మరుగుజ్జు గ్రహంపై నీటిఆవిరి!
వాషింగ్టన్: అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సీరీజ్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందట. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా సీరీజ్ వేడెక్కుతోందని, ఫలితంగా దాని నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్‌ఏ) శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలిస్కోపు సాయంతో కనుగొన్నారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు అయిన సీరీజ్ సుమారు 950 కి.మీ. సైజు ఉంటుంది. దీనిని తొలుత 1801 సంవత్సరంలో కనుగొన్నారు. ఆస్టరాయిడ్‌కు ఎక్కువ.. గ్రహానికి తక్కువ.. కావడంతో సీరీజ్‌ను మరుగుజ్జు గ్రహం(డ్వార్ఫ్ ప్లానెట్)గా ధ్రువీకరించారు.
ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఒక వస్తువుపై నీటి ఆవిరిని గుర్తించడం ఇదే తొలిసారి. సీరీజ్ ఉపరితలంలో మంచు, అంతర్భాగంలో శిలలు, భారీ ఎత్తున మంచు ఉంటుందని, ఆ మంచును కరిగిస్తే గనక.. భూమిపై ఉన్న మంచినీటి కంటే ఎక్కువ పరిమాణంలోనే నీరు వెలువడుతుందని అంచనా.