
శనిగ్రహానికి కొత్తగా 128 మూన్స్
మొత్తం చందమామలు 274
అత్యధిక చంద్రులతో.. గురుడి రికార్డు బద్దలు కొట్టిన శని
‘చంద్ర సైన్యం’ (మూన్స్ ఆర్మీ) సంఖ్యాపరంగా రారాజు శనిని కొట్టే గ్రహం ఇక దరిదాపుల్లో లేదు, ఉండబోదు! శని గ్రహానికి నిన్నటిదాకా 146 చంద్రుళ్లు ఉండేవి. అవి కాకుండా కొత్తగా మరో 128 చందమామలు శని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. దీంతో శని గ్రహపు మొత్తం మూన్స్ సంఖ్య 274కి చేరింది. ఈ పరిశోధనను అంతర్జాతీయ ఖగోళ సంఘం కూడా గుర్తించింది.
మన సౌరకుటుంబంలో శని తర్వాత పెద్ద సంఖ్యలో మూన్స్(More Moons) కలిగిన గ్రహం గురుడు (బృహస్పతి). గురుడికి 95 మూన్స్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ రెండు గ్రహాలకు కొత్త చంద్రుళ్లను కనుగొంటూ వస్తుండటంతో చంద్రుళ్ళ సంఖ్యాపరంగా నువ్వా? నేనా? అన్నట్టు గురుడు, శని మధ్య దశాబ్దాల తరబడి యుద్ధం కొనసాగింది. అయితే..
శనికి తాజాగా ఒకేసారి భారీగా శతాధిక చంద్రుళ్లను కనుగొనడంతో ఈ రేసులో గురుడు ఓడిపోయాడనే చెప్పాలి. శని(Saturn)కి సంబంధించి కొత్తగా కనుగొన్న 128 చంద్రుళ్లలో 63 చంద్రుళ్లను 2019-2021 మధ్య కాలంలోనే చూచాయగా గుర్తించారు. మిగతావాటిని 2023లో వరుసగా మూడు నెలలపాటు పరిశీలించి కనుగొన్నామని అకడెమియా సిన్సియా (తైవాన్) ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆస్టన్ వెల్లడించారు.
అయితే ఈ 128 కొత్త మూన్స్ మన భూగ్రహపు(Earth) చంద్రుడు ఉన్నంత పరిమాణంలో లేవు. పైగా మన చంద్రుడిలా గోళాకారంగానూ లేవు. అవి చిన్న సైజులో బంగాళదుంపల్లా వంకరటింకర ఆకృతిలో ఉన్నాయి. సౌరకుటుంబం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఈ చిన్నపాటి ఖగోళ వస్తువుల సమూహాన్ని శని కక్ష్యలోని గురుత్వాకర్షణ శక్తి బంధించి ఉంటుందని, అనంతరం అవి ఎన్నోసార్లు ఢీకొని అంతిమంగా బుల్లి చంద్రుళ్లుగా మారి ఉంటాయని భావిస్తున్నారు. ఇలా చిట్టచివరిగా, లేటెస్టుగా అవి ఢీకొన్న సంఘటన 10 కోట్ల ఏళ్ల క్రితం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
శని గ్రహ ప్రత్యేకతలు తెలుసా?
👉274 చంద్రులతో గ్రహాల్లో కింగ్ ఆఫ్ మూన్స్‌గా లేటెస్ట్ ఫీట్ సాధించిన శని
👉2,80,000 కి.మీ కంటే ఎక్కువ వ్యాసంలో విస్తరించినప్పటికీ.. సన్నగా ఉండే వలయాలు అద్భుతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి
👉బాప్‌రే.. టబ్‌లో తేలుతుందంట!
గ్రహాల్లో కెల్లా అత్యంత తేలికైన గ్రహం ఇది. ప్రధానంగా హైడ్రోజన్, హీలియంతో నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. తగినంత పెద్ద టబ్ దొరికితే, శని నిజానికి దానిలో తేలుతుందట!
👉ప్రచండ గాలులకు కేరాఫ్
శని గ్రహం మీద గంటకు 1,800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంట!
👉అది అంతుచిక్కని రహస్యమే
షడ్భుజి Hexagon రహస్యం.. శని గ్రహంపై ఉత్తర ధ్రువం వద్ద 30,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఓ నిర్మాణం కనిపిస్తుంది. అయితే ఆరు వైపుల నిర్మాణం ఎలా ఏర్పడిందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.

:::జమ్ముల శ్రీకాంత్
(Credit: Science Alert)
Comments
Please login to add a commentAdd a comment