుంచి ప్రయాణం ప్రారంభించి సూర్యుడిని చుట్టేసి.. తిరిగి భూమికి దగ్గరగా వస్తుంది. తర్వాత భూమి గ్రావిటీతో వేగం పెంచుకుని.. 2027లో గురు డి ముందున్న ఆస్టరాయిడ్ గ్రూప్‌కు చేరుకుంటుంది. అక్కడ 4 ఆస్టరాయిడ్లపై పరిశోధన చేశాక 2028లో భూమివైపు ప్రయాణిస్తుంది. ► రెండోసారి భూమి గ్రావిటీ నుంచి బలం పుంజుకుని.. 2032లో గురుగ్రహం వెనుక ఉన్న ఆస్టరాయిడ్ గ్రూప్‌కు చేరుకుని ఏడాదిపాటు పరిశోధన చేస్తుంది. ఒకవైపు ఆరేళ్లు, మరోవైపు ఆరేళ్లు.. కలిపి 12 ఏళ్లపాటు ప్రయాణం, పరిశోధన జరుగనున్నాయి. -
మరో భారీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్..!
టెక్సాస్: ఎలన్ మస్క్‌కు చెందిన స్పేప్‌ఎక్స్ మరోసారి నాసా నుంచి భారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. గురు గ్రహానికి చెందిన యూరోపా మూన్ ఉపగ్రహంపై నాసా దృష్టిసారించింది. యూరోపా మూన్ ఉపగ్రహంపై మానవుడు నివసించేందుకు అనువైన గ్రహంగా ఉంటుందని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది. యూరోపా ఉపగ్రహంపై పరిశోధనలను చేపట్టడానికి నాసా పూనుకుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు దక్కింది. స్పేస్ ఎక్స్‌తో సుమారు 178 మిలియన్ డాలర్ల( రూ. 1324 కోట్లు)తో నాసా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూరోపా క్లిప్పర్ మిషన్‌ను 2024 అక్టోబర్‌లో ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగించినున్నట్లు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు కార్గో వస్తువులను చేరవేస్తుంది. అంతేకాకుండా పలుమార్లు వ్యోమగాములను ఐఎస్ఎస్కు చేరవేసింది. 1972 తరువాత తిరిగి చంద్రుడిపైకి నాసా వ్యోమగాములను తీసుకెళ్లే ఆర్టిమిస్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 2.9 బిలియన్ డాలర్ల కాంట్రక్ట్‌ను కూడా స్పేస్ఎక్స్ సొంతం చేసుకుంది. -
‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు
వాషింగ్టన్ : ఖగోళానికి సంబంధించి మరో అరుదైన సమచారాన్ని నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా) సేకరించింది. సూర్యకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం యొక్క ఉపగ్రహం ఫోటోలను తీయగలిగింది. ఈ పని కోసం అత్యంతంత శక్తివంతమైన కెమెరాలను ఉపయోగించింది నాసా. జెనీమీడ్ సూర్య కుటుంబంలో పెద్దదైన గురు గ్రహానికి మొత్తం 79 ఉపగ్రహాలు ఉండగా ఇందులో 53 గ్రహాలను ఇప్పటి వరకు గుర్తించారు. వీటిలో అన్నింటికంటే జెనీమీడ్ పెద్దది. మొత్తం సౌరకుటుంబంలోనే ఉపగ్రహాల్లో జేనిమీడ్ పెద్దదిగా గుర్తింపు పొందింది. అయితే నాసా చేపట్టిన జూనోమిషన్లో భాగంగా తొలిసారిగా జెనీమీడ్‌కి సంబంధించిన చిత్రాలు భూమికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని నాసా స్వయంగా ప్రకటించింది. జూన్ 7న జూన్ 7న జూనో స్పేస్‌క్రాఫ్ట్ జేనీమీడ్కి దగ్గరగా వెళ్లింది. ఆ సమయంలో జెనీమీడ్‌కి సంబంధించిన చిత్రాలను షూట్ చేసింది.ఇందులో రెండు చిత్రాలను నాసా విడుదల చేసింది. జెనీమీడ్ ఉపరితం, ఎత్తు వంపులు ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లలో రెండు సార్లు మాత్రమే జెనీమీడ్‌కి సమీపంలోకి జూనో స్పేస్‌క్రాఫ్ట్ వెళ్ల గలిగింది. Hello, old friend. Yesterday our #JunoMission made the first close flyby of Jupiter’s giant moon Ganymede in more than 20 years, and the first two images have been received on Earth. 📸 More to come. See details at: https://t.co/zIVMO6waKH pic.twitter.com/2RiW3iSmIp — NASA Solar System (@NASASolarSystem) June 8, 2021 చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! -
గురుడి అందాలు అదుర్స్
హూస్టన్: అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా పంపిన జునో వ్యోమనౌక గురుగ్రహం పై అద్భుతమైన ఫొటోలను తీసింది. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన గురుడు కక్ష్యలోకి చేరినప్పటి నుంచి అక్కడి విశేషాలను జునో అందిస్తూనే ఉన్నది. దీని సాయంతో గత ఏడాది నుంచి గురు గ్రహానికి సంబంధించి సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా గురు గ్రహ వాతావరణానికి చెందిన ఓ కళ్లు చెదిరే ఫొటోను జునో తీసింది. దీనిని నాసా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటో తీసిన సమయంలో జూపిటర్కు చాలా దగ్గరగా జునో ఉంది. గురు గ్రహానికి ఉత్తర దిక్కుగా 13,345 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆ గ్రహంపై ఉన్న మేఘాలను చిత్రీకరించింది. డిసెంబర్ 16న ఈ ఫొటో తీసినట్లు నాసా తాజాగా వెల్లడించింది. -
మరుగుజ్జు గ్రహంపై నీటిఆవిరి!
వాషింగ్టన్: అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సీరీజ్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందట. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా సీరీజ్ వేడెక్కుతోందని, ఫలితంగా దాని నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలిస్కోపు సాయంతో కనుగొన్నారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు అయిన సీరీజ్ సుమారు 950 కి.మీ. సైజు ఉంటుంది. దీనిని తొలుత 1801 సంవత్సరంలో కనుగొన్నారు. ఆస్టరాయిడ్కు ఎక్కువ.. గ్రహానికి తక్కువ.. కావడంతో సీరీజ్ను మరుగుజ్జు గ్రహం(డ్వార్ఫ్ ప్లానెట్)గా ధ్రువీకరించారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఒక వస్తువుపై నీటి ఆవిరిని గుర్తించడం ఇదే తొలిసారి. సీరీజ్ ఉపరితలంలో మంచు, అంతర్భాగంలో శిలలు, భారీ ఎత్తున మంచు ఉంటుందని, ఆ మంచును కరిగిస్తే గనక.. భూమిపై ఉన్న మంచినీటి కంటే ఎక్కువ పరిమాణంలోనే నీరు వెలువడుతుందని అంచనా.