అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది.
‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం.
జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం.
-జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment