టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది.
ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం..
అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు.
చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment